Apr 20,2023 00:05

విష్ణు కెమికల్స్‌ కంపెనీ,

ప్రజాశక్తి-పరవాడ
పరవాడ ఫార్మా సిటీలోని విష్ణు కెమికల్స్‌లో షట్‌డౌన్‌ అనంతరం శుభ్రం పనులు మంగళవారం సాయంత్రం నిర్వహిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇండస్‌ (26) ఉమా శంకర్‌ (25) ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం... విష్ణు కెమికల్స్‌ లిమిటెడ్‌ కంపెనీని ఈ నెల 15న షట్‌డౌన్‌ చేసి క్లీనింగ్‌ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా శుభ్రం చేసే పనులు చేస్తుండగా, మంగళవారం సాయంత్రం 8 గంటల సమయంలో క్రోమ్‌ - సోడా యాష్‌ గల మిశ్రమం బూడిద ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కార్మికులు ఇండస్‌, ఉమాశంకర్‌ శరీరంపై పడింది. దీంతో వారి శరీరమంతా కాలి బొబ్బర్లు వచ్చాయి. వెంటనే వారిద్దరినీ విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వీరిలో ఇండస్‌ అనే కార్మికుడు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ సంఘటనపై విచారణ చేసి కేసు నమోదు చేస్తున్నట్లు పరవాడ సిఐ ఈశ్వరరావు తెలిపారు.
సమగ్ర విచారణ చేపట్టాలి : సిఐటియు
ఈ ఘటన తెలిసిన వెంటనే ఫార్మాసిటీ స్టాప్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ కంపెనీని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంగళవారం జరిగిన ప్రమాదాన్ని కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచడం విచారకరమన్నారు. ఈ ఘటనపై పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, ఫ్యాక్టీరీస్‌ ఆఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ అధికారులు, ఫైర్‌ సర్వీస్‌ అధికారులు సమగ్ర విచారణ చేసి కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల రక్షణ, భద్రతా ప్రమాణాలు వంటి అంశాలపై విచారణ చేసి గాయపడ్డ కార్మికులకు మెరుగైన వైద్యం అందించి వారిని ఆదుకోవాలని కోరారు. వైద్య కాలం మొత్తం వేతనం చెల్లించాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కర్రి వెంకునాయుడు పాల్గొన్నారు.