Nov 11,2023 19:37

ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు, యాజమాన్యం

ప్రజాశక్తి - కౌతాళం
విశ్వ జ్ఞానం విద్యతోనే సాధ్యమని తహశీల్దార్‌ రామేశ్వర్‌ రెడ్డి తెలిపారు. శనివారం ప్రతిభ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌లో మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించారు. ముందుగా ఆజాద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధులు, ఉన్నత విజయాలు సాధించిన ప్రముఖుల వేషధారణతో పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ మాట్లాడారు. ప్రతిభ హైస్కూల్‌ యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో విద్యాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనిభ్యసించి చెడు అలవాట్లకు, చెడు స్నేహాలకు, దూరంగా ఉండి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కలలను సాకారం చేయాలని చెప్పారు. కరస్పాండెంట్‌ సయ్యద్‌ దూద్‌ బాష, ప్రధానోపాధ్యాయులు జ్ఞానేశ్వరి, సెక్రటరీ సయ్యద్‌ మైనుద్దీన్‌, ప్రతిభ హైస్కూల్‌ పూర్వ ప్రధానోపాధ్యాయులు సయ్యద్‌ అహ్మద్‌ పీర్‌, ఉపాధ్యాయులు సయ్యదా సబిహా, జయలక్ష్మి, రామలక్ష్మి, ముంతాజ్‌, రాజు, పరమేష్‌, భీమేష్‌, శిరీష, సునీల్‌, సురేష్‌, వ్యాయామ ఉపాధ్యాయులు శివశంకర్‌ పాల్గొన్నారు.