May 15,2022 08:30

'బియ్యం ఇంగ రెండు దినాలైతాయేమో' అంటూ చేటలోని బియ్యాన్ని చెరుగుతా నిరాశగా అన్నది జానకమ్మ.
భార్య మాటలు వినీ విననట్లు ఎటో చూస్తూ వాలుకుర్సీలో కూర్చొని ఉండాడు గిడ్డయ్య సారు.
'ఏమీ అనకపోతివి' అని బాధగా అడిగింది జానకమ్మ.
'పిల్లలు ఏ నెల జీతం ఆ నెల ఇస్తే ఈ బాధ వుండదు. నీవు అడగవు ఎట్లా?' అని మరోసారి అడిగింది.
'నెల నెలా జీతం ఇచ్చేకి వాళ్ల నాయనోళ్లు ఏమన్నా ఉద్యోగస్తులా? రైతులు. ఆరునెలలకో, ఏడునెలలకో ఒకసారి వాళ్లకి దుడ్లు వస్తాయి' అని చిన్నగా కోప్పడ్డాడు గిడ్డయ్య సారు.
'మన తిప్పలు సూడు. ఎవురినన్నా సేబదులు అన్నా అడగరాదా?' అని ఆశగా అడిగింది జానకమ్మ.
'ఆ! దసరా పండగ వస్తాంది గదా! పిల్లలతో ఊర్లోకి పోతాను గదా. ఈసారి పంటలు బాగా పండేయి, దుడ్లు బాగా వస్తాయిలే. ఆ దుడ్లతో బియ్యం, బ్యాల్లు, జొన్నలు అప్పుడు కొందాం లే' అని సెప్పి కుర్సీలోంచి లేసేడు గిడ్డయ్య సారు.
బయట మేతకు తోలుకుపోయిన పసువులు ఇంటికొస్తా వుండాయి. ఇండ్ల దగ్గరున్న సిన్నదూడలు వాళ్ల అమ్మలు వచ్చారనే ఆనందంతో సంతోషంగా అరుస్తా వుండాయి. పసులు గూడా సంబరంగా ఇంటికి వస్తుండాయి. ఇల్లు జేరుకున్న పసువులు కుడితి నీళ్లు తాగేకి ఒకదానికొకటి పోటీపడతాండాయి.
'ప్రయివేటుకి పిల్లలొచ్చే టైం అయ్యిండాది. అంగి ఎసుకోపో' అని అంది జానకమ్మ చెరిగిన బియ్యాన్ని డబ్బాలో ఎత్తుకొంటా.
'ఆ' అని యాదో ఆలోసన సేసుకొంటా గిడ్డయ్య సారు ముఖం కడుక్కొనేకీ జలారి తాకి పోయినాడు.
పిల్లోల్లు ఒక్కొక్కరే వస్తాండారు. ఈ సిన్న పల్లెటూర్ల ప్రయివేటు ఏంటికప్పా? అంటే మా వూరికి కాల్వ ఉండే గదా! రెండు పంటలూ బాగా పండుతుండే. దుడ్లు దండిగా ఉంటూ ఉండే. గవర్నమెంట్‌ సారు ప్రయివేటు సెప్పననే. ఉరోళ్లందరూ కలిసి ఈ గిడ్డయ్య సారును పిలుసుకొని వొచ్చిరి. పైగా గిడ్డయ్య ఉండేకి ఇల్లు ఇచ్చే. జీతం మాత్రం ఆరునెలలకి ఒకసారి, ఏడునెలలకి ఒకసారి ఇస్తా వుండిరి.
