కాలం అంకెను మాత్రం మార్చుకుంటుంది
మార్పు కళ్ళలో నిరాశే మిగులుస్తుంది
మోదమొకరిది ఖేదమొకరిది
పన్నుల గన్నులలో
నింపే తూటాలు
రూపాయి పాపాయికి
చేసే ముస్తాబులు
తీయ తీయని హల్వా
మీఠా తయారీలు
పంచ్‌ల మీద పంచ్‌లతో కమ్మని కబుర్లూ
సామాన్యుడికి ఎపుడైనా అక్కరకొచ్చేవేనా?
స్వతంత్ర దేశంలో బతుకు భారమౌతుంది
నవ్వన్నది నానాటికీ దూరమౌతుంది
బతుకులకు బడ్జెట్ కేంద్ర బిందువౌతుంది
పసిడి పరుగులు తీస్తుందన్నా
పెట్రోల్ ధర మండిపోతుందన్నా
నిత్యావసర సరుకులు, విలాసవినోద సామగ్రిపై
కనికరం చూపినా, చూపకున్నా
బెంబేలెత్తిపోయే జనాలు కొందరైతే
ఆకాశానికి దూసుకుపోతున్న..
లేదా అధఃపాతాళానికి చేరుకుంటున్న
సెన్సెక్స్ సూచీలతో
కూడికలూ తీసివేతలతో
సతమతమౌతూ మరికొందరు.
రాబడి ఖర్చు బేరీజుల బేజార్లో
ఆర్థిక బజారంతా సందడే సందడి
మనిషి అసలు జాడను మరచి
విత్త చిత్తం దిశగా పరచే ఎర్ర తివాచీలు
- డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి
9849331554