
కోవిడ్‌తో ఓ పక్క పోరాటం చేస్తూ.. వైద్య సాయంతో నిలదొక్కుకుంటూ ఉన్న క్రమంలోనే విజయవంతంగా ముగిశాయి విశ్వక్రీడలు.. అవే టోక్యో ఒలింపిక్స్. వ్యక్తిగత ఈవెంట్ విభాగంలో తొలి పసిడితో చరిత్ర సృష్టించాడు నీరజ్ చోప్రా. రజిత, కాంస్యాలతో మెరిశారు మరికొద్దిమంది. దశాబ్దాల చరిత్రను పునఃలిఖిస్తూ పతకం గురించి ఆలోచనే లేని దశ నుంచీ పతకం సాధిస్తారన్న విశ్వాసాన్ని కలిగించారు కొందరు. 'జయహో' అంటూ సంబరాలు చేసేవారు ఒకవైపు.. విజేతల కులాలను గూగుల్‌లో వెతుక్కుంటూ, 'మావాళ్లే'నంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టేవారు మరోవైపు.. క్రీడాస్ఫూర్తికి సిసలైన నిర్వచనం తెలియనివారు కొందరైతే.. ఏళ్ల తరబడి చేసే కృషి వెనుకనున్న చరిత్రను పరిశీలించే ఓపికలేని వారు మరికొందరు.. అందరూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఎంతకాలం ? మరో పదిరోజుల్లో మొత్తం మరచిపోతారు. మరలా ఓ కొత్త విషయానికి చాలా కన్వీనియెంట్‌గా స్విచ్‌ఓవర్ అయిపోతారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక కథనం..

జులై 1, 2021 నాటికి 1,33,93,30,514 జనాభాతో ప్రపంచంలో ద్వితీయస్థానంలో ఉన్నాం మనం. ఈసారి పతకాల పట్టికలో కాస్త పైకి వెళ్లాం. విశ్వ విజేతల పట్టికలో సాధించాల్సిన ప్రగతి సాధించలేకపోవడం వెనుకనున్న నీడలను, క్రీడా ప్రపంచాన్ని ఆవరించియున్న వలయాలను పునఃపరిశీలన చేసుకోవాల్సిన చారిత్రక సందర్భం ఈ 75వ స్వాతంత్య్ర దినోత్సవం.
భిన్నత్వంలో ఏకత్వం..
విభిన్న జాతుల, మతాల, సంస్కారాల సమాహారం మనదేశం. ఏకభావన, ఐక్యతారాగం ఏనాడూ కానరాని భిన్నత్వంలో ఏకత్వం. భౌగోళిక పరిస్థితుల బేధాలు, వాతావరణ వ్యత్యాసాలు పుష్కలంగా ఉన్న దేశం. ముగిసిన టోక్యో ఒలింపిక్స్ నేపథ్యంగా మనదేశ క్రీడావ్యవస్థను ఆవరించిన సమస్యల ఉపరితలాన్ని స్పర్శిద్దాం..
తల్లిదండ్రుల ఇష్టాలే..