నేసే శీనుగాడు ప్రయివేటుకి వస్తున్న పిలగాళ్ల పేర్లు పలక మీద 'శ్రీ' తో మొదలుపెట్టి సున్నా, ఒకటి, రెండు మూడు అని వరస నంబర్లు ఏసీ పేర్లు రాస్తా ఉండే. ఎంత నంబరు వొస్తే వానికి అన్ని దెబ్బలన్నమాట. శ్రీ అని ఉన్నోనికి, సున్నా అని ఉన్నోనికి దెబ్బలు లేవన్నమాట. ఎవురు ముందొస్తే వాళ్లకే పేర్లు రాసే అధికారం. ఆ అధికారాన్ని అనుభవించే దానికోసం వాడు అందరికంటే ఫస్టే వొస్తాండే. ఇంగో ఇసయం తెలిస్తే మీరు నాగుతారు? ఏమప్పా అంటే వాడికి పేర్లు రాసేకి రాదు. మల్లి ఎట్లా రాస్తాడంటారా? ఒక్కొక్కర్కికీ ఒక్కో గుర్తు పెడతాడు. ఎంతమంది ఉంటే అన్ని గుర్తులు పెడతాడు. అంటే కోడింగు, డీకోడింగు అన్నమాట. ఆ కోడింగు వానికి తప్ప ఈ భూ మండలం మీద ఎవునికీ తెల్దు. ఈ రకంగా వొచ్చినోల్ల పేర్లు వొచ్చినట్లు నంబరు ప్రకారం రాసే పద్దతిని మా గిడ్డయ్య సారు ఎందుకు పెట్టిండాడు అంటే, అందరూ జల్దీ ప్రయివేటుకి వొచ్చేకి అన్నమాట. ఎప్పుడూ ఈడిగ ఈరేంద్రగాడు లాస్ట్‌కి వొస్తుండే. ఎప్పుడూ వానికే అందరికంటే ఎక్కువ దెబ్బలు పడతాండే. వాడు ఏంటికి లేటుగా వొస్తాండు అంటే ఇంటికాడ వానికి పనెక్కువ. ఏంటికి పనెక్కువ అప్పా అంటే.. వానికి వాళ్ల నాయన లేడు కదా! వాడి నాయన యాడికి పోయేడప్పా? అంటే ఆ యప్ప ఉసేనమ్మని ఏస్కొని పోయేనంట. ధన్నాడ దగ్గర ఈదుల్ల ఉసేనమ్మతో ఉండాడంట. ఈరేంద్రగాని వాళ్లమ్మ ఈడి అంజినయ్యోళ్లకి కూలికి పోతాది. సేన్ల పని సూసుకోని, అంజినయ్యోళ్ల ఇంటికి పోయి పసులకి నీళ్లు తాపిచ్చి ఇంటికి రావల్ల. ఈ పనులు ముగించుకొని ఇంటికి వచ్చే టైంకి, వీడు నీల్లు తెచ్చిపెట్టి, కసువుగొట్టి అంతా రెడీ సేసి ప్రయివేటుకి రావల్ల. ఈరేంద్రగాడిని ఎట్లన్న సదివించల్లని వాల్లమ్మ కాయాస. కూలికి పోతే బువ్వ, లేకపోతే లే! కానీ ఇప్పుడు ఈరేంద్రగాడు బడికి రాడు, ప్రయివేటుకి రాడు. ఏంటికంటే వాని ఈపుకి పుండు అయ్యింది గదా! ఎప్పుడూ వాడు మంచం మీదనే ఉంటాడు. ఎమ్మిగనూరుకి పిల్సకపోయి డాక్టరుకి సూపిద్దామంటే వాళ్లకి తినేకి దొరికేదే కష్టంగా ఉండాది. యాడ పిలసకపోతారు? వాళ్లనాయన సూస్తే అవులేగాడు. వూరు ఇడిసిపోయిందే కాని తిరిగి సూడలే. ఊర్లోనే మంగల డాక్టరు యేదో మందు అంటిచ్చిపోతా ఉంటాడు. నాను దీన్ని నయం సేయలేనమ్మ, పెద్ద డాక్టరు దగ్గరికి తీసుకొని పోవల్ల అని ఆరు నెలల నుంచి సెబుతూనే ఉండాడు. ఆ యమ్మి తన గాశారాన్ని తిట్టుకొంటా, మొగుడిని ఆడిపోసుకుంటా ఉండడం మించి ఏమీ సెయ్యలేకపోతాంది. మూడు అంకణాల పాత మిద్దె తప్ప ఆ యమ్మికి ఇంగ ఏమీలేదు. ఈ యమ్మి ఎప్పుడూ ఈడిగ పెద్ద కాజన్న వాళ్ల సేనుకే కూలికి పోతాది. దానికోసం ఆ యప్ప పండగలకి, పబ్బాలకి, బట్టకి కొంచం సేయి పడతా ఉంటాడు.
