Jan 31,2021 07:16

     ఇప్పుడు మోడీ ప్రభుత్వం కార్పొరేటు శక్తులను పెంచడమే దేశాన్ని అభివృద్ధి చేయడంగా నిర్ణయించుకుని సరళీకరణ సంస్కరణలను వేగవంతం చేసింది. ఈ విధానాలు మొత్తం రైతాంగానికి, చిన్న, మధ్య తరహా, ప్రాంతీయ పెట్టుబడిదారులకు నష్టదాయకంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం మాదిరిగా కాక, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ చర్యలను అమలు చేసే విషయంలో ప్రజలకు నేరుగా అనునిత్యం జవాబుదారీగా వుండవలసి వస్తున్నది. ఈ కారణం వలన కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్న పార్టీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. తమ ప్రజా పునాదిని కాపాడుకోడానికి బిజెపి ని ఎదుర్కోవడం నానాటికీ ప్రాంతీయ పార్టీలకు అనివార్యం అవుతున్నది. అందుకే ప్రాంతీయ బూర్జువా పార్టీలకు, బిజెపి కి మధ్య వైరుధ్యం పెరిగింది.
    మోడీ నాయకత్వాన బిజెపి రెండవ సారి కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో అధికారాన్ని చేపట్టిన తర్వాత దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలను సమూలంగా మార్చాలన్న ప్రయత్నం చాలా దుడుకుగా ప్రారంభమయింది. మిగిలి వున్న ప్రభుత్వ రంగాన్ని వదిలించుకోవాలన్న తహతహతో పని ప్రారంభించింది. పారిశ్రామిక, వ్యవసాయ, విద్యా, రంగాలను కార్పొరేటు సంస్థలకు పణంగా పెట్టడానికి కొత్త చట్టాలను, విధానాలను రూపొందించింది. పౌరసత్వ చట్టాలను సవరించి మతవాద (హిందూత్వ) రాజకీయ ప్రక్రియకు తెర తీసింది. సమాఖ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ రాష్ట్రాల ఆర్థిక బలాన్ని, హక్కులను హరించివేస్తున్నది. పౌరహక్కులు, మానవ హక్కులను కాలరాస్తూ న్యాయ, ఇతర స్వతంత్ర వ్యవస్థల ప్రతిపత్తిని బలహీనపరుస్తూ, గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని తొలిచివేస్తూ నిరంకుశత్వాన్ని పెంచుతున్నది. సంఘపరివారం నినాదాలైన ఒకే మతం, ఒకే జాతి, ఒకే సంస్కృతి అమలుతో పాటు స్వదేశీ, విదేశీ కార్పొరేటు శక్తులు కోరుకుంటున్న ఒకే మార్కెట్టు, ఒకే పన్ను, ఒకే ఎన్నిక వగైరా అంశాల అమలుకు పూనుకున్నది. బడా బూర్జువా వర్గం కార్పొరేట్‌ శక్తుల (ఇప్పుడు అంబానీ, అదానీల పేర్లతో ఈ వర్గం ప్రాబల్యం పొందింది)కు దేశాన్ని వడ్డించిన విస్తరిగా తీర్చిదిద్దడం మోడీ, బి.జె.పి పాలన లక్ష్యంగా సాగుతున్నది. ఈ సంవత్సర ఆరంభంలో ప్రపంచాన్ని, దేశాన్ని కరోనా విపత్తు ఆవరించింది. దాని ప్రభావంతో అప్పటికే మాంద్యాన్ని ఎదుర్కొంటున్న మన దేశ ఆర్థిక వ్యవస్థ మరింత మాంద్యంలోకి జారిపోయింది. దేశం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి ఒక బాధాకర పరిణామమని భావించకుండా మోడీ ప్రభుత్వం ప్రజలు కరోనా భయాందోళనలో సతమతమవుతున్న సందర్భాన్ని కార్పొరేటు శక్తులకవసరమైన బహుముఖ సంస్కరణలను వేగంగా అమలుచేయడానికి ఒక సదవకాశంగా భావించింది. కరోనా వైరస్‌ ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు కల్గించిన పరిమితులను వినియోగించుకుని ప్రజాస్వామిక పద్ధతులను పక్కన పెట్టి సంస్కరణలను, చట్టాలను ఆగమేఘాల మీద అమలు యడానికి పూనుకున్నది.
