మాట్లాడుతున్న విశ్రాంత ఉద్యోగులు
గుత్తి : ప్రతినెలా 1వ తేదీనే పింఛన్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఏపీ రాష్ట్ర పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని పెన్షనర్ల భవనంలో విశ్రాంత ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతినెలా 15 రోజులు గడిచినా పూర్తిస్థాయిలో విశ్రాంత ఉద్యోగులకు పింఛన్ అందడం లేదన్నారు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో ఉన్న తమకు సకాలంలో పింఛన్లు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ప్రభుత్వం స్పందించి విశ్రాంత ఉద్యోగులు సకాలంలో పింఛన్లు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర పెన్షనర్ల సంఘం మండల ప్రధాన కార్యదర్శి కె.రామ్మోహన్, అదనపు కార్యదర్శి జేన్నే కుళ్లాయిబాబు, సాయి, కార్యదర్శి లక్ష్మీనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










