బాల్య వివాహాలను నిరుత్సాహపరచడానికి, మహిళా విద్యను ముఖ్యంగా ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి, మహిళా సాధికారతను ప్రోత్సహించడానికే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పడాన్ని ఎవరూ విశ్వసించరు. మహిళలకు బాల్య వివాహాలు జరగడానికి కొన్ని సాంస్కృతిక కారణాలకు ఆర్థిక కారణాలు తోడైనాయి కాబట్టి, కేవలం వివాహ వయస్సును పెంచడం ద్వారా మాత్రమే బాల్య వివాహాలు తగ్గవు. అయినప్పటికీ, ఎక్కడైతే సమానత్వంతో కూడిన విద్యకు, మెరుగైన ఆర్థిక సూచికలకు అవకాశం ఉందో, అక్కడ మహిళల వివాహ వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంది. ఇటీవల జరిగిన ఎన్.ఎఫ్.హెచ్.ఎస్ లో ఇది స్పష్టమైంది.
ప్రజలు కోరని చట్టాలను చేయడం ఎన్.డి.ఎ ప్రభుత్వానికి ఒక అలవాటుగా మారింది. రైతులు కోరుకోకుండా వ్యవసాయ చట్టాలను, ముస్లిం మహిళలు కోరుకోని ట్రిపుల్ తలాక్ చట్టాలను తెచ్చింది. ఆ తర్వాత డిసెంబర్ 16న, మహిళల వివాహ వయస్సును 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు పెంచుతూ పంపిన ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఆ చట్టం తెచ్చేందుకు గల కారణాలను, దాని లక్ష్యాలను ప్రకటిస్తూ...పి.సి.ఎం.ఎ-2006 చట్టం అమల్లో వున్నప్పటికీ హానికరమైన బాల్యవివాహాలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయనీ, అందువల్ల ''ఈ సామాజిక సమస్యను సంస్కరణల ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందని'' అంటున్నారు. అంటే ఇప్పుడు ఉనికిలో ఉన్న చట్టాలు స్త్రీ పురుషుల వివాహ వయస్సుకు సంబంధించిన లింగ సమానత్వాన్ని రాజ్యాంగపరమైన ఆజ్ఞగా సాధించలేక పోయాయనీ, అందువల్ల విద్య, వృత్తి విద్య, మానసిక భద్రతను సాధించడంలో మహిళలు ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టబడ్డారనీ, వివాహానికి ముందే ఉద్యోగం సాధించి, శ్రామిక శక్తిలో భాగస్వామ్యం కావడమనేది క్లిష్టమైన విషయమని ఆ ప్రకటన తెలియజేస్తుంది. పి.సి.ఎం.ఎ 2006 ను సవరించడం ద్వారా, ఈ బిల్లు వివాహ వయస్సుకు సంబంధించి, ఉనికిలో ఉన్న చట్టాలన్నింటినీ కొట్టిపారేస్తూ, మహిళలను పురుషులతో సమానంగా వయస్సును పెంచే లక్ష్యంతో ఉంది.
పి.సి.ఎం.ఎ ను సవరించాలన్న కేబినెట్ నిర్ణయాన్ని ప్రభావితం చేసిన నీతి ఆయోగ్ టాస్క్‌ఫోర్స్‌ను జూన్ 4, 2020లో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం, తల్లీబిడ్డల ఆరోగ్యం, తల్లీబిడ్డల మరణాల నిష్పత్తి, మొత్తం జననాల రేటు, పుట్టిన సమయంలో లింగ నిష్పత్తి, శిశు లింగ నిష్పత్తితో వివాహ వయస్సు మరియు మాతత్వానికి ఉన్న అన్యోన్య సంబంధాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. మహిళల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించాలనీ, వారి సిఫార్సులకు మద్దతుగా ఉనికిలో ఉన్న చట్టాలకు శాసనసంబంధమైన మార్పులు చేయాలని టాస్క్‌ఫోర్స్ ను కూడా అడిగారు.
కారణం ఏదైనా, బాల్య వివాహాలను నిరుత్సాహపరచడానికి, మహిళా విద్యను ముఖ్యంగా ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి, మహిళా సాధికారతను ప్రోత్సహించడానికే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పడాన్ని ఎవరూ విశ్వసించరు. మహిళలకు బాల్య వివాహాలు జరగడానికి కొన్ని సాంస్కృతిక కారణాలకు ఆర్థిక కారణాలు తోడైనాయి కాబట్టి, కేవలం వివాహ వయస్సును పెంచడం ద్వారా మాత్రమే బాల్య వివాహాలు తగ్గవు. అయినప్పటికీ, ఎక్కడైతే సమానత్వంతో కూడిన విద్యకు, మెరుగైన ఆర్థిక సూచికలకు అవకాశం ఉందో, అక్కడ మహిళల వివాహ వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంది. ఇటీవల జరిగిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్.ఎఫ్.హెచ్.ఎస్)లో ఇది స్పష్టమైంది.