బిడ్డ పుట్టిన వెంటనే డాక్టరు, ఇంజనీరు, ఛార్టెడ్ అకౌంటెంట్, కార్పొరేట్ లాయర్ అంతకుమించి ఆలోచన చేసే తల్లిదండ్రులు ఎందరు? తమ వ్యాపార సామ్రాజ్యాలను కాపాడుకోవడానికి, రాజకీయ, కళావారసత్వాన్ని కొనసాగించడానికి తమ సంతానాన్ని తీర్చిదిద్దుతారు కొందరు. తమబిడ్డ అంతర్జాతీయ క్రీడాకారుడు లేదా క్రీడాకారిణి కావాలని కలలు కనేవారు, సాకారం చేసుకోవడానికి కృషి చేసేవారు ఎందరు? కొందరు 'వాళ్ల ఇష్టమేదైతే ఆ రంగంలోనే కొనసాగుతారు' అంటారుగానీ, ఆ దారిలోకి వెళ్లే వ్యవస్థను పటిష్టం చేయరు. ఏళ్ల తరబడి కృషి చేసినా విజయావకాశాలు లభిస్తాయో లేదో తెలియని ఏకైక రంగం 'క్రీడారంగం'. జీవన భద్రతలేని దేశం మనది. అందుకే తమ బిడ్డల జీవితాలకు మినిమం గ్యారంటీ ఉందనుకున్న తల్లిదండ్రులు దార్శనికతతో ముందుకు వస్తారు, రిస్క్ తీసుకుంటారు. తమ సమయం, ఆదాయం కేటాయించి, బిడ్డలు ఆటస్థలంలో స్వేదం చిందిస్తుంటే, వారిని నిరంతరం కాపాడుకుంటూ తమ రక్తాన్ని ఆవిరి చేసుకుంటారు కన్నవారు. అంతర్జాతీయంగా, జాతీయంగా వ్యక్తిగత పతకాల విజేతల జీవన చరిత్రను చదివితే, పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

కులం, మతం, వర్గం, ప్రాంతాలకు అతీతంగా స్వేదజలాలలో తమ శరీరాన్ని సంవత్సరాల తరబడి శిక్షణకు అంకితం చేస్తారు. ఆ నిరంతర సాధనకు, తమ వయస్సువారి జీవన విధానానికి వ్యతిరేకంగా, జిమ్‌లలో, క్రీడాస్థలంలో చిందించే చెమట చుక్కలకు పేద, ధనిక భేదం ఉండదు. ఉండేదల్లా.. కఠోర శ్రమకు తట్టుకునే శారీరక యువత దేశానికి అవసరం కఠోర శ్రమకు తట్టుకునే శారీరక దారుఢ్యం ఒక్కటే !
యువత దేశానికి అవసరం
'ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం!' అంటారు స్వామి వివేకానంద. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు పుట్టిన వెంటనే రావు.. సాధనలోనే ఏర్పడతాయి. సమస్యలు తట్టుకుని నిలదొక్కుకునే క్రమంలో బలపడతాయి. దానికి మానసిక సంకల్పమూ తోడైతే, సంవత్సరాల శ్రమకు ఫలితం వచ్చే అవకాశాలుంటాయి.
'మా బిడ్డను ఏసీ ఉన్న స్కూల్‌లో వేశాం'. 'మా పిల్లలను అల్లదిగో ఆ బిల్డింగ్‌లో ఉండే చదువుల బడిలో చేర్చాం. గేటుముందు బస్సుఎక్కి, ఇంటిముందు దిగడమే, సంవత్సరానికి ఇంతఫీజు కష్టమేగానీ, పిల్లలకోసం కాకపోతే ఎవరికోసం?'.. ఈ మానసిక ధోరణిలో కనీస ఆటస్థలం, కాస్తంత వ్యాయామ విద్యలేని విద్యాలయాల్లో గంటల తరబడి కూర్చోబెట్టి, ఊబకాయాల శరీరమే ఆరోగ్యమనుకునే మనస్తత్వమున్న తల్లిదండ్రులు ఉన్నంతకాలం.. మనదేశ జనాభా మరో రెండింతలైనప్పటికీ, విశ్వ క్రీడా సంబరాలను కళ్లప్పగించి చూడటమే. అంతే తప్ప, ఆనందభాష్పాల తడి, విజయగర్వంతో గుండెలో ఉప్పొంగే సంతృప్తి ఎన్నటికీ అనుభవంలోకి రావు.