్య్య్య
పిల్లోల్లు అందరూ ప్రయివేటుకి వచ్చిండారు. గిడ్డయ్య సారు పిల్లోల్లు పలకల మీద రాసుకొచ్చిన హోంవర్క్‌ సూసి టిక్కు కొడుతుండే.
మేము అందరూ లైన్ల నిలబడి పలకలు సారు దగ్గర నుండి తీసుకొంటాంటిమి. అది అయిపోయినాక సారు ప్రభవ, విభవ అని అరవై తెలుగు సంవత్సరాల పేర్లు, నక్షత్రాల పేర్లు, ఋతువుల పేర్లు, కొన్ని శ్లోకాలూ పలికిస్తూ ఉండే. సదివేది, రాసేది, కూడికలు, తీసివేతలు, బాగాహారం, ఎక్కాలు మాకి ప్రయివేటు సిలబస్సు. అయిదు పూర్తి అయ్యేనాటికి మాకి ఇవన్నీ వొస్తుండే. ఎమ్మిగనూరు, గోనెగండ్ల హైస్కూలుల్లో మేము ఆరు సేరతా ఉంటిమి. హైస్కూలులోన గువ్వలదొడ్డి పిల్లోల్లు అంటే ఎక్కాలకి ఫ్యామస్సు. ఎక్కాన్ని పైనుండి కిందికి కింది నుండి పైకీ సెప్పేదొమ్ము మా ఊరి పిలగాళ్లకే ఉంటా ఉండే.
దసరా పండగ ఇంకో వారం దినాలుండాది అనంగా ప్రవేటు సెప్పే మా బోయ గిడ్డయ్య సారు (గవుర్నమెంటు సారు తురకాయప్ప! మక్కాకి పోయి వచ్చే, నేను ఇట్లాంటి పండగలకి వచ్చేకి లేను, సేసేకి లేను. దానికే మా గిడ్డయ్య సారు ఈ పండగని అందుకొనే) మమ్మల్ని అందుర్నీ కూడగట్టుకోని, కలర్‌ పేపర్లు తెప్పిచ్చి, తడికలకి ఉండే ఎదురు దబ్బలతో అంబులు (విల్లంబులు) సేపిస్తా ఉండే. అవుట్లకి రంగు కాయితాలు పోటీలు పడి కరిపిస్తాంటిమి. సిన్నబుక్కు కుట్టి దానికి గూడా రంగు కాయితాలు అంటిస్తాంటిమి. ఆ బుక్కుల ఈ కిందున్న పాటని ఒక తుక్కు (వైపు) ఒక లైను, ఇంగోతుక్కు ఇంగో లైను రాస్తుంటిమి. బుక్కులు, అంబులు రెడీ అయ్యినంక ఊర్లోకి ఎల్లబారుతుంటిమి. ఫస్టు ఈడిగి పెద్దంజినయ్య ఇంటికి ఫోతుంటిమి. ఫోవడం ఫోవడమే గొరవ మల్లేసు గాడు డబ్బలోన ఉన్న బుక్క పిండిని అంబు బాణానికి అంటించి ''జయీభవ విజయీభవ! దిగ్విజయీభవ'' అనుకొంటా అంజినయ్యోల్లింటి తల వాకిలికి కొడుతుండే. అది గురుతు అన్నమాట, ఆ యింటికి వొచ్చి పొయ్యేమని. ఆతుక్కు (వైపు) కొంతమందిమి, ఈ తుక్కు కొంతమందిమి లైను నిలబడి, ఈ పాటని ఒక్కొక్క లైనుని ఒక్కొ తుక్కు ఉండేటోల్లు పాత మిద్దెల మన్ను రాలేతట్ల గెట్టిగా పాడతా ఉంటిమి. మా అరుపులకి కుక్కలు బెదురుకొని పారి ఆంతదూరం పోయి, కుయ్యో అని మూతి ఆకాసానికి ఎత్తి అరుస్తుండే! గాడిపాటికాడ ఉన్న ఎనుముగొడ్లు దబుగ్గున లేసి తలుగు తెంచుకొనేకి సూస్తుండే. ఇంటిముందుకు పోతే మమ్మల్ని ఉరికిచ్చే పింజరి గోకారొల్ల కుక్కని ఆఫొద్దు మాత్రం మాము ఉరికిస్తుంటిమి. కచ్చంతా ఆ పొద్దే తీర్చుకొంటుంటిమి. ఊర్లఉన్న కుక్కలు, దూడలు, పిల్లులు, ఆవులు, ఎనుములు మా అరుపులకి బెదిరేకొద్దీ మా కోతి శాష్టలు ఇంకింత సేస్తుంటిమి.
