May 03,2023 00:40

బాపట్ల జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, రైతు నాయకులు

ప్రజాశక్తి - బాపట్ల : గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగింపు పనులకు వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలాని పర్చూరు, పెదనందిపాడు మండలాల రైతు సంఘాల ఐక్యవేదిక నాయకులు ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావుతో కలిసి బాపట్ల జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషాకు మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను, బాపట్ల జిల్లా పర్చూరు సహా 5 మండలాలకు చెందిన 52 గ్రామాలకు సాగునీరు, 80 వేల ఎకరాల సాగునీటి అవసరాల కోసం ఎనిమిదిన్నర దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు పోరాడుతూనే ఉన్నారని చెప్పారు. ఈ ప్రాంతం నిత్యం కరువు, వరదలకు గురవుతూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ ప్రాంతంలో సాగు పూర్తిగా వర్షాధారమని వివరించారు. గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తామని వైఎస్‌.జగన్మోహనరెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సందర్భలో హామీనిచ్చారని, దీనిపై రైతులు ఇప్పటికే పలుమార్లు వినతిపత్రాలూ ఇచ్చారని గుర్తు చేశారు. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అనేకసార్లు అర్జీలు ఇచ్చారని, పోరాటాలూ చేశారని అన్నారు. వీటికి ముఖ్యమంత్రి స్పందించి హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఇప్పటికే గ్రామాలలో గ్రామసభలు నిర్విహించి నోటిఫికేషన్‌ ఇచ్చారని, ఆర్‌డిఒ స్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించారని, బడ్జెట్లో నిధులు కేటాయించకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రైతుల ఆవేదనను గుర్తించి వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పెదనందిపాడు, పర్చూరు మండలాల రైతు సంఘాల ఐక్యవేదిక నాయకులు డి.రమేష్‌బాబు, కుర్ర హరిబాబు పాల్గొన్నారు.