వివాహ వయస్సుకు సంబంధించిన చర్చ ద్వారా రెండు విషయాలు తెలుస్తాయి. ఒకటి, చట్టబద్ధంగా వివాహ వయస్సును 18 నుండి 21 పెంచడం ద్వారా ''తగిన వయసులో'' వివాహం చేసుకునే బాధ్యతతో పాటు ప్రతీ విషయాన్ని పేదలపై ముఖ్యంగా మహిళలపై మోపుతున్నారు. రెండు, ఇది ప్రభుత్వ వైఫల్యాలకు ప్రతిస్పందించకుండా ప్రజల దృష్టిని మళ్ళిస్తుంది. వివాహ వయసు పెంపు వల్ల మహిళలు ఉన్నత విద్యావంతులుగా మారడం లేక పెద్ద సంఖ్యలో మహిళలు శ్రామిక శక్తిలో చేరిపోవడం జరగదు. ఉన్నత విద్యలో మహిళల స్థూల నమోదు నిష్పత్తిలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
మొన్న డిసెంబర్‌లో ప్రయాగ్‌రాజ్‌లో స్వయం సహాయక బృందాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, మహిళల వివాహ వయస్సును 18 నుండి 21కి పెంచడాన్ని ఆక్షేపించిన ప్రతిపక్షాలను ఎగతాళి చేశారు. మహిళలు చదువుకొని, ప్రగతి సాధించడానికే వివాహ వయస్సును పెంచామని ప్రధాని అన్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, 2001-02 లో ఉన్నత విద్యలో (18-23 సంవత్సరాల మధ్య వయస్కులు) మొత్తం మహిళల జి.ఇ.ఆర్ (స్థూల నమోదు నిష్పత్తి) 6.71 శాతంగా ఉంటే, 2005-06 నాటికి అది 9.35 శాతానికి పెరిగింది. 2010-11 లో మహిళల నమోదు 17.9 శాతం, 2014-15 నాటికి 23.2 శాతం, 2019-20లో మహిళల 27.3 శాతంగా నమోదైంది. అందువల్ల, వివాహ వయస్సు 18 వున్నప్పటికీ, ఉన్నత విద్యలో మహిళల నమోదు శాతం క్రమంగా పెరుగుతూ వచ్చింది.
గత కొన్ని సంవత్సరాలుగా మొత్తం విద్యా వ్యవస్థలో, చదువుకోవాలనే కోరికతో నమోదు శాతం పెరుగుతూ వస్తోంది గానీ, కేంద్రంలో వరుసగా ఏర్పడిన ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాల వల్ల పెరగలేదు. అదే నిజమైతే విద్యా రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెరిగి ఉండేవి. ఇది జరగలేదని జాతీయ విద్యా విధాన పత్రాలు రూఢి చేస్తున్నాయి. విద్యలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగడానికి బదులుగా....ప్రైవేట్ విద్యా రంగాన్ని విస్తరిస్తున్నారు. లేదా రెగ్యులర్ విద్యా వ్యవస్థ కంటే కూడా దూర విద్యా వ్యవస్థను విస్తరిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలు లేని కారణంగానే ఉన్నత విద్యలో ఎక్కువ మంది మహిళలు చేరలేకపోతున్నారు గానీ, వివాహ వయస్సు 18 సంవత్సరాలు ఉండడంవల్ల కాదు.
ఇప్పటికే మహిళలకు శ్రామిక శక్తిలో భాగస్వామ్యం ఉంది, కానీ తక్కువ వేతనాలు ఇచ్చి, ఎక్కువ పని చేయించుకునే అసంఘటిత రంగంలో శ్రామిక శక్తిగా ఉన్నారు. ఐద్వా, ఆలిండియా ప్రోగ్రెసివ్ విమన్స్ అసోసియేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమన్ లాంటి సంఘాలు 'మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్' ను ఉదహరిస్తూ వివాహ సగటు వయసు 22.1కి పెరిగిందని చెప్పాయి. ప్రభుత్వం, వివాహ కనీస వయసును అందరికీ 18 సంవత్సరాలుగా స్థిరీకరించి, బిల్లును వెనక్కు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నాయి.
