Jul 23,2021 21:59

* జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎదుట వాచ్‌మెన్‌ వాగ్మూలం!
ప్రజాశక్తి-జమ్మలమడుగు రూరల్‌ (కడప జిల్లా) :
వై.ఎస్‌.వివేకానంద హత్య కేసులో సిబిఐ కీలక ఆధారాలు సేకరించింది. ఈ హత్యకు ఇద్దరు ప్రముఖులు కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చినట్లు సిబిఐ విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి దాదాపు 45 రోజులుగా సిబిఐ బఅందం కడప జిల్లాలో మకాం వేసి విచారణ జరుపుతోంది. సుమారు 1,600 మందినిపైగా విచారించింది. వివేకా ఇంటి వాచ్‌మెన్‌ రంగయ్య ఇచ్చిన సమాచారంతో కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ హత్య కోసం ఇద్దరు వ్యక్తులు రూ.8 కోట్లు సుఫారీ ఇచ్చినట్లుగా జమ్మలమడుగు సివిల్‌ కోర్టు జడ్జి షేక్‌ బాబా ఫక్రుద్దీన్‌ ఎదుట రంగయ్య వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. వివేక డ్రైవర్‌ దస్తగిరి నుంచి గురువారం, రంగయ్య నుంచి సెక్షన్‌ 164 కింద శుక్రవారం వాగ్మూలం నమోదు చేశారు. ఈ వాంగ్మూలాన్ని పులివెందుల జూనియర్‌ సివిల్‌ కోర్టు మెజిస్ట్రేట్‌కు అందిస్తారని తెలిసింది. ఈ కేసులో వీరిద్దరి వాంగ్మూలం కీలకంగా మారబోతోంది. హత్య కేసు మిస్టరీ వీడిపోయే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సుఫారీ ఇచ్చిన ఇద్దరితోపాటు మరో ఆరుగురికి ఈ కేసుతో సంబంధం ఉందని రంగయ్య చెప్పినట్లుగా తెలియవచ్చింది. వీరంతా జిల్లాకు చెందిన వారేనని సమాచారం. వివేకా కేసును ఇప్పటి వరకు డిఐజి సుధాసింగ్‌ పర్యవేక్షణ చేస్తుండగా, నూతన విచారణాధికారిగా ఎస్‌పి రాంకుమార్‌ను నియమించారని సమాచారం.