Oct 01,2023 00:34

దీక్షలో కూర్చున్న సింటర్‌ప్లాంట్‌ కార్మికులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ ఉక్కును రక్షించుకుందామని పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో చేపట్టిన దీక్షలు శనివారం నాటికి 961వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో సింటర్‌ ప్లాంట్‌ కార్మికులు కూర్చున్నారు. ఈ దీక్షలనుద్దేశించి పోరాట కమిటీ సభ్యులు వరసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఉక్కు భూములుపై కన్నేసిన వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా, విశాఖ ఉక్కును పరిరక్షించకుండా ప్లాంట్‌ ఆస్తులను కాజేయాలని ప్రయత్నించే వారు ఎంతటి వారైనా ఎదిరిస్తామన్నారు. విశాఖ ఉక్కును మట్టుపెట్టాలని ప్రయత్నించిన గత ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పామని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలను గాలికి వదిలేసి ప్రజల సమస్యలను ప్రజా ఉద్యమాలను అపహస్యం చేస్తూ కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. సంస్థ మనుగడ కోసం సర్వం కోల్పోయి, నేటికీ ఉపాధి కోసం వేలాది మంది ఎదురు చూస్తుంటే విలువైన భూములను కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూడడం మూర్ఖత్వానికి నిదర్శనం అన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాటంలో రాజకీయ నాయకుల నిజస్వరూపాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ చైతన్యం కల్పిస్తున్నామని, పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మలిచి, మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.