    అయితే మోడీ ప్రభుత్వం భావించినట్లు అది తలపెట్టిన వినాశకర సంస్కరణలు ప్రజల నుండి ప్రతిఘటన లేకుండా సాగిపోవడం లేదు. 1. పౌరసత్వ సవరణ చట్టానికి, 2. కార్మిక కోడ్‌లకు, 3. నూతన వ్యవసాయ చట్టాలకు, 4. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు, 5. నూతన విద్యా విధానానికి విస్తృతంగా ప్రతిఘటన ప్రారంభమయింది. 6. తాజాగా మోడీ విధానాలకు పెద్ద సవాలుగా దేశవ్యాప్తంగా ప్రారంభమయిన రైతాంగ ఉద్యమం...ఈ ప్రతిఘటనకు సూచికలు. వీటికి తోడు ప్రాదేశికత పునాదిగా వున్న సమాఖ్య వ్యవస్థపై, రాష్ట్రాల హక్కులపై మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష, పరోక్ష దాడికి కూడా ప్రతిఘటన వివిధ రూపాలలో ఎదురవుతున్నది. నేటి రాజకీయ పరిస్థితులపై ఈ ప్రతిఘటన ప్రభావం ఎలా వుంటుందో అన్న అంశాన్ని క్లుప్తంగా వివరిస్తాను.
1. హిందూత్వ రాష్ట్ర స్థాపన ఆశ, దేశీయ కార్పొరేటు పెట్టుబడి కేంద్రీకత, ఏకఖండ రాజ్యంగా దేశాన్ని రూపుదిద్దాలన్న కోర్కె - రెండూ ఇప్పుడు మోడీ ప్రభుత్వ రూపంలో ఫెడరల్‌ వ్యవస్థపై, రాష్ట్రాల హక్కులపై దాడి జరుగుతున్నది.
2. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల పరిధిలో వున్న అంశాలపై రాష్ట్రాల అంగీకారం లేకుండానే కేంద్రం ఏకపక్షంగా చట్టాలను రూపొందిస్తున్నది.
3. కార్మిక కోడ్‌లు, కొత్త వ్యవసాయ చట్టాలు, నూతన విద్యా విధానం వంటి అంశాలు రాష్ట్ర పరిధిలోనివైనా, కేంద్రం చట్టాలను చేసింది.
4. జిఎస్‌టి ని ప్రవేశపెట్టి రాష్ట్రాల ఆదాయ మార్గాలపై దెబ్బకొట్టింది.
5. అనేక పథకాలలో కేంద్రం వాటాను తగ్గించుకుని రాష్ట్రాలపై భారం పెంచుతున్నది. కరోనా వలన కుదేలయిన 'ఆర్థిక పరిస్థితి నుండి బయట పడడానికి రాష్ట్రాలకు తగినంత సహాయం అందించకుండా వేధిస్తున్నది.
6. అప్పు చేసుకోవడానికి కూడా అనుమతినివ్వకుండా అనేక ప్రజా వ్యతిరేక షరతులను విధిస్తున్నది.
   మన ఫెడరల్‌ వ్యవస్థలో రాష్ట్రాలకున్న పరిమితమైన స్వయం ప్రతిపత్తిని కూడా ధ్వంసం చేస్తున్నది. 370 అధికరణాన్ని రద్దు చేసి జమ్ము-కాశ్మీర్‌ను ముక్కలు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.
