
ప్రజాశక్తి- కె.కోటపాడు
మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలలో రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఏపీ రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయన బాబు డిమాండ్ చేశారు. మండలంలోని చౌడువాడ, మేడిచర్ల, గొండుపాలెం ఎ.కోడూరు గ్రామాలలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను రైతు సంఘం నాయకులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ముందుగా డబ్బులు చెల్లిస్తేనే వరి విత్తనాలు తెచ్చి రైతులకు ఇస్తున్నారని, అలా కాకుండా ప్రభుత్వం వరి విత్తనాలు ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. గత నెల 30 తేదీన రైతుల సమస్యలపై అమరావతిలో ధర్నా చేపట్టినప్పుడు ఆర్‌బికెల్లో రైతుకు కావలసిన అన్ని వస్తువులు ఉంచామని ప్రభుత్వ అధికారులు చెప్పారని, కాని తమ పర్యటనలో అదంతా డల్లతనమని తేలిందని పేర్కొన్నారు. ఈనెల 10న రైతు సమస్యలపై అన్ని సచివాలయాల వద్ద వినతి పత్రాలు అందజేస్తామన్నారు. గత సీజన్లో చోడవరం సహకార చక్కెర కర్మాగారానికి చెరుకు సరఫరా చేసిన రైతులకు పేమెంట్ వెంటనే ఇవ్వాలని రైతు సంఘం నాయకులు వనము సూర్యనారాయణ డిమాండ్ చేశారు. చెరకు మద్దతు ధర టన్ను ఒకటికి రూ.5000 ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల కన్వీనర్ ఎర్ర దేవుడు పాల్గొన్నారు.