* జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో వివాద రహిత గ్రామాలను గుర్తించి మోడల్ గ్రామాలుగా ఎంపిక చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా ఆదేశించారు. జిల్లా కోర్టులోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో రెవెన్యూ, పోలీసు, లేబర్, గిరిజన సంక్షేమ శాఖ తదితర శాఖల అధికారులతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని గ్రామాలన్నీ సర్వే చేసి ఏవిధమైన సివిల్, క్రిమినల్, వాజ్యాలు, గొడవల్లేని గ్రామాలను గుర్తించాలన్నారు. న్యాయసేవాధికార సంస్థ ఆదేశాలను అనుసరించి వివాదరహిత గ్రామాలను నిర్ణయిస్తారని తెలిపారు. వివాద రహిత గ్రామాలను గుర్తించేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఏవైనా గ్రామాలు మోడల్ గ్రామాలుగా గుర్తించడానికి అవకాశమున్న గ్రామాల పేర్లు సూచించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, ఎఎస్‌పి తిప్పేస్వామి, డిఆర్‌ఒ పి.మురళీకృష్ణ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ప్రసాదరావు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కె.అజరు కార్తికేయ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి కె.వి రమణ, గవర్నమెంట్ న్యాయవాది వినయభూషణరావు తదితరులు పాల్గొన్నారు.