తాజాగా కేరళ గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వం పనికి ఎలా అడ్డం పడ్డారో చూడవచ్చు. బెంగాల్‌ లోని ముగ్గురు ఐపిఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం లేకుండా కేంద్ర సర్వీసుకు మార్చాలని కేంద్రం దురుసుగా వ్యవహరించింది. గతంలో అధ్యక్ష తరహా పరిపాలన ప్రతిపాదనను ముందుకు తెచ్చిన బిజెపి ఇప్పుడు జమిలి ఎన్నికలు (పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపడం) గురించి చర్చకు తెర లేపింది. ఎంతో వైవిధ్యం కల్గిన వివిధ రాష్ట్రాల పరిస్థితిని అణచివేసి దేశం మొత్తాన్ని ఒకే కేంద్రీకృత నిరంకుశ పాలన క్రిందకు తీసుకురావాలన్న కుట్ర ఈ ప్రతిపాదన వెనక దాగివున్నది.
   మన సమాజం అనేక రాష్ట్రాలు, ప్రాంతాలు, భాషలు, మతాలు, కులాలు, తెగలు వగైరా కలిగి వైవిధ్య భరితంగా వుంటుంది. ఆయా తరగతుల, ప్రాంతాల ప్రత్యేక ప్రయోజనాలు, ఆకాంక్షలు వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు, శక్తుల ద్వారా ప్రస్తుతం వ్యక్తం అవుతున్నాయి. ఈ వైవిధ్యం ప్రజాస్వామిక వ్యవస్థల్లో వ్యక్తం గాకుండా నిరోధించేందుకే మోడీ ప్రభుత్వం ఫెడరలిజం మీద జేస్తున్న దాడి తోడ్పడుతుంది. ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.
   సిఎఎ మైనారిటీలను అభద్రతా భావానికి గురిజేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు ధనిక రైతులతో సహా రైతాంగానికంతటికి నష్టం చేస్తాయి. మోడీ విధానాలు వేళ్ళ మీద లెక్క పెట్టగలిగిన కార్పొరేటు సంస్థలు మరింత పెద్దవి కావడానికి మాత్రమే ఉద్దేశించబడ్డాయి. ఇవి చిన్న మధ్యతరహా పరిశ్రమలు, వ్యాపారాలు దెబ్బ తినడానికి దారి తీస్తాయి. ప్రభుత్వం అమలుజేస్తున్న విద్యుత్తు చట్టం రైతాంగానికి, చిన్న పరిశ్రమలకు గొడ్డలి పెట్టు కానున్నది.
    ప్రాంతీయ పెట్టుబడిదారుల, ధనిక రైతుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతీయ పార్టీలు సహజంగానే మోడీ ఫెడరలిజం మీద సాగిస్తున్న దాడితో ఆందోళనకు గురవుతున్నాయి. ఆ పార్టీలలో అసంతృప్తి పెరుగుతున్నది. అవకాశం వచ్చినపుడు ఆ అసంతప్తిని వ్యక్తం జేస్తున్నాయి. ఎన్‌డిఎ కి భాగస్వాములుగా వున్న అకాలీదళ్‌, శివసేన, ఎల్‌జెపి పార్టీలు ఈ మధ్య కాలంలో బిజెపి కి దూరమయ్యాయి.
టిఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌సిపి లు డిసెంబర్‌ 8 భారత్‌ బంద్‌కు మద్దతు ఇవ్వడం వెనక పరోక్షంగా కేంద్రం పెత్తనంపై అసంతృప్తి వున్నది. టిఎమ్‌సి, ఎస్‌.పి, బిఎస్‌పి, బిజెడి, ఎన్‌సిపి వంటి పార్టీలు మోడీ ప్రభుత్వం ఫెడరలిజంపై చేస్తున్న దాడిని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ప్రాంతీయ పార్టీల వ్యతిరేకత ఒకే ప్రవాహంగా మారి బిజెపి నియంతృత్వ పోకడలను నేరుగా ప్రతిఘటించే స్థాయికి ఇంకా రాలేకపోవడం ఒక బలహీనత. బడా బూర్జువా వర్గ పార్టీ అయిన కాంగ్రెస్‌ కూడా ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలను నిర్వహిస్తూ రాష్ట్రాల హక్కుల గురించి, ఫెడరలిజం గురించి మాట్లాడాల్సి వస్తున్నది.