తల్లిగర్భంలో కదిలే శిశువు కదలికలే తొలి ఆట. అందుకే పసిబిడ్డలకు తొలుత నేర్పాల్సింది ఈత. కొలనులో శిక్షణ కోసం 'బేబీపూల్స్' ఉంటాయి. లేనిచోట అపార్ట్‌మెంట్‌లైతే చిన్నచిన్న తటాకాలు.. గ్రామీణ ప్రాంతాలైతే చుట్టూ ఉన్న కొలనులు, చెరువులు, కాల్వలు.. ఈత అనేది ప్రాణాలు కాపాడే ఆట. సహజ కదలికలకు శ్వాస నియంత్రణ తోడయ్యి, బిడ్డలు ఈతగాళ్లవుతారు. కానీ భయం.. భయం నీళ్లు తాగేస్తారేమోనని, ఊపిరాడదేమోనని, కానీ ఆ భయం బిడ్డది కాదు. తమ బిడ్డ మాత్రమే ప్రత్యేకమనుకునే తల్లిదండ్రులది.
పదేళ్లు వచ్చే వరకూ ఫ్లెక్సిబిలిటీనిచ్చే జిమ్నాస్టిక్స్ నేర్పించాలి. బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో స్కేటింగ్ నేర్పించాలి. అయినా అందించం. ఎందుకంటే ఐఐటి, ఐఏఎస్‌ల కోసం, బాల్యం నుండీ శిక్షణని ఇప్పించే సంస్కృతి మనది. 14 ఏళ్ల వరకూ శారీరక ధారుడ్యానికి కావలసిన కఠోర వ్యాయామం గురుముఖ సాధన చేయాలి. ఆ క్రమంలో బిడ్డకున్న సహజ క్రీడా నైపుణ్యం బయటపడుతుంది. ఐదు వేళ్లూ ఒకేలా ఉండనట్లు, అందరూ ఒకే విధమైన క్రీడలకు సరిపోరు. ఈ సత్యాన్ని అవగతం చేసుకోకుండా, తమకు దగ్గరలో, అందుబాటులో ఉన్న ఆటలు నేర్పించేసి, అందలాలు ఎక్కలేదనుకోవడం మన అజ్ఞానానికి నిదర్శనం. అందుకే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా catch them young... coach them right అన్న నినాదాన్నిచ్చింది.
అవకాశం..ప్రవేశం..
అకాడమీలలో, స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశం సులభసాధ్యమా ? నిస్సందేహంగా కాదు. ఒకస్థాయి క్రీడా నైపుణ్యం సాధించిన వారికి అకాడమీలలో ప్రవేశం లభిస్తుంది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 718 జిల్లాలున్న మనదేశంలో ఉన్న ప్రభుత్వ అకాడమీలు, ప్రైవేటు అకాడమీలు ఎన్ని? క్రీడా పాఠశాలలెన్ని? ఈ లెక్క మనలను నిస్సందేహంగా నివ్వెరపరుస్తుంది.
నేటికీ క్రీడాస్థలమున్నది ప్రభుత్వ విద్యాలయాలలోనే.. వాటినన్నీ ప్రభుత్వాలు కునారిల్లుస్తున్నాయి. వ్యాయామోపాధ్యాయులు ఉండేది కూడా వీటిలోనే.. కనీసం వారానికిన్ని గంటలంటూ వ్యాయామ విద్య లభించే ప్రదేశాలు కూడా ఇవే ! చాలా ప్రైవేటు విద్యాలయాల్లో ఆటస్థలాలే ఉండవు.. వ్యాయామ ఉపాధ్యాయులున్నప్పటికీ వారిని 'డిసిప్లిన్' కోసమంటూ అదనపు పనులప్పగిస్తారు తప్ప.. క్రీడా పాఠాలకు ఉపయోగించరు. ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు వారికి కుదిరిన రీతిలో కోచింగ్ ఇప్పిస్తే, అకాడమీలలో ప్రవేశానికి అర్హత అవకాశాలుంటాయి. ప్రభుత్వ విద్యాలయాల్లోనూ మెరికల్లాంటి విద్యార్థులున్నారు. అకాడమీలో అర్హత సాధిస్తారు. విచిత్రమేమిటంటే పోటీలు మాత్రం అందరికీ ఒకే వేదికపై ఉంటాయి. అంటే సాంకేతిక శిక్షణ, పౌష్టికాహారం, చక్కటి క్రీడా పరికరాలు, మౌలిక వసతులు పుష్కలంగా లభించే క్రీడాకారుల.. నామమాత్రపు వసతులతో అర్ధాకలితో, ఆటస్థలంలో మెరుపులు మెరిపించే క్రీడాకారులు కలిసి ఒకస్థానం కోసం పోటీపడాలి.. చిత్రం కదా ! ఈ లోపాన్ని అధిగమించే వ్యవస్థ లేదు. అన్ని అకాడమీలు ఒకే జిల్లాలో ఉండవలసిన అవసరం లేదు. ఆయా క్రీడల అవసరాలకు అనుగుణంగా.. ఒక్కో జిల్లాల్లో, రాష్ట్ర క్రీడాకారులందరినీ చేర్చవచ్చు. ప్రస్తుత వ్యవస్థ ఈ రీతిలోనే ఉంది. కానీ మనదేశ జనాభాకు సరిసమాన నిష్పత్తిలో, కావలిసినన్ని లేవన్నది నిర్వివాదాంశం.
