May 09,2023 23:49

ధర్నా చేస్తున్న జనసేన నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి-అనకాపల్లి
కశింకోట మండలం విస్సన్నపేట భూములపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక నెహ్రూ చౌక్‌ జంక్షన్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ విస్సన్నపేట భూములపై క్షేత్ర స్థాయి పరిశీలన చేసి నేటికీ సరిగ్గా 3 నెలలైనా ఇప్పటివరకు అధికారులు ఆ అక్రమ లేఅవుట్‌పై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. వీటిపై నివేదిక అందచేయాలని లోకాయుక్త ఆదేశించి 6 నెలలు గడుస్తున్నా అధికారులు వాయిదాలు కోరుతున్నారు తప్ప నివేదిక ఇవ్వడం లేదన్నారు. జనసేన చేపడుతున్న జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం ద్వారా వైసిపి ప్రభుత్వంలో జరిగిన భారీ భూ కుంభకోణాలు, అక్రమాలపై ఫిర్యాదు చేస్తామని, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే చర్యలు తీసుకోవాలని, సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. విస్సన్నపేట ఉదంతంపై ప్రభుత్వం కనీసం స్పందించలేదని, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై ప్రేమో? లేదా ప్రభుత్వ పెద్దలకు వాటాలు ముట్టడమో? లోగుట్టు ఏమిటో అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీరామదాసు గోవింద, దూలం గోపి, తాడి రామకృష్ణ, మళ్ల శ్రీను, బర్నికాన రాము, అప్పికొండ గణేష్‌, జగదీష్‌, సీత, కనుబుడ్డి నాగేశ్వరరావు, కోన అప్పారావు, కరణం నాయుడు, మార్టూరు ప్రసాద్‌, కరణం రాము, పాల్గొన్నారు.