బాలబాలికలకు ఉమ్మడిగా వివాహ వయస్సును 18 సంవత్సరాలను 2008లో 'లా కమిషన్' సిఫార్సు చేసింది. పాఠశాల మధ్య లోనే చదువు మానేసే బాలికల సంఖ్యను తగ్గించేందుకు, బాలికలకు విద్యా హక్కు చట్టాన్ని 18 సంవత్సరాల వరకు పొడిగించాలనీ, ప్రభుత్వం మహిళలకు 'కేజీ నుంచి పీజీ' వరకు ఉచిత, నాణ్యమైన విద్యను అందించాలని ఆ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు, 18-21 సంవత్సరాల మధ్య వయసులో ఉండి, వివాహం చేసుకోవాలనుకునే వారిపై ఈ బిల్లు పితృస్వామిక హింసను పెంచుతుంది. ఈ బిల్లు, ఇలాంటి వారు చేసుకునే వివాహాలను ''బాల్య వివాహాలుగా'' నేరారోపణలు చేస్తూ, ఆ వివాహాల వల్ల కలిగే పిల్లలకు, వారి తల్లులకు ఆరోగ్య పరిరక్షణ హక్కులు లేకుండా చేస్తుంది. పేదరికానికి, బాల్య వివాహాలకు మధ్య చాలా దగ్గర సంబంధం ఉంటుందని బాల్య వివాహాలపై ప్లానింగ్ కమిషన్ చేసిన ఒక అధ్యయనంలో తేలింది. రహస్యంగా జరిగే బాల్య వివాహాలలో కఠినమైన చట్టం జోక్యం, అప్పటికే ఆర్థికంగా, సామాజికంగా నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాలను బాధితులుగా మార్చుతుంది.
ఇటీవల చేసిన ఎన్.ఎఫ్.హెచ్.ఎస్-5 (2019-2021) సర్వే ప్రకారం, 18 సంవత్సరాల లోపు వివాహం చేసుకున్న మహిళలు 26.8 నుండి 23.3 శాతానికి తగ్గారు. బీహార్ లో 18 సం.ల లోపు వివాహం చేసుకున్న మహిళలు 40.8 శాతంగా ఉంటే లక్షాద్వీప్ లో 1.3, కేరళలో 6.3 శాతంగా ఉన్నారు. బీహార్ మహిళల్లో 55 శాతం అక్షరాస్యత ఉంటే, లక్షాద్వీప్ లో 95.2, కేరళలో 97 శాతంగా ఉంది. విద్యా స్థాయికి, వివాహ వయస్సుకు మధ్య అత్యంత దగ్గర సంబంధం ఉండేది. అయినా, 18 సంవత్సరాల లోపు వివాహం చేసుకున్న మహిళల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. ఉదాహరణకు, మహిళా సాధికారతపై మాట్లాడుతూ వివాహ వయస్సు పెంపును సమర్థిస్తూ ప్రధానమంత్రి మాట్లాడిన ఉత్తరప్రదేశ్ లో 18 సంవత్సరాలు నిండకుండానే వివాహం చేసుకున్న మహిళలు ఎన్.ఎఫ్.హెచ్.ఎస్-4 లో 21.1 శాతంగా ఉంటే, ప్రస్తుతం 15.8 శాతానికి తగ్గింది.
''ప్రేమలో పడిన వారి సంగతేంటి? వారెక్కడికెళ్ళాలి? వారు 21 సంవత్సరాలు నిండే దాకా ఎదురు చూడకుండా, వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటారు. 21 సంవత్సరాలు నిండే వరకు వారు పెళ్లి చేసుకోకూడదని ప్రభుత్వం వారికి చెప్పే పరిస్థితి ఉండదని'' ఇళ్లలో పని చేస్తూ జీవనం సాగిస్తున్న సుశీల అంటుంది. ఒకవేళ ప్రభుత్వం నిజంగా మహిళల సమస్యలు పరిష్కారించాలని అనుకుంటే, వయసొచ్చిన ఆడపిల్లల కోసం పరిసరాలను మరింత సురక్షితంగా వుంచేందుకు చర్యలు చేపట్టాలని ఆమె అంటుంది. ''నగరాలలో, గ్రామాల్లో మా ఆడపిల్లలను ఒంటరిగా బయటికి పంపడం లేదు. వారి రక్షణ గురించి భయపడుతున్నాం. పేద ప్రజల కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేసింది? మా మగవాళ్ళు సంపాదించే కొద్దిపాటి ఆదాయం (అది కూడా గ్యారెంటీ లేని) మాకే మాత్రం సరిపోదు. లాక్‌డౌన్ కాలంలో పని లేదు. కేవలం ఇళ్లలో పని చేస్తూ బతుకుతున్నాం. మా ఆడపిల్లలకు పని చేయగలిగే వయసొస్తే ఇళ్లలో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని'' ఆమె చెప్పింది. మహిళల సమస్యల పరిష్కారం కోసం సుశీల అన్న మాటలు చాలా విలువైనవి.
పి.సి.ఎం.ఎ చట్టాన్ని ఉల్లంఘిస్తే పురుషులకు రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. సమస్య సుశీలతో లేక ఇతర కార్మికవర్గ మహిళలతో లేదు. చట్ట ఉల్లంఘనకు తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పే చట్టాన్ని వారు చాలా తేలికగా అర్థం చేసుకోగలరు.
(''ఫ్రంట్‌లైన్'' సౌజన్యంతో)
టి.కె.రాజాలక్ష్మి











