May 10,2023 23:31

మాట్లాడుతున్న నాగచైతన్య

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై పవన్‌ కుమార్‌ సమర్పణలో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన కస్టడీ చిత్రం ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ఉదయం విశాఖలోని నోవాటెల్‌ హోటల్‌లో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో నాగ చైతన్య చిత్ర విశేషాలను మీడియాకు వివరించారు. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తనయుడు యువన్‌ శంకర్‌ రాజాతో కలిసి సంగీతం అందించడం విశేషం అన్నారు. వైజాగ్‌లో తీసిన తన ప్రతి సినిమా హిట్‌ అవుతుందని నమ్మకంగా చెప్పారు. అరవింద్‌ స్వామి, శరత్‌ కుమార్‌, ప్రియ మణి వంటి సీనియర్‌ నటులు ఇందులో నటించారని తెలిపారు. సినిమాలో ప్రతి పది నిమిషాలకు ట్విస్ట్‌లు ఉంటాయన్నారు. నిర్మాతలు శ్రీనివాస్‌, పవన్‌ కుమార్‌ ఎంతో సపోర్ట్‌ చేసి సినిమా తీశారని ధన్య వాదాలు తెలిపారు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, కస్టడీ సినిమాను శివ సినిమాతో పోల్చవద్దు అని కోరారు. దర్శకుడు వెంకట్‌ ప్రభు చెప్పిన కథ మొదటి సిటింగ్‌లోనే బాగా నచ్చిందన్నారు. హీరోగా అన్ని జోనర్‌ సినిమాలు చేస్తానన్నారు. ఈ సినిమా తమిళ ప్రేక్షకులను కూడా అలరిస్తుందని తెలిపారు. మంచి కథ కుదిరితే అఖిల్‌తో సినిమా చేయాలని ఉందన్నారు.