ప్రజాశక్తి - చిప్పగిరి
ఎబిసిడి వర్గీకరణ సాధన కోసం ఈనెల 11న హైదరాబాదులో జరిగే మాదిగల విశ్వరూప మహాసభకు తరలి వెళ్దామని ఎంఆర్‌పిఎస్ జిల్లా ప్రచార కార్యదర్శి ముత్యాల గాదిలింగ కోరారు. శనివారం ఎంఆర్‌పిఎస్ మండల అధ్యక్షులు జిఎస్.నెట్టికంటయ్య ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలోని ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్‌పిఎస్ నాయకులు డీలర్ రామయ్య, గాదిలింగ, నెట్టికంటయ్య మాట్లాడారు. ఎబిసిడి వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. మాదిగల సత్తా చూపడం కోసం విశ్వరూప మహాసభను ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ అధ్యక్షతన హైదరాబాద్ నడిబొడ్డున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరవుతున్నారని చెప్పారు. ఎస్సీలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఎంఆర్‌పిఎస్ నాయకులు జిఎస్.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఎస్సీ కాలనీలో కరపత్రాలను పంపిణీ చేస్తున్న నాయకులు










