Oct 18,2022 23:51

మృతిచెందిన దామోదర్‌, సంతోషికుమారి

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రేమికుల జంట విశాఖలో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం కలకలం రేపింది. మెడలో తాళి కట్టిన మరుక్షణమే వారిద్దరూ బలవణ్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం... సిక్కోలు జిల్లా లావేరు, దూసి ప్రాంతాలకు చెందిన దామోదర్‌ (23), సంతోషి కుమారి సోమవారం విశాఖ చేరుకున్నారు. వీరద్దరూ రజక సామాజిక వర్గానికి చెందిన వారు. ఒక వివాహ కార్యక్రమంలో పరిచయమై స్నేహితులుగా మారి, తర్వాత ప్రేమికులయ్యారని సమీప బంధువులు చెబుతున్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో గానీ సోమవారం సాయంత్రం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి గొల్లలపాలెం రామాలయం సమీపంలోని అయ్యన్‌ రెసిడెన్సీలో దిగారు. కలిసి ఫోటోలు తీసుకున్నారు. సంతోషి కుమారి మెడలో దామోదర్‌ అప్పుడే కట్టినట్టుగా తాళి కనిపిస్తోంది. మంగళవారం సాయంత్రం వారు బసకు దిగిన గది నుంచి కొద్దిగా దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన హోటల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులొచ్చి తలుపులు తెరిచి చూసేసరికి ఇద్దరూ మృతిచెంది కనిపించారు. తాడుతో ఉరేసుకున్నట్టు తేల్చారు. స్థానికంగా ఉంటున్న వారి బంధువులు విషయం తెలుసుకుని హోటల్‌కు చేరుకున్నారు. ఇటీవలే వారిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారని, అంతకు మించి తమకేమీ తెలియదని చెబుతున్నారు. కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారమందజేశారు. వారిద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్‌కు తరలించారు. టూటౌన్‌ ఇన్‌ఛార్జి సిఐ సోమశేఖర్‌ ఆధ్వర్యాన ఎస్‌ఐలు చంద్రశేఖర్‌, విజరుకుమార్‌ కేసు దర్యాప్తు చేపట్టారు.