    ప్రాంతీయ పార్టీలు ఫెడరల్‌ వ్యవస్థ పరిరక్షణ కోసం నిలబడడంలో పరిస్థితులను బట్టి ఊగిసలాట వైఖరులు తీసుకోవడం మన దృష్టిలో ఉండాలి.
1960వ దశకంలో అకాలీదళ్‌, డియంకె మాత్రమే ప్రాంతీయ పార్టీలు. 1980, 90 దశకంలో వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు పెద్ద సంఖ్యలో ఆవిర్భవించాయి. పారిశ్రామిక వ్యవసాయ విధానాలు (హరిత విప్లవం, ప్రభుత్వ రంగం, ఉన్నత విద్య, రిజర్వేషన్లు వగైరా) గ్రామసీమలలో ఒక బలమైన ధనిక రైతు తరగతిని, వివిధ సామాజిక తరగతుల్లో నుండి మధ్యతరగతిని అభివృద్ధి చేశాయి. ఈ శక్తులు రాజకీయాలలో వాటా సాధించడం ద్వారా స్థానిక వనరులు, అవకాశాలపై తమపట్టు పెంచుకోవడానికి పూనుకున్నాయి. ఆనాడు అధికారంలో వున్న కాంగ్రెస్‌ ఆధిపత్య ధోరణి, ఏకపార్టీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఈ శక్తులు ప్రాంతీయ పార్టీల రూపంలో రాజకీయాల్లో ప్రవేశించాయి.ఈ పార్టీలు ఆనాటి కాంగ్రెస్‌ నిరంకుశ, ఫెడరల్‌ వ్యతిరేక పోకడలను గట్టిగా ఎదిరిస్తూ నిలిచాయి. 1980 దశకంలో జరిగిన ప్రతిపక్ష పార్టీల కాంక్లేవ్‌ సమావేశాలు దీనికి తార్కాణాలు.
    1991లో సరళీకరణ విధానాలు ప్రారంభం అయిన తర్వాత ప్రపంచ బ్యాంకు నేరుగా రాష్ట్రాలలో సంస్కరణల అమలు కోసం రుణ ఒప్పందాలు కుదుర్చుకోవడం మొదలు పెట్టిన తర్వాత ప్రాంతీయ బూర్జువా వర్గ వైఖరిలో మార్పు వచ్చింది. కొత్తగా వచ్చిన అవకాశాలను ఉపయోగించు కోవడానికి కేంద్రంతో సానుకూలంగా వ్యవహరించడం అవసరం అని భావించాయి. ఈ మార్పుకు అనుగుణంగా ప్రాంతీయ పార్టీల వ్యవహారశైలి లోనూ మార్పు వచ్చింది. అలాగే 1980 దశకం నుండి కేంద్ర స్థాయిలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాలలో ప్రాంతీయ పార్టీలు ముఖ్య పాత్ర నిర్వహించే అవకాశం వచ్చింది. విధాన పరమైన ప్రాతిపదిక కాకుండా పార్టీ యొక్క అధికార ప్రయోజనాన్ని బట్టి కేంద్రంలో బిజెపి తో సహా ఎవరితోనైనా జత కట్టడానికి ప్రాంతీయ పార్టీలు వెనుకాడటం లేదు.
