Sep 26,2023 23:21

జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌తో మాజీ సైనికులు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : విశ్రాంత సైనికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాం ప్రసాద్‌ అన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం జిల్లా సైనిక్‌ బోర్డ్‌ కమిటీ తొలి సమావేశం జరిగింది. సమావేశానికి జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అధ్యక్షత వహించి మాట్లాడుతూ ముగ్గురు వీర వితంతువులు, వీర మాతలకు త్వరలో 300 గజాలు ఇంటి స్థలాన్ని అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జీవో 83 ఆధారంగా మాజీ సైనికులకు ఇంటి పన్ను మినహాయింపు కచ్చితంగా అమలు చేయాలని, ఈ మేరకు మున్సిపల్‌ కమిషనర్‌కు సూచనలు చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగ భర్తీలో మాజీ సైనికులకు 2 శాతం రిజర్వేషన్‌ పక్కాగా అమలు చేస్తామని, ఉద్యోగ విరమణ పొందిన సైనికులకు 2.5 ఎకరాల మాగాణి సాగు భూమి, 5 ఎకరాల మెట్ట భూమి పంపిణీకి చర్యలు తీసుకోవడంతో పాటు 10 ఏళ్లు దాటిన పట్టాలను 22 ఏ నుండి తొలగించేందుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులు ఆదేశించారు. సైనిక సంక్షేమ కార్యాలయం నిర్మాణానికి 90 సెంట్లు భూమిని గుర్తించాలన్నారు. సమావేశంలో జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి ఆర్‌.బి షీలా, అదనపు ఎస్పీ రాఘవేంద్ర, ఆర్డీవోలు ఎం.శేషిరెడ్డి, రాజకుమారి, కమాండర్‌ సిహెచ్‌ నవీన్‌రెడ్డి, మాజీ సైనికులు, జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.