Feb 09,2023 23:53

విస్సన్నపేట భూముల వద్ద జనసేన నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి-కశింకోట
కశింకోట మండలం, విస్సన్నపేట సర్వే నెంబర్‌ 195/2లో సుమారు 609 ఎకరాల ప్రభుత్వ భూమి, దళితులకు ఇచ్చిన ఎస్‌ఎన్‌ ల్యాండ్‌, సీలింగ్‌ ల్యాండ్‌ భూముల ఆక్రమణపై సమగ్ర విచారణ జరిపించాలని జనసేన నాయకులు డిమాండ్‌ చేశారు. ఆక్రమణ గురైనట్లు ఆరోపిస్తున్న భూములను గురువారం జనసేన నాయకులు పరిశీలించారు. అమర్నాథ్‌ డౌన్‌ డౌన్‌, భూ బకాసురుడు అమర్నాథ్‌ అంటూ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు టి.శివశంకర్‌, కోన తాతారావు, పరుచూరి భాస్కరరావు, సుందరపు విజయకుమార్‌ మాట్లాడుతూ 609 ఎకరాలు ఆక్రమణకు గురైందని నిరూపిస్తే రాసి ఇస్తానని సవాల్‌ చేస్తున్న మంత్రి, దానిపై చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దూలం గోపి, శ్రీరామదాసు గోవిందా, రామకృష్ణ, తాడి రామకృష్ణ, మల్ల శ్రీను, బర్నికాన రాము, జగదీష్‌, బొలిశెట్టి సందీప్‌, శ్రీదేవి, వేణు తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి సెంటు భూమి ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం
అనకాపల్లి : విస్సన్నపేట భూముల్లో మంత్రి అమర్నాథ్‌కు సెంటు భూమైనా ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తామని ఎపి గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌, అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు, కశింకోట జడ్పిటిసి సభ్యులు దంతులూరి శ్రీధర్‌ రాజు ప్రకటించారు. స్థానిక విజయ రెసిడెన్సీలో గురువారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనసేన నిజ నిర్ధారణ కమిటీ పేరుతో హడావుడిగా విస్సన్నపేట భూములను పరిశీలించిందని, అక్కడ వాస్తవ సాగుదారులే ఉన్నా, భూమి కబ్జా అయినట్లు జనసేన నాయకులు అవాస్తవాలు మాట్లాడుతున్నారని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం తమ నాయకుడు అమర్నాథ్‌ మీద బురద చల్లితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో జెడ్‌పి వైస్‌ చైర్‌పర్సన్‌ భీశెట్టి వరాహ సత్యవతి, వైసీపీ నాయకులు పలక రవి, గొల్లవిల్లి శ్రీనివాసరావు, మలసాల కిషోర్‌, కొణతాల మురళి కృష్ణ పాల్గొన్నారు.