జగనాసుర రక్త చరిత్ర పుస్తకావిష్కరణ బుద్ధ నాగజగదీష్
ప్రజాశక్తి-అనకాపల్లి : మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు దోషులను బయట పెట్టాలని టిడిపి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక రింగ్ రోడ్‌లోని పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో జగనాసుర రక్త చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివేకానందరెడ్డిని దారుణాతిదారుణంగా చంపిన కేసులో ఎంత పెద్ద వాళ్ళయినా, ఏ స్థాయిలో ఉన్నా వారికి చట్టపరంగా కఠిన శిక్ష పడకపోతే ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉందన్నారు. వైసిపి జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో ప్రజల ధన మాన, ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తారు. సిబిఐ విచారణలో జాప్యం చేయకుండా దోషులను కోర్టు బోనులో నిలబెట్టాలన్నారు. ఇప్పటికే జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో అరాచకత్వం పెచ్చురిల్లిపోయిందని, నేరస్తులు విచ్చలవిడిగా తిరుగుతున్నారని విమర్శించారు. వివేకా హత్య కేసులో దోషులను ఇప్పటికే సిబిఐ గుర్తించిందని, వారు జగన్ బంధువులేనని సూచాయగా స్పష్టమౌతోందన్నారు. వివేకా హత్యకేసులో అభియోగాలను తెలుగుదేశంపై మోపి రాజకీయ లబ్ధి పొందేందుకు నేటికీ వైసిపి మోసపూరిత ప్రచారాలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బిఎస్‌ఎన్‌కె. జోగినాయుడు, బొడ్డేడ మురళి, పొలిమేర నాయుడు, గుడాల సత్యనారాయణ, మారిశెట్టి శంకరరావు, సాలాపు నాయుడు, మల్ల గణేష్, బుద్ధ మహాలక్ష్మి నాయుడు, బుద్ధ భువనేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