''శ్రీ గనాదీసాయా శివకుమారాయ
నాగముక తొండాయ నాగబూసాయా
అయ్యవారికి సాలు ఐదొరహాలు !
పిల్లవాళ్లకు సాలు పప్పు బెల్లాలు!''.....
అని పాడినంక ఇంగ దుడ్లు వసూలుకి దిగుతుంటిమి. వరసైన పిలగాండ్లు ''లే మామా! నీ వొగులు సాలు గాని, ఓ పదిరూపాయలన్నా ఇయ్యి'' అంటుండిరి.
''యలే! మీకి ఉన్నట్ల మాకి పదెకరాలు సేను ఉండింటే ఇస్తుంటిమి! ఇగా మీ సారుకి ఐదు రూపాయిలు, మీకి ఒక రూపాయి తీసుకోండి'' అంటుండిరి. మా గిడ్డయ్య సారు తీసుకోండిరా అంటే మామంతా సారు మీద కోపం అయితాంటిమి.
''సార్‌ ఆ యప్ప అన్నీ ఉద్దరమాట్లు సెపుతాడు. ఇనవాకు'' అంటుంటిమి.
మల్ల మా గిడ్డయ్య సారు నోరుమెత్తనోడు కదా! అందరూ కలబడి అనుకున్నంత ఇచ్చే వరకి ఇడిసిపెట్తలేకుంటిమి. పండగ రేపనేంత వరకూ మాకందరికీ కుశాల కుశాల! ఎక్కాలు రాసే పనిలే! సెప్పే పనిలే! యస్యగ్నాన దయాసిందు, గోడ దాటితే ఇదేసందు అనుకొంటుంటిమి. మామొచ్చేమని కొంతమంది మిద్దె మీద దాపెట్టుకొంటుండిరి. లొడ్డబావగాడు, బారికి అంజినయ్యగాడు ఎట్ల కనిపెడుతుండ్రో సూడప్పా! పట్టుకొనొచ్చి నిలబెడుతుండ్రి. ఎవురూ కోపం అయితలేకుండ్రి. మా అల్లరికి వాల్లు గూడా నుగ్గ నగుతుండ్రి. సారుకు జాడికంబడి ఏసి కూసబెడుతుండ్రి. తాగేకి పాలు ఇస్తుండ్రి. ఎవురన్న దుడ్లు తక్కువిస్తే ''సార్‌! మాకి పొప్పుల బెల్లాల దుడ్లు వొద్దులే! అవి నువ్వే తీసుకో'' అంటుంటిమి. పండగ అయిపోయినంక గిడ్డయ్య సారు ఎమ్మనూరు సంతకి పోయి, బెండు, బత్తాసు, బొరుగులు, బూంది తెచ్చి మాకందరికీ పంచుతుండే. ఏమన్న సెప్పప్పా! ఈ సంబరం ఎయ్యి జన్మలెత్తినా రాదు సూడప్పా!
ఈసారి కాలం బాగా అయ్యిండే గదా! సారుకి మాకీ శానా దుడ్లు వసూలు అయ్యే. ఈడిగొండ్ల ఇండ్లు ముగించుకొని ఇంగ కురువోల్ల ఇండ్లకి పోదామనుకొంటుంటే పొప్పురోట్టే గాడు (అంజినయ్యగాని అడ్డపేరు)
''యలే! ఈరేంద్ర గాని ఇల్లు ఇడిసిపెట్టేమే. ఈ ఇల్లు సూసుకొని కురవొల్ల ఇండ్లకి పోదాం పాండి' అనే .