పోషకులు కావాలి..

గంటల తరబడి చేసే సాధనకు సాధారణ ఆహారం సరిపోతుందా? స్వేదాగ్నిలో రగులుతూ, కండరాల పటిష్టతకు కృషి చేసే సమయంలో 'కొండలు తిందామా? బండలు తిందామా?' అన్నంత ఆకలి పుడుతుంది. అలా రగిలే జఠరాగ్నిని ఏదో ఒక ఆహారంతో సంతృప్తిపరచడం క్రీడాకారులకు అనను కూలం. అధిక మోతాదులో పౌష్టికాహారం అవసరమవు తుంది. న్యూట్రీషనిస్టుల పరిధి పైస్థాయిదైనప్పటికీ ప్రాథమిక స్థాయిలో సైతం ఆహారంపై ఖర్చు పెట్టగలిగే ఆర్థికస్థోమత తల్లిదండ్రులకు ఉండాలి. అలా లేనివారికి క్రీడల్లో ఎదిగే అవకాశాలు లభించినా, వారికి క్రీడా పోషకులు సహకారం, ఆర్థిక సహాయం అవసరం.
మనదేశంలో 'అన్నదానాలు' చేసి ఆకలితో ఉన్నవాడి చేయి కిందన, అందించేవాడి చేయి పైభాగాన అనుకుంటూ టన్నులకొద్దీ పుణ్యాన్ని పోగు చేసుకునే భక్తులు చాలామంది ఉంటారు. ఆ దానం ఆ పూటతో సరి. వండించి, వడ్డిచ్చి, గిన్నెలు సర్దుకొని, సంతృప్తిపడేవాళ్లు కాదు.
క్రీడాకారులకు నెలకింత అని కనీస మొత్తం పదివేల రూపాయలను పౌష్టికాహారం కోసం స్పాన్సర్ చేసే పోషకులుండాలి. అలా అందినవారి స్థాయి వేరుగా ఉంటుంది. అకాడమీలలో చేరినవారికి కాస్త మంచి ఆహారం, వారి క్రీడావసరాలకు అనుగుణంగా లభిస్తుంది.
స్పోర్ట్స్ స్కూల్స్‌తోనే..
శారీరక ధారుడ్యం, రోగనిరోధక శక్తి ఎక్కడ నుండి వస్తుంది? క్రీడాస్థలం నుండే అనేది జగమెరిగిన సత్యం. మరి కుప్పలు తెప్పలుగా ప్రైవేటు విద్యాసంస్థలకు అనుమతులిచ్చిన ప్రభుత్వాలు క్రీడారంగంపై చిన్నచూపు చూడటం వల్ల లోపభూయిష్టంగా ఉంది. ప్రాథమిక విద్యా స్థాయి నుండే స్పోర్ట్స్ స్కూళ్లు ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉంటాయో ఆ ప్రాంతం క్రీడల్లో ముందుంటుంది. చైనా విజయమైనా, మనదేశంలో కేరళ రాష్ట్రమైనా.. ఈ విధానాన్ని తమ విద్యావ్యవస్థలో బలంగా నాటబట్టి, ఫలితాలు ఉత్తమంగా ఉంటున్నాయి.
