పర్యావరణం, అడవులు, ఖనిజాలు, సహజ వనరులు అనేవి ప్రజల సంపద. కానీ లాభాల పేరుతో ప్రభుత్వాలు వీటిని కార్పొరేట్లకు అప్పగిస్తున్నాయి. లాభాల్లో ప్రభుత్వానికి అందే వాటా ద్వారా సంక్షేమ పథకాలు చేపడతామని, ప్రజలకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వాలు ఎన్ని కారణాలు చెప్పినా... జరిగే నష్టాన్ని చూస్తే అది ఏ మూలకు వుండదు. కేవలం ఒక శాతం ధనవంతులు మాత్రమే వినియోగించే ఆభరణం కోసం... పర్యావరణాన్ని నాశనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
వజ్రాల కోసం మధ్యప్రదేశ్ లో వనాలను నాశనం చేసేందుకు సిద్ధమయ్యారు. 'వజ్రపు కాంతులు' అంటూ పర్యావరణాన్ని హననం చేసే చర్యలు చేపట్టనున్నారు. ఛతర్‌పూర్ జిల్లా బక్స్‌వాహ అడవుల్లో త్వరలో రెండు లక్షలకు పైగా చెట్లను నరికేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బందర్ డైమండ్ బ్లాక్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ డైమండ్ మైనింగ్ కోసం దాదాపు అన్ని రకాల అనుమతులు తెచ్చుకున్నారు. ఈ ప్రాంతంలో మైనింగ్ పనులు ప్రారంభమైతే పర్యావరణ ముప్పు వాటిల్లడంతోపాటు ఆదివాసులు, వన్యమృగాల మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా ఆర్థిక వృద్ధి సాధించడంతోపాటు ప్రజలకు ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. నరికిన వృక్షాల కంటే ఎక్కువ మొత్తంలో మొక్కలు నాటుతామని చెబుతోంది. రెండు దశాబ్దాలుగా సా...గుతున్న 'వజ్రాల వేట'లో భవిష్యత్తులో పర్యావరణానికి, ఆదివాసులకు, వన్యప్రాణులకు ముప్పు వాటిల్లితే అధికార, విపక్షాలుగా వున్న బిజెపి, కాంగ్రెస్ బాధ్యత వహించాల్సి వుంటుంది.
అనుమతుల కోసం రెండు దశాబ్దాలు
మధ్యప్రదేశ్ లో సామాజికంగా, ఆర్థికంగా ఎంతో వెనకబడిన జిల్లా ఛతర్‌పూర్. ఈ జిల్లా పరిధిలోనే శతాబ్దాల క్రితం ఏర్పడిన బక్స్‌వాహ అడవులు విస్తరించి వున్నాయి. 2011 సెన్సస్ ప్రకారం ఇక్కడి జనాభా 10,216. అయితే ఈ అడవుల భూగర్భంలో వజ్రాలు ఉన్నాయని 2004లో ఆంగ్లో ఆస్ట్రేలియన్ కంపెనీ 'రియో టింటో' కనుగొన్నది. ఎన్నో సంప్రదింపుల తర్వాత 2010 అక్టోబర్‌లో అప్పటి మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందానికి ముందుకు వచ్చింది. ఈ ప్రాంతంలో వెలికి తీసిన వజ్రాల అమ్మకం ద్వారా వచ్చిన లాభాల్లో పది శాతం మైనింగ్ రాయల్టీ కింద ప్రభుత్వానికి ఇచ్చేందుకు రియో టింటో ఆఫర్ ఇచ్చింది. ఈ ప్రాంతంలో 2.74 కోట్ల క్యారెట్ల వజ్రాలు ఉన్నాయని అంచనా వేశారు. ఆ సమయంలో 971 హెక్టార్లలో అనుమతుల కోసం కంపెనీ ప్రయత్నించింది. సుమారు ఐదు లక్షల వృక్షాలను నరికేందుకు ప్రణాళికలు సైతం రూపొందించింది.
షెహ్లా మసూద్ హత్యతో...
పర్యావరణాన్ని కాపాడేందుకు, డైమండ్ మైనింగ్‌ను ఆపేందుకు పర్యావరణ కార్యకర్త, ఆర్.టి.ఐ కార్యకర్త షెహ్లా మసూద్ ప్రయత్నించారు. 2011లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, అప్పటి హోం మంత్రితోపాటు పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి మైనింగ్ అనుమతులు ఇవ్వవద్దని ఆమె లేఖలు రాశారు. అంతేకాకుండా అనుమతుల జారీలో నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వివరణ కోరింది. 2011 ఆగస్టు 16న షెహ్లా మసూద్ పట్టపగలే హత్యకు గురయ్యారు. ఆ సమయంలో చాలా మంది రియో టింటో కంపెనీ, డైమండ్ మాఫియాతో పాటు స్థానిక బిజెపి నాయకులపై అనుమానాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఖండించి కేసును సిబిఐ కి అప్పగించింది. షెహ్లా మసూద్ హత్య తర్వాత... ప్రముఖ పర్యావరణ పరిరక్షకుడు వాల్మీక్ థాపర్, 'పహల్' ఎన్.జి.ఓ, పలు స్వచ్ఛంద సంస్థలు... మైనింగ్ కు వ్యతిరేకంగా ఆందోళనలను ముందుకు తీసుకెళ్లాయి. ఫలితంగా 2016 మార్చిలో మైనింగ్‌కు ఎంచుకున్న ప్రాంతంలో నిబంధనలను ఉల్లంఘించకూడని, టైగర్ కారిడార్ సమీప ప్రాంతమని అటవీ సలహా కమిటీ నిర్ధారించింది. ఈ మైనింగ్‌ను జాతీయ పులుల సంరక్షణ సంస్థ కూడా వ్యతిరేకించింది. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పటి శివరాజ్ సింగ్ ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వం 2016 మైనింగ్ అనుమతులన్నింటిని రద్దు చేయాల్సి వచ్చింది. 76 హెక్టార్ల ప్రాంతంలోనైనా మైనింగ్ చేసేందుకు అనుమతులు ఇవ్వాలని రియో టింటో కంపెనీ కోరినా, దీన్ని కూడా అటవీ సలహా కమిటీ నిరాకరించింది. ఈ నేపథ్యంలో తాము ఈ ప్రాజెక్టును వదిలిపెడుతున్నట్టు 2017 ఫిబ్రవరిలో రియో టింటో కంపెనీ ప్రకటించింది. ఈ ప్రక్రియ ఇంతటితో ఆగిపోతే అందరూ సంతోషించి వుండేవారు.
