Aug 21,2022 22:38

శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌ మల్లికార్జున తదితరులు

ప్రజాశక్తి-విశాఖపట్నం : విశాఖ వ్యాలీ పాఠశాలలో కొత్త హంగులతో సరికొత్త ఆధునిక భవనాన్ని ప్రారంభించ బోతున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు. నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా పేరున్న విశాఖ వ్యాలీ పాఠశాలలో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఆదివారం ఉదయం నూతన భవన నిర్మాణానికి జిల్లా కలెక్టర్‌, విశాఖ వ్యాలీ పాఠశాల చైర్మన్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, జివిఎంసి కమిషనర్‌ లక్ష్మీశ, జాయింట్‌ కలెక్టర్‌ కెఎస్‌.విశ్వనాథన్‌తో కలిసి భూమి పూజచేశారు. అనంతరం నూతన భవన శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, విశాఖ వ్యాలీ పాఠశాల నేడు సమాజం లోని ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ పాలు పంచుకుంటుందన్నారు. గత కొద్ది కాలంలోనే గణనీయ మైన అభివృద్ధి సాధించడం గమనించదగిన విషయం అని వివరించారు. విశాఖవ్యాలీ స్కూల్‌ పర్యావరణ పరిరక్షణలో చేస్తున్న కృషిని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు. పాఠశాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్న యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఈశ్వరీ ప్రభాకర్‌, గవర్నింగ్‌ బాడీ మెంబర్‌ డిఎస్‌. వర్మ తదితరులు పాల్గొన్నారు.