Jun 11,2023 23:45

ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం  వైస్‌ ఛాన్సలర్‌ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి 

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : లాంలోని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా పరిశోధనలు, నూతన వంగడాలను రూపొందించడం, పంటలపై వస్తున్న చీడపీడల నివారణకు ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలతో అధ్యయనం జరుగుతుందని విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. 1964లో ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రారంభమైందని, 1996లో ఎన్‌జి రంగా పేరు పెట్టారని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత 2016 మే నెలలో తెలంగాణ నుంచి ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరుకు సమీపంలోని లాంలో ప్రారంభమైందన్న ఆయన ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు తెలియజేశారు.
వ్యవసాయ విద్య పరంగా జరిగిన అభివృద్ధి?
దేశంలోనే మొదటిసారిగా వ్యవసాయ విద్యలో సెమిస్టర్‌ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఈ విశ్వవిద్యాలయం కింద ఆరు ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలు, మరో ఆరు అఫిలియేటెడ్‌ కళాశాలలు, రెండు ఫుడ్‌ సైన్సు, రెండు అగ్రి ఇంజినీరింగ్‌, ఒక కమ్యూనిటీ హెల్త్‌ సైన్సుకళాశాల, 21 అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలు, 71 ప్రైవేటు అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలు విస్తరించి ఉన్నాయి.
పరిశోధనలు ఎలా జరుగుతున్నాయి?
ఇప్పటివరకు 479 వంగడాలు వివిధ పంటల నుంచి విడుదలయ్యాయి. ప్రధానంగా చిరుధాన్యాలు, ధాన్యం, అపరాలు, నూనెగింజలు, వాణిజ్య పంటలనుంచి ఎక్కువ వంగడాలు రూపొందించార. 1980 నుంచి దక్షిణభారత దేశంలో మెగా వరి వంగడంగా ఉన్న బిపిటి 5204 రకం కీలక భూమిక పోషించింది. వరిలో ఉల్లుకోడును తట్టుకునే వరి వంగడం కాకతీయ, సుడిదోమను తట్టుకునే వజ్రం, మినుములో బూడిద తెగులును నిరోధించగలిగిన కృష్ణయ్య వంగడాలు తమ విశ్వవిద్యాలయం నుంచి వచ్చినవే. ప్రపంచలో చైనా తరువాత వరిలో హైబ్రిడ్స్‌ రకాలు రూపొందించాం. వరిలో కాటన్‌దొర సన్నాలు, సాంబ మసూరి, స్వర్ణ, విజేత, నెల్లూరు మసూరి రకాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీటిల్లో 74 శాతం ఉమ్మడి రాష్ట్రంలో, 26 శాతం ఇతర దేశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వేరుశనగలో కదిరి-6, కదిరి-7 రకాలు జాతీయ స్థాయిలో సగానికి పైగా విస్తీర్ణంలో పండిస్తున్నారు.జింక్‌ ఐరన్‌ అధికంగా ఉన్న రాగిలో ఇంద్రావతి వంగడాన్ని ప్రధాని మోడీ ఇటీవల విడుదల చేశారు.
విత్తనాభివృద్ధిలో విశ్వవిద్యాలయం పాత్ర?
దేశంలోని 15 రాష్ట్రాలకు, రాష్ట్రస్థాయిలో150 ప్రైవేటు కరపెనీలకు బ్రీడర్‌ విత్తనాన్ని మేమే అందిస్తున్నాం. జాతీయ స్థాయిలో వరి బ్రీడర్‌ విత్తనం సరఫరాలో విశ్వవిద్యాలయం 42 శాతం భాగంతో ఎంటియు 7029, ఎంపిటియు 1156, ఎంపిటియు 1001, బిపిటి 5204 తదితర రకాలను సరఫరా చేస్తున్నాం. వేరుశనగలో కె-1812,కె-6 రకం, ధరణి మొదలైన బ్రీడర్‌ విత్తనం సరఫరాలో జాతీయ స్థాయిలో 45 శాతం వంతు కలిగి ఉంది. గత మూడేళ్లలో 77,785 క్వింటాళ్ల బ్రీడర్‌ విత్తనాలను ఉత్పత్తి చేసి రాష్ట్ర, జాతీయ స్థాయి విత్తనోత్పత్తి కేంద్రాలకు విశ్వవిద్యాలయం నుంచి సరఫరా చేస్తున్నాం. నాన్‌ బాసుమతి ఎగుమతుల్లో ఆంగ్రూ రకాలు 33 శాతం సరఫరాతో ఏటా రూ.8,073 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నాయి.
విశ్వవిద్యాలయం విస్తరణకు చర్యలు?
ప్రస్తుతం విశ్వవిద్యాలయం పరిధిలో 13 కృషి విజ్ఞాన కేంద్రాలు, 13 ఏరువాక కేంద్రాలు ఉన్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత 26 జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఈ రెండిట్లో ఏదోఒక కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో అన్ని రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానం చేసి విశ్వవిద్యాలయం ద్వారా ఆర్‌బికేల్లో ఉన్న వ్యవసాయ, ఉద్యాన సిబ్బందికి వివిధ అంశా లపై శిక్షణిచ్చాం. ఆర్‌బికేల్లోని వ్యవసాయ, ఉద్యాన సిబ్బందికి నైపుణ్య శిక్షణ, మారుతున్న కాలమాన పరిస్థితులపై అప్‌గ్రేడ్‌, ఒరియం టేషన్‌ తరగతులు నిర్వహించాం. క్షేత్రస్థా యిలో రైతు సమస్యలకు సమాధానం ఇచ్చేందుకు వీలుగా టోల్‌ ఫ్రీనెంబరు 1800 425 0430 కాల్‌ సెంటర్‌నుప్రారంభించాం. ఆధునిక సాంకేతిక పద్ధతులు, వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులపై కృషి విజ్ఞాన కేంద్రాలు, ప్రాంతీయ పరిశోధనశాలలు ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నాం.