మలబారు తీరప్రాంత భౌగోళిక పరిస్థితులు, వారి సహజ ఆహారపు అలవాట్లు, పటిష్టమైన ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థ బాల్యం నుండే అంతర్జాతీయ స్థాయి వరకూ అంచెలంచెలుగా అంతే ప్రోత్సాహం వల్ల క్రీడారంగంలో మలయాళీలు అగ్రగాములుగా ఉంటారు. అదేరీతిగా ఏ రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుందో వారే పతక విజేతలవుతున్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏ రాష్ట్రం మండలానికో స్పోర్ట్స్ స్కూలు తప్పనిసరిగా నడుపుతుందో.. 14 ఏళ్లు నిండిన తర్వాత వారి సామర్థ్యానికి అనుగుణంగా అకాడమీల్లోకి నడిపిస్తుందో.. అక్కడ నుండే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లోకి ప్రవేశపెడుతుందో.. అప్పుడు పతకాల గురించి కలలు కనడం ఆరంభించవచ్చు. అంతవరకూ ఆశ ఆశగానే మిగిలి, ఆకాశంలో నక్షత్రంలా ఊరిస్తుంది.
స్పోర్ట్స్ యూనివర్సిటీ
మనదేశంలో స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఎన్ని ఉన్నాయి? విద్యా ప్రమాణాల వృద్ధి కోసం సెంట్రల్ యూనివర్సిటీస్, ఐఐటి స్టేట్ యూనివర్శిటీస్, ప్రైవేటు యూనివర్శిటీస్ అంటూ కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. కానీ, చదువుతోపాటు సమాంతరంగా ఉండాల్సిన క్రీడలకు విశ్వవిద్యాలయాలు ఎక్కడీ ఎన్ని ఉన్నాయి? ఏనాడన్నా ఆలోచించారా? ఆయా ప్రాంత భౌగోళిక అవసరాలకి అనుగుణంగా పరిశోధనలు సాగించి, అందించాల్సిన డిపార్ట్‌మెంట్స్‌లో బలం ఎంత? గైడ్ చేసే అధ్యాపకవర్గ నియామకాల్లో రాజకీయ నాయకుల ప్రాబల్యమెంత? ప్రతి యూనివర్సిటీకి అనుగుణంగా, అనుసంధానంగా ఉన్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ పరిశోధనలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి?

ఇవన్నీ సంతృప్తికరంగా సమాధానం లభించని ప్రశ్నలు. 1956లో ఏర్పడిన మన రాష్ట్రంలో ఉమ్మడిగాగానీ, విడిపోయిన తర్వాతగానీ ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు వెలిశాయి. అమరావతిని రాజధానంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం సైతం.. ప్రైవేటు వారికి భూమినిచ్చింది కానీ ఒక 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'ని నాటి, నేటి ప్రభుత్వాలేవీ కనీస ఆలోచన చేయలేదు. ఎందుకని? నిధుల లేమా? స్థలం లేదా? నడిపించే నాయకత్వం లేదా? సమర్థవంతమైన అధ్యాపకులు దొరకరనా? ఢిల్లీలోని 'ఆప్' ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పరిచి, ఎవ్వరూ ఊహించనిరీతిగా కరణం మల్లీశ్వరిని వైస్ ఛాన్స్‌లర్‌గా నియమించడం గొప్ప విషయం. సాధన సమయంలో లక్ష్యం మెడల్ వైపు మాత్రమే ఉండటం. ఆవిడ ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించిన క్రీడోద్ధారకులు ఉండటం, ఆమె సుదీర్ఘ శ్రమ అంతర్జాతీయ వేదికపై దేశ పతాకాన్ని రెపరెపలాడించడమే గాక, విశ్వవిద్యాలయ ఉపకులపతిని చేసింది.
