ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : సంప్రదాయ హస్త కళా నైపుణ్యాల అభ్యున్నతి, చేతి వృత్తుల వారిని ఆదుకు నేందుకు ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, ఈ పథకాన్ని జిల్లాలోని చేతివృత్తుల వారు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులను పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆదేశించారు. ఈ పథకంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పథకం అమలుకు కలెక్టర్ చైర్మన్‌గా కమిటీని నియమించారు. కన్వీనర్‌గా జిఎం డిఐసి వ్యవహరిస్తారు. సభ్యులుగా డిఆర్‌డిఎ పీడీ, డిపిఒ, మున్సిపల్ కమిషనర్, ఎల్‌డిఎం, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు ఉంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల అధికారులు, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిం చారు. ఈ పథకం కింద తొలి ఏడాది 18 సంప్రదాయ చేతివృత్తుల వారికి ప్రయోజనం కలుగుతుందని కలెక్టర్ తెలిపారు. శిక్షణ పొందేందుకు దరఖాస్తున్న చేసుకున్న వారికి రోజుకు రూ.500 ఉపకార వేతనంతో శిక్షణిస్తారని, శిక్షణ తరువాత పరికరాల కొనుగోలుకు రూ.15 వేలు ఆర్థిక సహాయం అందిస్తారని తెలిపారు. హస్త కళాకారులు ఈ పథకం కింద రాయితీ వడ్డీరేటుతో మొదటి దఫా రూ.లక్ష రుణం తీసుకోవచ్చని, రెండవ దఫా రూ.2 లక్షలు వరకు రుణం ఇస్తారన్నారని, ఈ పథకం కింద రుణం తీసుకున్న వారికి వడ్డీ రేటు 5 శాతంగా ఉంటుందని వివరించారు. దుర్గిలో శిల్పాలు చెక్కేవారు, తోలుబొమ్మలు చేసేవారు ఈ పథకానికి అర్హులని, వారి నుండి అభ్యర్థులను గుర్తించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు.










