ప్రజాశక్తి - దుగ్గిరాల : ఇప్పటి వరకూ వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులు ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ పనులకు శ్రీకారం చుట్టారు. వర్షాలు కురువకముందే పొలాలు దున్నేసి సిద్ధంగా ఉంచగా ఇప్పుడు విత్తనాల కొనుగోలు ప్రారంభించారు. స్థానిక వ్యవసాయ మార్కెటింగ్ యార్డు ఆవరణలో ఉన్న జిడిసిఎంఎస్ లిమిటెడ్ బ్రాంచ్‌లో శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుండి వరి విత్తనాలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న రైతులు విత్తనాల కోసం తరలివచ్చారు. బిపిటి 52 04 రకం 25 కిలోలు రూ.1030, ఎంటియు 10 61 రకం రూ.వెయ్యి, ఎంటియు 12 62 రకం రూ.వెయ్యి బిపిటి 52 04 నంద్యాల 30 కిలోల బస్తా రూ.1200కు అమ్ముతున్నారు. మరోపక్క ఎరువులు కూడా అందుబాటులో ఉన్నట్లు బ్రాంచి మేనేజర్ సుబ్బారావు తెలిపారు. డిఎపి రూ.1350, 20 20 0 13 రూ.1200, సూపర్ ఫాస్ట్ రూ.520, యూరియా రూ.266, పొటాష్ రూ.1700కు అమ్ముతున్నారు. మండల వ్యాప్తంగా 24 వేల ఎకరాల మాగాణి భూములు ఉండగా 22 వేల ఎకరాలు వెద పద్ధతిన సాగవుతోంది. ఇదిలా ఉండగా విత్తనాలు, ఎరువులు ఎంఆర్‌పి ధరలకు లభిస్తున్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీపై లభించిన జింక్, జిప్సం లభించడం లేదని రైతులు వాపోతున్నారు. మండలంలోని పెనుమూలి, కంఠంరాజు కొండూరు గ్రామాల పరిసర ప్రాంతాల్లో జింక్, జిప్సం లోపం ఎక్కువగా ఉందని రైతులు చెబుతున్నారు.