మహిళలే ఎందుకు మెరుగు ?

ఆడపిల్లల పట్ల మన సమాజ దృక్పథమే వేరు. సనాతనత్వం, సాంప్రదాయ ఒరవడిలో జీవితం 'ఆడ'పిల్లంటూ పెంపకంలో వ్యత్యాసం ఒకకోణం కాగా.. తమలోని సహజ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకునే క్రమంలో సున్నితత్వం నుండే దృఢ సంకల్పంవైపు క్రీడాకారిణులు తమకు తెలియకుండానే తీర్చిదిద్దబడతారు. తమ ఉనికిని నిరూపించుకునే క్రమంలో లక్ష్యంవైపు అధికదృష్టి సారిస్తారు. అక్కడక్కడా లైంగిక వేధింపులున్నప్పటికీ వాటినీ ధీటుగానే ఎదుర్కొంటారు. శారీరక దృఢత్వానికి మానసిక బలమూ తోడవ్వడం మహిళలకు అదనపు హంగు.
పతకాల ఫలం

ఒలింపిక్ పతకాల గెలుపు తర్వాత ఒక విచిత్రవర్గం ఈసారి తయారైంది. గెలిచిన వారి నేపథ్యం, కులం, వర్ణం వగైరా... వగైరా.. 'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని' అంటారు సీతారామశాస్త్రి. అలాగే నిగ్గదీసి అడగాలనే ఉంది. పతక సాధనే ప్రాథమిక లక్షణం ఏ క్రీడాకారుడికైనా. అలా ఆశించనివారు, రగిలే కాంక్ష లేనివారు నిస్సందేహంగా జాతీయ, అంతర్జాతీయ వేదికల వరకూ రాలేరు. ఏ రంగంలో లేదు ఫలాల సారం? 'మాకు డబ్బులు ఇవ్వండి. బహుమానాలివ్వండని' అడుక్కున్నారా? దేశ ఖ్యాతిని నిలబెట్టిన వారిని చూసి బాధ్యతతోనో, సంతోషంతోనో ప్రకటించిన వారి వద్ద స్వీకరించారు.. స్వీకరిస్తారు? స్వప్రయోజనం కన్నా, సమాజ ప్రయోజనం మిన్నగా భావించేవారు భారత హాకీ జట్టు సారథి మాన్ ప్రీత్‌సింగ్‌లాగా తిరస్కరిస్తారు. అక్కడ అవసరం లేకగాదు. అంతకుమించిన సామాజిక బాధ్యత. ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు..
- ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా ప్రాథమిక స్థాయి నుండీ అత్యున్నత స్థాయికి ఎదిగే క్రమంలో ఆగితే శారీరక గాయాలకు, అంగ వైకల్యాలకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి. దీనివల్ల క్రీడాకారులు తగు మొత్తం ప్రీమియం చెల్లించి, తమ కృషి కొనసాగిస్తారు.
- ఏ ప్రభుత్వమైనా బలమైన పారితోషికం జిల్లా స్థాయి నుండే అంతర్జాతీయ స్థాయి వరకూ ఇవ్వాలి. ప్రకటింపబడిన పారితోషికాలు సక్రమంగా చెల్లింపులు చేయాలి.
- దశాబ్దాల తరబడి సాధన చేసి, ఆశించిన స్థాయిని అందుకోలేక జీవితంలో చతికిలపడితే.. కనీసం అప్పుడు విజేతలకు లభించిన ఉద్యోగాలు, బహుమానాలు, బరువైన పారితోషికాలు, అకాడమీల స్థలాలు కొంతలో కొంతైనా ఆదుకుంటాయి. అందుకే విజేతలకు ఇవి తప్పనిసరి చేయాలి.
