Jul 24,2023 20:08

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా విలేకర్లు : మనిషిని మనిషిని గౌరవించాలని, కులం అడ్డు గోడల్ని కూల్చేయాలని విశ్వనరుడు జాషువా తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేశారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) మండల కార్యదర్శి ఎస్‌.రాజకుమార్‌ అన్నారు. జాషువా వర్ధంతి సందర్భంగా సోమవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మను భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నతమైన చదువులు చదువుకున్నారని, ప్రజా వైతాళికునిగా, ఉపాధ్యాయునిగా, శాసన మండలి సభ్యునిగా సమాజాభ్యున్నతికి పాటుపడ్డారని చెప్పారు. జాషువా రచనలను నేటి యువత అధ్యయనం చేయాలని కోరారు. చిలకలూరపేటలోని శాఖా గ్రంథాలయంలో జన విజ్ఞాన వేదిక, జ్ఞానేశ్వర అర్బన్‌ అండ్‌ రూరల్‌ డవలప్మెంట్‌ సొసైటీ (గార్డ్స్‌) ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. జాషువా చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా సాహితీ విమర్శకులు డాక్టర్‌ పివి సుబ్బారావు మాట్లాడారు. రాష్ట్ర అధికార భాషా సంఘ సభ్యులుగా ఎంపికైన డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లును సత్కరించారు. తొలుత విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్‌ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఎం.వెంకట కోటయ్య, జి.నారాయణ, డి.కొండయ్య, సిహెచ్‌.విన్సెంట్‌పాల్‌, డి.బుజ్జిబాబు, గ్రంధాలయ ఇన్‌ఛార్జి అధికారి డి.వీర్రాజు, గార్డ్స్‌ సంస్థ ఉపాధ్యక్షులు జి.యాకోబు, సలహాదారులు మాజీ ఎజిపి డి.చిట్టిబాబు పాల్గొన్నారు. డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో జాషువా చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. హెచ్‌ఎం పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కుల వివక్షకు గురైన జాషువా పట్టుదలతో చదువుకుని పదేళ్లపాటు ఉపధ్యాయునిగా పని చేశారని చెప్పారు. మూఢాచారాలపై తిరుగుబాటు చేశారని, తన రచనల ద్వారా సమాజంలో చైతన్యం తెచ్చారని అన్నారు. కార్యక్రమంలో పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ ఎం.సురేంద్రరెడ్డి, ఉపాధ్యాయులు ఎ.నీలిమ పాల్గొన్నారు. సత్తెనపల్లిలోని వావిలాల ఘాట్‌ వద్ద వున్న జాషువ విగ్రహానికి వైసిపి పల్నాడు జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షులు చిలుకా జయపాల్‌ పూలమాలలేసి నివాళులర్పించారు. మనిషిని మనిషిని వేరుచేసే కుల రక్కసిని జాషువా తన కవితాస్త్రాలతో చీల్చి చెండాడని చెప్పారు. కార్యక్రమంలో పి.నాగేశ్వరావు, సిహెచ్‌.రమణయ్య, జి.రాము, వి,అఖిల్‌, సిహెచ్‌.డానీ, బి.అనీల్‌ పాల్గొన్నారు.