
ప్రజాశక్తి - పాలకోడేరు
అభ్యుదయ వాది, మానవతావాది, సిపిఎం సానుభూతిపరులు పిన్నమ్మ రాజు ప్రతాప్‌రాజు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వైసిపి సీనియర్ నేత పిన్నమరాజు పృథ్విరాజు, భారతిదేవి విస్సాకోడేరులో విశ్వజనని ప్రతాప్‌రాజు ఛారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్‌ను వసుధ ఫౌండేషన్ కన్వీనర్, రిటైర్డ్ డిఇఒ ఇందుకూరి ప్రసాద్‌రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రాజు చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కుట్టుమిషన్ల శిక్షణ కేంద్రాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం ప్రారంభించి మాట్లాడారు. నిస్వార్ధపరుడు ప్రతాప్‌రాజు పేరున కుటుంబ సభ్యులు ట్రస్ట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గతంలో ప్రతాప్ రాజు అనేక సేవా కార్యక్రమాలు చేశారని, ముఖ్యంగా మహిళల అభ్యున్నతికి పాటుపడ్డారని తెలిపారు. సాటివారికి సేవ చేయాలనే ఆలోచనతో ప్రతాప్‌రాజు ఉండేవారని, ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా కుటుంబ సభ్యులు ముందుకు సాగడం గొప్ప విషయమన్నారు. రిటైర్డ్ డిఇఒ ప్రసాద్ రాజు మాట్లాడుతూ మానవతావాది ప్రతాప్‌రాజు చిరస్మరణీయులన్నారు. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచే విధంగా ట్రస్ట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ట్రస్ట్‌కు అన్ని విధాలా ఫౌండేషన్ నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రతాప్ రాజు మిత్రుడు గొరగనమూడి మాజీ సర్పంచి చెల్లబోయిన పాపారావు మాట్లాడుతూ ప్రతాప్ రాజు గ్రామం అభివృద్ధి చెందాలని నిరంతరం తపనతో ఉండేవారని గుర్తు చేశారు. ఆ విధంగా కుటుంబ సభ్యులు నిరంతరం కోరుకోవడం అభినందనీయమన్నారు. తన మిత్రుడు పేరున ట్రస్ట్ ఏర్పాటు చేయడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ట్రస్ట్ సేవలు కొనసాగింపునకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ప్రతాప్‌రాజు సోదరుడు, వైసిపి సీనియర్ నేత పృధ్విరాజు మాట్లాడుతూ తన సోదరుడు ప్రతాప్ రాజు ఆశయ సాధనకు నిరంతరం కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు. ట్రస్ట్ అభివృద్ధి చేసి నిరుపేదలకు నిరంతరం సేవలందించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రతాప్ రాజ్ కుటుంబ సభ్యులు శ్రీరామరాజు, గాదిరాజు రంగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జెఎన్‌వి గోపాలన్, గాదిరాజు సూర్యనారాయణ రాజు, భూపతి రాజు లక్ష్మణ రాజు, ఆశ్రయ, గ్రామస్తులు పాల్గొన్నారు.