ప్రజాశక్తి-కోటవురట్ల:మండల వ్యాప్తంగా విస్తారంగా జనుము సాగు చేస్తున్నారు. లింగా పురం, వెంకటాపురం, పాములవాక, ఎండపల్లి, రాజుపేట సహా పలు గ్రామాల్లో రైతులు వరి సాగు అనంతరం జనుము పంటపై ఆసక్తి చూపుతున్నారు. జనుము సాగుతో భూసారం వృద్ధి చెందడంతో పాటు చేనుకు చీడపీడల నిమిత్తం ఎటువంటి ఖర్చు లేక పోవడంతో దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని రైతులు తెలిపారు. అంతేకాకుండా జనుమును పశుగ్రాసంగా వినియోగించుకోవచ్చునని, ఆరుతడి పంట కావడంతో పెట్టుబడి ఖర్చులు తక్కువగా ఉంటాయని రైతులు తెలిపారు. ఇటీవల కాలంలో పొలాలలో కోతులు బెడద ఎక్కువగా ఉండటంతో జనుము పంటకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జనుమును ఖరీఫ్ సీజన్ లోనూ అధికంగా సాగు చేసి పచ్చిరొట్ట ఎరువుగా రైతులు అధికంగా వినియోగిస్తారని, దీంతో డిమాండ్ అధికంగా ఉంటుంది.










