Oct 13,2022 23:58

మహాసభలో మాట్లాడుతున్న సిఐటియు అఖిలభారత ఉపాధ్యక్షులు బేబీరాణి

ప్రజాశక్తి- చింతూరు
పెట్టుబడిదారీ విధానాలపైనా, కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపైనా విశాల ఐక్య ఉద్యమాలను నిర్మించాలని సిఐటియు అఖిలభారత ఉపాధ్యక్షురాలు బేబీరాణి పిలుపునిచ్చారు. చింతూరు మండల కేంద్రంలోని సినిమా హాల్‌ ఆవరణలో గురువారం సిఐటియు రంపచోడవరం జిల్లా ప్రథమ మహాసభ జరిగింది. సిఐటియు జెండాను సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు పూనెం సత్యనారాయణ ఆవిష్కరించారు. అనంతరం ప్రారంభమైన మహాసభకు పూనెం సత్యనారాయణ, కొమరం పెంటయ్య, మట్ల వాణిశ్రీ, పి.నిర్మల అధ్యక్షత వర్గంగా వ్యవహరించారు. మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బేబీరాణి మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను సవరించి, కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా 4 లేబర్‌ కోడ్స్‌ను తీసుకొచ్చి కార్మికులను యజమానులకు కట్టుబానిసలను చేసిందని తెలిపారు. కరోనా కాలంలో ప్రజలను గాలికొదిలేసిన కేంద్రం అంబానీ, అదానీ ఆస్తులు కోట్ల రూపాయలు పెరిగే విధంగా సహకరించిందని విమర్శించారు. రూ.24 లక్షల కోట్లు విజయ మాల్యా బ్యాంకుల నుండి రుణం తీసుకొని విదేశాలకు పారిపోతే, ఆ రుణాన్ని కేంద్రం మాఫీ చేసిందన్నారు. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను ముక్కు పిండి వసూలు చేస్తున్న ప్రభుత్వం, కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వారికి రుణమాఫీ చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై రోజురోజుకు పన్నుల భారాలు పెంచుతున్నాయని తెలిపారు. స్వచ్ఛభారత్‌ పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం దోపిడీ జరిగిందని, చెత్త కుండీలపై కళ్ళజోడు బొమ్మలు గీసి గారడీ చేశారని పేర్కొన్నారు. ఒక వైపు ధరలు పెరుగుతుంటే కార్మికుల వేతనాలు పెంచడం లేదని, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
సిఐటియు ఉమ్మడి జిల్లాల కార్యదర్శి ఎస్‌ఎస్‌.మూర్తి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పరిహారం ఇవ్వకుండా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ నిర్వాసితులను నిండా ముంచాయని విమర్శించారు. పోలవరం పరిహారం విషయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు మాయమాటలు నమ్మవద్దని, పోరాటాల ద్వారానే సాధించుకోవచ్చని తెలిపారు. బిజెపి పాలనలో దళిత, గిరిజనులు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. కాకినాడలో రిలయన్స్‌ సంస్థ అధినేత అంబానీ సముద్రంలో ఉన్న రూ.15వేల కోట్ల విలువైన గ్యాస్‌ను పరిధి దాటి వెలికితీసిందని, ఆ విషయంపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపలేదన్నారు.
ఈ మహాసభలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోత రామారావు, నాయకులు బొప్పెన కిరణ్‌, కుంజా సీతారామయ్య, సీసన్‌ సురేష్‌, మల్లం సుబ్బమ్మ, కారం నాగేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీటీసీ వేక రాజ్‌కుమార్‌, సిఐటియు 11 మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మట్ల వాణిశ్రీ, పల్లపు వెంకట్‌
చింతూరు : ఈ మహాసభలో సిఐటియు రంపచోడవరం జిల్లా నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మట్ల వాణిశ్రీ, పల్లపు వెంకట్‌, ఆఫీసు బేరర్స్‌గా డేగల మాధవరావు, పొడియం లక్ష్మణ్‌, పూనెం సత్యనారాయణ, కొమరం పెంటయ్య, బత్తిన నిర్మల, కళ్యాణ్‌, కోట రమణ, పిటి.దాసు, హరినాథ్‌ ఎన్నికయ్యారు. జిల్లా కమిటీ సభ్యులుగా కొమరం చెల్లయ్యమ్మ, కట్టమూరి వీరబాబు, రాణి, రాజేశ్వరి, టి శ్రీను, పొడియం సావిత్రి, బీరబోయిన ధారేశ్వరి, గొల్లల సురేష్‌, కారం రాములమ్మ ఎన్నికవడం జరిగింది.