- మనవంతుగా రాష్ట్రస్థాయికి చేరిన ప్రతి క్రీడాకారుడికి, క్రీడాకారిణికి ఒక్కొక్కరు ఒక్క రూపాయి చొప్పున మీ వంతుగా దేశంలో ఉన్న 133 కోట్ల మంది దానం చేయండి. అంటే ఒక్కో క్రీడాకారుడికి 133 కోట్లు వస్తాయి. వారికి 10 ఏళ్ల శిక్షణకు కచ్చితంగా సరిపోతాయి. ఈ విధానంలో 10 వేల మందికి సాయం అందినా.. పది వేల మంది విశ్వవీధుల్లో మనదేశ క్రీడా సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి తమ శాయశక్తులా కృషి చేస్తారు. గెలిచారా విజేతలవుతారు! ఓడిపోయారా? ఉపాధి కోసం రోడ్డున పడక తమకు తోచిన రీతిలో భావి జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారు.
మనమేం చేస్తాం ?

ఇరవై ఏళ్లు క్రీడల కోసం కృషి చేసిన వారి కులం వెతుకుతాం! 'వాళ్లకవి దొరికాయి.. వీళ్లకవి లభించాయి..' అంటూ రంధ్రాన్వేషణ చేస్తాం. మాక్కూడా రాయడం వచ్చు అనుకుంటూ విమర్శనాస్త్రాలు విసిరేస్తాం.. వేగంగా వేళ్లను కదుపుతూ సోషల్ మీడియాలో షేర్‌లు చేస్తాం. అక్కడక్కడా కామెంట్స్ పెడతాం. ఎందుకంటే అంతకుమించిన మానసిక పరిణతి లేకపోవడం. భావ దారిద్య్రాన్ని బుర్ర నిండా నింపేసుకుని, కుదిరిన చోటల్లా ఒంపేసుకుంటాం. అందుకే ఏడవకండేవకండి... చేతనయితే మా పిల్లలు అన్నప్రాసన రోజు అది పట్టుకున్నారు. ఇది పట్టుకున్నారంటూ సంబరపడక.. అక్కడ పెట్టిన వస్తువుల్లో ఆట వస్తువులుంచారేమో చూసుకోండి. అరచేతుల్లో పెంచిన బిడ్డలను ఆట స్థలానికి వెంట ఉండి, తీసుకెళ్లండి. మీ బిడ్డ చేతిలో ఏ క్రీడా పరికరం అస్త్రమవుతుందో గమనించండి. ఆ దిశగా ఏం చేయాలో నిపుణులను సంప్రదించండి. మీరేం చేయగలరో చేయండి. శక్తి లేకపోతే సహకరించే వ్యక్తుల సమాచారం సేకరించండి. వెళ్లండి అడగండి.. అప్లై చేసుకోండి... అందలాలు ఎక్కాలంటే అడుగులు ఎక్కడ పడాలో మీ బిడ్డలకన్నా ముందు మీరు నేర్చుకోండి.

- ఏ ప్రాంతంలో, ఏ కుటుంబంలో జన్మించినప్పటికీ.. ఈ సంతానం జాతి సంపదగా పరిగణింపబడిన దేశమై ఉండాలి.
- తప్పటడుగులను తప్పని అడుగులుగా (పుట్ వర్క్) మార్చే మౌలిక వసతులు లభించాలి.
- పట్టుకుంటే పుటుక్కుమనకుండా పదికాలాలు మన్నే మేలిమి క్రీడా సామగ్రి కావాలి.
- ప్రాథమిక స్థాయిలోనే ప్రతిభను గుర్తించే వ్యాయామ ఉపాధ్యాయ వర్గముండాలి.
- సుశిక్షితులైన క్రీడా శిక్షకులు సంబంధిత క్రీడల కోసం నియమింపబడాలి.
- ప్రాథమిక స్థాయి నుండే యూనివర్సిటీ వరకూ ఉచిత విద్యతో పాటు నిర్బంధ వ్యాయామ విద్య నేర్పాలి.
