Oct 11,2023 00:21

పనులను పరిశీలిస్తున్న జివిఎంసి కమిషనర్‌ సాయికాంత్‌వర్మ

ప్రజాశక్తి-సీతమ్మధార: నగరంలో స్మార్ట్‌ సిటీ పనుల్లో భాగంగా చేపట్టిన పలు కూడళ్ళు, రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని జివిఎంసి కమిషనర్‌ సిఎం.సాయికాంత్‌ వర్మ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పెదవాల్తేరు ప్రభుత్వ ఛాతి ఆసుపత్రి రోడ్డు, ఎఎస్‌ఆర్‌.కాలేజీ గ్రౌండ్‌ జంక్షన్‌, జగదాంబ జంక్షన్‌, అక్కయ్యపాలెం మహారాణి పార్లర్‌ జంక్షన్‌, న్యూకాలనీ జంక్షన్‌ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ, పెదవాల్తేరు పోలమాంబ గుడి ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఛాతి ఆసుపత్రి రోడ్డును పరిశీలించి, 60 అడుగుల రోడ్డు విస్తరణ పనులతో పాటు సెంటర్‌ మీడియన్‌, గ్రీనరీ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్న చెట్లను రోడ్డుకు పక్కగా గ్రీనరీ ప్రాంతంలోకి మార్చాలని ఆదేశించారు. నగరంలో రద్దీ దృష్ట్యా స్మార్ట్‌ సిటీ నిధులతో రోడ్ల విస్తరణ పనులతో పాటు కూడళ్ళ అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షక ఇంజినీర్లు వినరుకుమార్‌, వేణుగోపాల్‌, జోనల్‌ కమిషనర్లు విజయలక్ష్మి, శివప్రసాద్‌, ఆర్‌జివి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.