ప్రజాశక్తి-మార్టూరు రూరల్: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిపడి ఉన్న ఘటన మండల పరిధిలోని రాజుపాలెం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. మార్టూరు సీఐ షేక్ థెరిసా ఫిరోజ్ కథనం ప్రకారం.. అద్దంకి మండలం శింగరకొండ సమీపంలోని సింగరాయకొండ పాలెం గ్రామానికి చెందిన కోటేశ్వరమ్మ(30)కు మార్టూరు మండలం రాజుపాలెం గ్రామం యాదవ కాలనీకి చెందిన లచ్చిబోయిన ప్రసాద్‌తో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగపిల్లలు. గత కొద్ది కాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం వేకువ జామున ప్రసాద్ భార్య కోటేశ్వరమ్మ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని మార్టూరు పోలీసులకు అందిన ఫిర్యాదుతో సిఐ షేక్ ఫిరోజ్ ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే కింద పడుకోబెట్టి ఉన్న కోటేశ్వరమ్మ మృతదేహాన్ని సీఐ పరిశీలించారు. తన భార్య ఉరి వేసుకొని వేలాడుతుండగా కాపాడటానికి కిందకు దించామని భర్త ప్రసాద్ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని మార్టూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం కోటేశ్వరమ్మ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
భర్తే చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడు
కోటేశ్వరమ్మ మృతి వార్త తెలియగానే అద్దంకి సమీపంలోని సింగరకొండపాలెం గ్రామం నుంచి బంధువులు పెద్దఎత్తున మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలివచ్చారు. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను అడ్డు తొలగించుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆందోళనకు దిగడంతో వైద్యశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోస్టుమార్టం నివేదికలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలపడంతో కోటేశ్వరమ్మ బంధువులు శాంతించారు.










