ప్రజాశక్తి - భీమడోలు
వినాయక చవితి ఉత్సవ కమిటీలు వివాదాలకు తావివ్వకుండా కార్యక్రమాలను నిర్వహించుకోవాలని భీమడోలు ఎస్‌ఐ చావా సురేష్ కోరారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో వినాయక చవితి ఉత్సవ కమిటీలతో ఎస్‌ఐ ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవ కమిటీ నిర్వాహకులు పందిళ్లను ట్రాఫిక్‌కు అంతరాయం లేని విధంగా వేసుకోవాలని కోరారు. ఇదేవిధంగా ఊరేగింపు సమయంలో సైతం ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్తి, ప్రాణనష్టాలు జరగకుండా చూసేందుకు పందిళ్లలో విద్యుదీకరణ పనులను నిపుణులతో చేయించుకోవాలన్నారు. వినాయక చవితి పందిళ్ల వద్ద రాత్రి సమయంలో దొంగతనాలు జరగకుండా కాపలాను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో అసభ్యతకు, అశ్లీలతకు చోటు లేకుండా జాగ్రత్తలను తీసుకోవాలని తెలిపారు. ఊరేగింపు సమయంలో నిర్వాహకులు సంయమనం పాటించాలని కోరారు. నిమజ్జనం సమయంలో ప్రమాదాల జరగకుండా జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. అన్న సమారాధన సమయంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు, సాంప్రదాయ రీతిలో కార్యక్రమాలను నిర్వహించుకోవాలని కోరారు.










