విత్తనం నిట్టూర్పు విడుస్తోంది
విత్తనం ఉసూరుమంటోంది
మట్టిపెళ్లలు
పెకలించుకుని,
అన్నం ముద్దై నోటికి చేరే
విత్తనం
రహదారులపై బతుకీడ్చుతోంది!
విత్తనం బతిమాలుతోంది
విత్తనం కరుణించమంటోంది
పిడికిళ్లలో నుంచి జారి
పుడమిని చీల్చుకుని మొలిచే విత్తనం
చలిని ముసుగేసుకుని
ప్రాధేయపడుతోంది!
విత్తనం బతికించమంటోంది
విత్తనం బతికిస్తానంటోంది
పాదాల కింద నలిగి
పంటై ఇంటిని చేరే విత్తనం
పొట్ట కొట్టొద్దని నినదిస్తోంది!
విత్తనం నినాదం
విత్తనం వివాదం
విత్తనమొక జీవితపాఠం
విత్తనమొక ఆధార పీఠం
ఊతమిద్దామా? ఊపిరి తీద్దామా?
దోసిళ్లతో నీటిని చల్లి
విత్తనఘోషను
ఆలకిద్దామా?
డా. జడా సుబ్బారావు
9849031587