Nov 01,2023 23:20

ప్రజాశక్తి - రేపల్లె
విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకై నవంబర్‌ 8న ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన విద్యాసంస్థల రాష్ట్ర బంద్‌కు ఎల్‌కెజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ, ప్రవేటు విద్యాసంస్థలు సహకరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి మనోజ్ కుమార్ కోరారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో కేజీ టు పీజీ విద్యాసంస్థల బందుకు పిలుపునిచ్చాయని అన్నారు. ఈ బంద్‌ను రెపల్లె మండలంలో జయప్రదం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. బిజెపి కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన దగ్గర నుండి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు దోచిపెట్టడమే పనిగా చేస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమలను స్థాపించి ఉద్యోగాలు ఇవ్వలేని కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అమ్మడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు. దీనికి నిరసనగా విశాఖ ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు విద్యార్థి, యువజన, కార్మిక సంఘాలు, ప్రజలు ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఈ ఆందోళనలు నవంబర్ 8నాటికి వెయ్యి రోజులవుతుందని అన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో తన వైఖరి మార్చుకోకపోగా ప్రైవేటీకరణ తమ విధానం అంటూ బిజెపి నేతలు ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు.విశాఖ ఉక్కు కోసం ఆనాడు ఎంతో మంది విద్యార్థులు తమ ప్రాణాలను త్యాగం చేసి స్టీల్ ప్లాంట్ స్థాపనకు కృషి చేశారని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కేంద్రానికి మెడలు వంచి పని చేస్తుందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కట్టుబడి ఉన్నామని చెబుతూ  స్టీల్ ప్లాంట్ సాధనకై పోరాటాలు చేసే వారిపై నిర్బంధాలు విధించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వతం ద్వంద వైఖరి తగదని అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చే పని చేయాలని కోరారు. విద్యాసంస్థల బందు, విశాఖ ఉక్కు పరిరక్షణ ఉధ్యమంలో ప్రజలు కలిసిరావాలని కోరారు.