    అయితే ఇప్పుడు మోడీ నాయకత్వాన బిజెపి రెండవసారి అధికారంలోకి రావడంతో పరిస్థితి మారింది. బిజెపి కి సంపూర్ణ మెజారిటీ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మనడానికి ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం లేదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం కార్పొరేటు శక్తులను పెంచడమే దేశాన్ని అభివృద్ధి చేయడంగా నిర్ణయించుకుని సరళీకరణ సంస్కరణలను వేగవంతం చేసింది. ఈ విధానాలు మొత్తం రైతాంగానికి, చిన్న, మధ్య తరహా, ప్రాంతీయ పెట్టుబడిదారులకు నష్టదాయకంగా మారాయి. కేంద్రప్రభుత్వం మాదిరిగా కాక, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ చర్యలను అమలు చేసే విషయంలో ప్రజలకు నేరుగా అనునిత్యం జవాబుదారీగా వుండవలసి వస్తున్నది. ఈ కారణం వలన కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్న పార్టీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. తమ ప్రజాపునాదిని కాపాడుకోడానికి బిజెపి ని ఎదుర్కోవడం నానాటికీ ప్రాంతీయ పార్టీలకు అనివార్యం అవుతున్నది. అందుకే ప్రాంతీయ బూర్జువా పార్టీలకు, బిజెపి కి మధ్య వైరుధ్యం పెరిగింది.
    ఈ పరిస్థితి మతోన్మాద బిజెపి కి వ్యతిరేకంగా పోరాడడానికి ఒక కొత్త అవకాశాన్ని కల్పిస్తున్నది. సమాఖ్య వ్యవస్థ, రాష్ట్రాల హక్కుల కోసం పోరాటాన్ని ముందుకు తీసుకురావడం ద్వారా ప్రాంతీయ పార్టీల అవకాశవాదాన్ని అధిగమించి, బిజెపి మతోన్మాద వ్యతిరేక శక్తుల విశాల ఐక్యతను నిర్మించే అవకాశం బలపడుతుంది.
     అయితే బిజెపి ని ఎదుర్కోవాలంటే ప్రాంతీయ పార్టీలు ప్రస్తుత నయా ఉదారవాద విధానాల నుంచి పక్కకు మళ్ళి ప్రత్యామ్నాయ విధానాలను రూపొందించుకోవాలి. రాష్ట్రాల హక్కులు, పన్నుల ఆదాయాల్లో వాటాలు, తదితర విషయాలకు సంబంధించి ప్రత్యామ్నాయ విధానాలను, నినాదాలను అవి ముందుకు తేవలసి వుంటుంది. కాని వాటి వర్గ స్వభావరీత్యా ఈ పనిని ప్రాంతీయ పార్టీలు ఏ మేరకు చేపట్టగలుగుతాయన్నది ప్రశ్నార్థకమే. ఈ విషయంలో ఆ పార్టీలలో అంతర్మధనం, ఘర్షణ జరగాల్సి వుంటుంది. ఆ ఘర్షణను ప్రజానుకూల దిశగా మళ్లించడంలో మన పాత్ర ప్రభావం ఉండాలి.
    ఈ పరిస్థితుల్లో మన పార్టీ, ప్రజాసంఘాలు కలిసి వచ్చే ఇతర వామపక్ష పార్టీలను కలుపుకుని ప్రజా సమస్యలపై రాష్ట్రాల హక్కులపై క్యాంపెయిన్‌లను శక్తివంతంగా చేపట్టాలి. ఆ ప్రచారాన్ని ప్రాంతీయ పార్టీల శ్రేణుల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలి. ఆ ప్రచారం ప్రధానంగా బిజెపి మీద ఎక్కుపెట్టాలి.
     ఈ క్రమంలో ప్రత్యామ్నాయ విధానాలను కూడా (రైతు ఉద్యమం ముందుకు తెచ్చిన తీరుగా) మనం గట్టిగా చర్చలోకి తీసుకురావాలి. ఇటువంటి జోక్యం ద్వారా మాత్రమే మనం ప్రాంతీయ పార్టీల అవకాశవాదాన్ని అధిగమించేలా ఎంతో కొంత ప్రభావితం చేయగలం.

(వ్యాసకర్త సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు)
బి.వి. రాఘవులు

బి.వి. రాఘవులు