ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్
రుతుపవనాలు మొదలయ్యాయి. ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. పంటల సాగుకు నాణ్యమైన విత్తనాలు కావాలి. మండలంలోని ఆర్‌బికెల్లో కేవలం వేరుశనగ, పిల్లిపెసర, జీలుగ విత్తనాలు మాత్రమే రైతులకు ఇస్తున్నారు. రైతులు అత్యధికంగా సాగు చేసే పత్తి, మిరప, ఉల్లి వంటి వాణిజ్య పంటల విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు బహిరంగ మార్కెట్‌ను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఆర్‌బికెల్లో రైతులకు అవసరమైన విత్తనాలు లేకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. కేవలం ఆర్‌బికెల్లో నమోదు చేయించుకున్న రైతులకు రూ.9300 ధర కలిగిన కె6 వెరైటీ వేరుశనగ విత్తనాలను ప్రభుత్వం 40 శాతం రాయతీతో, జీలుగా, పిల్లి పెసర విత్తనాలను మాత్రమే అందజేస్తోంది. రైతులు చేసేదేమీ లేక ఎమ్మిగనూరు పట్టణంలోని విత్తన దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. పత్తి ఎస్ 7067 రకం, సిజెంటా 2043 రకం మిరప విత్తనాలకు మంచి డిమాండ్ ఉంది. వ్యాపారులు చెప్పిందే ధర. ఎంఆర్‌పికే ఇవ్వాలి కదా అంటే స్టాక్ లేదని బిల్లు మాత్రం రూ.950, రూ.850 వేస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే ఎక్కడైనా తీసుకో అని బయటకు పంపిస్తున్నారు. రైతులు చేసేదేమీ లేక విత్తన వ్యాపారులు చెప్పిన ధరకే కొని నష్టపోతున్నారు. ఇటీవల జిల్లా విజిలెన్స్ అధికారులు ఎమ్మిగనూరులో విత్తనాల దుకాణాలపై దాడులు నిర్వహించారు. వ్యాపారులు మాత్రం అధిక ధరలకు విక్రయాలు ఆపడం లేదు. యథేచ్ఛగా అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్నారు.
విత్తన చట్టం నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
- ఎఒ మహేశ్వర్ రెడ్డి
పట్టణంలోని శ్రీపంచముఖి ట్రేడర్స్, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్, శ్రీబీర లింగేశ్వర ఏజెన్సీ, రేవతి సీడ్స్ దుకాణాల్లో శనివారం ఎఒ మహేశ్వర్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... సర్టిఫికెట్ లేకుండా, రైతులు సంతకాలు లేకుండా, స్టాక్ అప్‌డేటేషన్ లేకుండా విత్తనాలను అమ్ముతున్నందుకు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ దుకాణంలో పత్తి 518 ప్యాకెట్లను నిలిపేశారు. దీని విలువ రూ.4,41,862, మిరప 618 ప్యాకెట్లు, రూ.15,69,635, పంచముఖి ట్రేడర్స్‌లో పత్తి 1421 ప్యాకెట్లు, రూ.12,07,850, మిరప 933 ప్యాకెట్లు, రూ.5,99,710, శ్రీబీర లింగేశ్వర ట్రేడర్స్‌లో పత్తి 1210 ప్యాకెట్లు, రూ.10,32,130, మిరప 754 ప్యాకెట్లు, రూ.6,45,288, రేవతి సీడ్స్ దుకాణంలో పత్తి 2235 ప్యాకెట్లు, రూ.16,73,350, మిరప 4165 ప్యాకెట్లు, రూ.24,42,960, కంది 80 ప్యాకెట్లు, రూ.18,400 మొత్తం రూ.96,31,185 విత్తనాలకు స్టాప్ సేల్స్ ఆర్డర్ జారీ చేశామని తెలిపారు.
పంచముఖి ట్రేడర్స్‌లో తనిఖీలు చేస్తున్న ఎఒ మహేశ్వర్ రెడ్డి