గొరవ మల్లేసుగాడు ''ఈరేంద్రగానింట్ల ఏముండాది? వానికే తినేకి లేదు. మనకేమిస్తాడు? వొద్దు పాండిలే' అనే .
ఎంటనే గొరవ మల్లెసు గాడు అందుకొని ''యలే నాకేమీ తెల్దా? దుడ్లకి కాదప్పో పొయ్యేది. వాని ఇంటికాడికి పోయి బుక్క పిండి కొట్టి పాట పాడితే ఈరేంద్రగాడు మనందరినీ సూసి కుశాల అయితాడని పోదామంటి'' అనే.
గిడ్డయ్య సారు కూడా ''వాణ్ని సూసినట్లుంటాది పాండి' అనే.
అందరమూ ఈరేంద్రగాని ఇంటితుక్కు పోతిమి. వాడు మంచంల బోర్లా పండుకొని ఉండే. వీపు మీదున్న పుండు మీద బట్ట ఏసుకొని. మమ్మల్ని, సారును సూసి గబుక్కున లేసి కూసునే. వాల్లమ్మ నీళ్లు తెచ్చేకి పోయి ఉండేనేమో ఇంట్ల లేకుండే. వాకిలికి బుక్కపిండి కొట్టి పాట ఎత్తుకొంటిమి. ఈరేంద్రగాని సంతోషం సూడ్లేములే. శానా కుశాలు అయ్యిడు. అంతలోపల వాళ్లమ్మ సంకలో నీళ్ల కడవ, కడవమీద సేదు తాడు పెట్టుకొని వచ్చే. సారుని కూసోమని రగ్గు వేసే. తాగేకి గళాసుల నీళ్లు తెచ్చి ఇచ్చే. ఇచ్చేకి ఇప్పుడు ఏమీ లేదనీ, శనివారం కూలీలు ఇస్తే తానే ఇంటికి తెచ్చిస్తాను అని సారుతో, బాధాగా సెప్పే.
సారు ''మేము వొచ్చిండేది దుడ్లకి గాదమ్మా! ఈరేంద్రగాన్ని సూసేకి'' అనే. మేము ఈరేంద్రగానికి టాటా సెప్పి, కురువోల్ల ఇండ్లతుక్కు మల్లితిమి.
పండగ ఇంగ రెండు దినాలే ఉండాది అనంగా అన్ని ఇండ్లూ తిరిగిడిస్తిమి. సారు సెప్పిన లెక్క ప్రకారం సారుకి ఐదు నూర్లు, మాకి నూట ఇరవై రూపాయలు వచ్చే. ఇంగ మాము సారు ఎప్పుడు ఎమ్మనూరికి పోతాడా, ఎప్పుడు బూందీ, జిలేబీలు తెచ్చి ఇస్తాడా అని ఎదురు సూడబడితిమి. దసరా పండగా అయిపాయ. సారు ఇంగ రేపు పోదామనుకుంటా ఉంటే నేసే శీనుగాడు ఒక ప్రతిపాదన పెట్టే.
''సార్‌ ఈ సారి మాకి పొప్పు బెల్లాలు వొద్దు. ఆ దుడ్లు ఈరేంద్రగానికి ఇద్దాం'' అనే.
గొరవ మల్లెసుగాడు, లొడ్డబావగాడు, పోగు ఎంకటేశుగాడు ''అవును సార్‌ అదే సేద్దాము'' అనిరి. ప్రయివేటుల అందరూ అట్లనే సేద్దాము సార్‌ అనిరి.
పొప్పురోట్టేగాడు ''సార్‌, ఈపొద్దు మాపుసారి ఈరేంద్రగాని ఇంటికాటికి పోయి ఆ నూట ఇరవై రూపాయలు ఇచ్చొద్దాము. వాళ్ల అమ్మ ఇప్పుడు కూలి నుంచి వచ్చి ఉండేకిలేదు. రేపన్నా ఎమ్మనూరుకి పిలుసుకొని పోయి ఈదుడ్లతో వాణ్ని పెద్ద డాక్టరుకి సూపిస్తాది'' అనే. గిడ్డయ్య సారుకు పిల్లల ప్రేమను సూసి మనసు కరిగిపోయ. నానూ ఇంత ఇస్తానులే అనే. పిల్లల్ని వెంటేసుకొని ఈరేంద్రగాని ఇంటికి మాపుసారి బయలుదేరే.