మళ్లీ తవ్విన కాంగ్రెస్
కమల్‌నాథ్ నేతృత్వంలో 2018లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వజ్రాల మైనింగ్ కోసం బందర్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు ఖర్చు రూ. 2500 కోట్లు కాగా, దీని ద్వారా రూ. 5500 కోట్లు సంపాదించవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. మైనింగ్ కోసం వేలం ప్రక్రియను చేపట్టారు. ఇందులో 34 మిలియన్ క్యారెట్ల వజ్రం వున్నట్లు, ప్రతి సంవత్సరం 3 మిలియన్ క్యారెట్ల వజ్రాలు ఇక్కడ లభిస్తాయని అంచనా వేశాయి. చాలా కంపెనీలు ఈ వేలంలో పాల్గొన్నా ఆదిత్య బిర్లా గ్రూపుకు చెందిన 'ఎస్సెల్ మైనింగ్' 50 ఏళ్ల లీజుకు మైనింగ్‌ను దక్కించుకుంది. అయితే 374 హెక్టార్ల అటవీ ప్రాంతంలో మైనింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. మైనింగ్ చేపట్టడం ద్వారా వచ్చిన లాభాల్లో 58 శాతం ఆదిత్య బిర్లా గ్రూప్, 42 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా అని ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. తదనంతర పరిణామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోగా, బిజెపి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియను ముందుకు నడిపించింది.
ప్రజల సంపద కార్పొరేట్ల చేతుల్లో...
పర్యావరణం, అడవులు, ఖనిజాలు, సహజ వనరులు అనేవి ప్రజల సంపద. కానీ లాభాల పేరుతో ప్రభుత్వాలు వీటిని కార్పొరేట్లకు అప్పగిస్తున్నాయి. లాభాల్లో ప్రభుత్వానికి అందే వాటా ద్వారా సంక్షేమ పథకాలు చేపడతామని, ప్రజలకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వాలు ఎన్ని కారణాలు చెప్పినా... జరిగే నష్టాన్ని చూస్తే అది ఏ మూలకు వుండదు. అంతే కాకుండా ఇక్కడ ఉత్పత్తి అయ్యేది వజ్రాలు. ఇవి కేవలం ఒక శాతం ధనవంతులు మాత్రమే వినియోగించే ఆభరణం. 99 శాతం మంది ప్రజలకు వీటి ద్వారా ఎలాంటి లాభం ఉండదు. ఇలాంటి వాటి కోసం పర్యావరణాన్ని నాశనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని పర్యావరణవేత్త నేహా సింగ్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వజ్రాల గనికి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోవాలని అభ్యర్థిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గడప కూడా తొక్కారు. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా 'సేవ్ బక్స్‌వాహ ఫారెస్ట్' పేరిట ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కారణంగా ఏర్పడే పర్యావరణ కాలుష్యానికి వ్యతిరేకంగా సామాన్యులు, పర్యావరణవేత్తలు పాల్గొని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యామ్నాయం లేదా ?
భూమి లోలోపలి పొరల్లో అత్యధిక ఉష్ణోగ్రత, పీడనాల వద్ద కర్బన అణువులు ఘనీభవించగా ఏర్పడేదే వజ్రం. కార్బన్ డయాక్సైడ్ ద్వారా ఇవి తయారవుతాయి. వజ్రాలు రూపొందడానికి కొన్ని వేల సంవత్సరాల సమయం పడుతుంది. అయితే వజ్రాల వెలికితీత కోసం మైనింగ్ చేపట్టడం, పర్యావరణాన్ని నాశనం చేయడం, వన్యప్రాణులకు హాని కలిగించడం నచ్చని కొన్ని కంపెనీలు కృత్రిమంగా వజ్రాలు తయారు చేసే పరిశోధనలు చేపట్టాయి. కర్బన వాయువులను అధిక పీడనంతో వజ్రాలు తయారు చేయగలిగారు. భూగర్భంలో లభించే వజ్రాలకు, కృత్రిమంగా ఇలా తయారు చేసిన వజ్రాలకు నాణ్యతలో ఎలాంటి తేడా కనిపించలేదు. ధర కూడా తగ్గింది. దాంతో కృత్రిమ వజ్రాల వాడకం కూడా పెరిగింది. ప్రకృతికి ఎలాంటి హానీ కలిగించకుండా వజ్రాలను తయారు చేసే అవకాశమున్నా... పర్యావరణాన్ని, అడవులను నాశనం చేసే చర్యలు ఎందుకు చేపడుతున్నారన్నది పర్యావరణవేత్తల ప్రశ్న. దీనిపై దాటవేతలు తప్ప ప్రభుత్వాల దగ్గర సమాధానం లేదు.
/ వ్యాసకర్త సెల్ : 9640466464 /
ఫిరోజ్ ఖాన్