- ఏ తల్లిదండ్రులు తమ ఆశలనుగాక, బిడ్డల ఆసక్తిని ప్రోత్సహించాలి. ఆహారానికి, అవసరాలకు సంబంధించిన సంపదను సమకూర్చగలగాలి.
- పసి ప్రాయంలోని ప్రతిభను, అంతర్జాతీయ వేదికపై పతాక విజేతలయ్యే వరకూ కృషి చేయించాలి. ఆ దిశలో క్రీడా పోషకులు ముందుకు రావాలి.
- ట్రైనింగ్ సమయంలో ఏం తినాలో? ఏం తినకూడదో తెలిపే పోషకాహార నిపుణులు వెంటన ఉండాలి.
- ఏ మందులు ఏవిధంగా తమ శరీరంపై ఉత్ప్రేరకంగా పనిచేస్తాయో తెలిపే పరిజ్ఞానం అందజేయాలి.
- ఏ క్రీడాకారుడి కండరాలు ఏ ఆటకు పనికొస్తాయో తెలిపే పరిశోధనాశాలలు, నిత్యం ప్రయోగాలు చేయాలి.
- రాష్ట్రానికో (డ్రగ్ లేబరేటరీ ) ఏర్పాటు చేయాలి.
- క్రీడాకారిణులను లైంగిక దృష్టితోగాక, శక్తిగా పరిగణించాలి.
- వేసే దుస్తుల వెనుక కండరాల ధృఢత్వాన్ని కాక.. వేగానికి అనుగుణంగా కదులుతున్న దేహ విన్యాసాన్ని కాంచన శిఖర సమున్నతంగా భావించాలి. అప్పుడు లభిస్తాయి అంతర్జాతీయ పట్టికలో పతకాలు.
- మనదేశాన్ని.. మరే దేశంతో పోల్చకండి. ఎందుకంటే దేశాల మధ్య దూరం, నైసర్గిక విభజనలు, ఉష్ణోగ్రతల వ్యత్యాసాలతో పాటు క్రీడల పట్ల మనకున్న చిన్నచూపు కూడా మన వెనుకబాటుతనానికి నిదర్శనం.
- 2024లో పారిస్ ఒలింపిక్స్ వస్తాయి. అప్పుడు మరలా కలం కదిలించక నిర్బంధ వ్యాయామ విద్య కోసం కృషి చేయాలి.
- గెలిచినా ఓడినా 'ఇంత' అని పారితోషికం కోసం.. క్రీడా సంఘాలను ఆవరించియున్న దుష్టవర్గాల నిర్మూలించాలి.
- తమ క్రీడా సంఘాల నాయకత్వాన్ని తామే ఎన్నుకునే రీతిగా క్రీడాకారుల ఓటుహక్కు కోసం కృషి చేయాలి.
- క్రీడా సంఘాల అధిపతులు కేవలం ఆ సంబంధిత క్రీడా నిపుణులై ఉండాలన్న నియమం ఉండాలి.
- మండలానికో స్పోర్ట్స్ స్కూల్, జిల్లాకో అకాడమీ (బాలురు, బాలికలు వేరుగా), రాష్ట్రానికో స్పోర్ట్స్ యూనివర్శిటీ కోసం కృషి చేయాలి.
- దేశంలో డోపింగ్ టెస్ట్ ల్యాబ్‌ల పెరగాలి. ఇప్పటి నుంచే ఎవరి స్థాయిలో వారు ఈ పోరాటం ఆరంభించాలి.
- అలాంటి ముఖ్యమైన పనిని, నిర్విఘ్నంగా సాగాల్సిన కృషిని వదిలేసి, కొందరి కులాన్ని కీర్తించే, కొందరి కులాన్ని విమర్శించే పనికిమాలిన కార్యాల్లో మునిగి, తేలటం ఏమాత్రం హర్షణీయం కాదు.
డాక్టర్ దుట్టా శమంతకమణి