ఈరేంద్ర గాని ఇంటికాడ శానా మంది ముసురుకొని ఉండారు. వాళ్లమ్మ పడి పడి ఎదలు గుద్దుకుంటా ఎడుస్తా వుంది. అందురూ సారుని ఇడిసిపెట్టి వాడి ఇంటికాడికి ఉరికితిమి. ఈరేంద్ర గాడిని బయట గోనె సంచి మీద పడుకొని పెట్టే. పైన పాత రగ్గు కప్పే. ముకము మాత్రమే తెరిసి పెట్టే. ముక్కుల దూది పెట్టే. రెండు కాళ్ల బొటన వెళ్లు పురికోసతో కట్టే. తల దగ్గర ఊదికడ్డీలు, దీపము పెట్టే. ఉంటలు కట్టిన పాత దిండు వాడి తలకాయి కింద ఉండాది. మా అందురికీ వాడు సచ్చిపోయేడని అర్థము ఆయే. సారు కూడా కండ్లల్ల నీళ్లు పెట్టుకునే. సారు ఏడ్సింది సూసి మాకీ ఏడుపు వచ్చే. మా మందురమూ సారుని పట్టుకొని ఏడుస్తుంటే ఆడున్నోళ్లందరూ మమ్మల్ని సూసి ఏడ్సబట్టిరి.
ఈరేంద్ర గాని వాళ్లమ్మ ఏడుపు ఆపేకి ఎవురికీ తరంగాలే.
''ఉండే నువ్వోక్కడు గూడా నన్ను ఇడిసిపోతివి గదప్పా! ఇంగ నానేంటికి బతకల్లా? ఈ పానం ఎవురికోసం నిలపల్లప్పా?'' అని ఏడుస్తుండే.
పొద్దు మునిగే కాబట్టి మన్ను రేపే అనిరి ఆడకి వొచ్చినోళ్లు. రాత్రంతా పీనిగిని పెడితే నిద్ర కాయల్ల, భజన సేపీయల్లా! ఈయమ్మతో భజన సేపిచ్చేకి అయితాదా? అని అనబట్టిరి. ఆ యమ్మతో కాదని పొద్దుమునిగినాక మొన్ను సేసేకి అయితాదా? అని ఇంకొంతమంది అనిరి. ఎట్లో గొట్ల సెయ్యల్ల మరి. ఇయ్యాలప్పుడు మన్ను అయితే సేయగూడదు సూడప్ప అని ముసిలోల్లు అనిరి.
గిడ్డయ్య సారు జేబుల తన ఐదు నూర్లు, పిల్లల్ల నూట ఇరవై తీసి మొత్తం ఆరునూర్ల ఇరవై రూపాయలు నేసే శీను గాడి సేతలపెట్టి ఈరేంద్రగాని తలాపున పెట్టిరాపో! అనే. పిల్లల ఏడుపు, సారు ఏడుపు సూసి ఊరూరే ఏడిసే.
ఈరేంద్ర గాని ఇంటికాడ రాత్రంతా భజన జరిగే. భజన సేసినోళ్లకి ఉగ్గాణి ఒకసారి, టీ మూడుసార్లు సప్లయి ఆయే. ఈరేంద్ర గాడిని మట్టికు తీసకపోయేంతవరకీ పిల్లోల్లు ఎవురూ బడికిగానీ, ప్రయివేటుకు గానీ పోలే. తప్పెట్లతో ఈరేంద్ర గాడి శవాన్ని తీసకపోనీకి స్టార్టు సేసిరి. ఇస్కూలు పిల్లోల్లు ఈరేంద్రగాడి శవ ఊరేగింపుని కనుసూపు వరకీ సూసుకుంటా ఏడుసుకుంటా నిలబడిరి. పిల్లోల్ల కండ్లు మసక బారే. ఈరేంద్రగాడి ఊరేగింపు దూరం పోయేకొద్దీ తప్పెట్ల శబ్దం గూడా తక్కువైతూపోయే.