
ప్రజాశక్తి-చీమకుర్తి: విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయరాదని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త విద్యా సంస్థల బంద్ చీమకుర్తిలో విజయవంతమైంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం పట్టణంలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు మేరకు స్వచ్ఛందంగా మూసివేశారు. స్థానిక ఎంఎస్‌ఆర్ జూనియర్ కళాశాల ఎదుట జరిగిన బంద్ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు జి దేవరాజ్ అధ్యక్షత వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ నాయకులు పల్లాపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం ప్రభుత్వ పరిశ్రమలన్నింటినీ ప్రైవేటు వ్యవస్థలకు అమ్మేస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి వెన్నుముకలాంటి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు సంస్థకు అప్పచెబుతోందన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వెయ్యి రోజులుగా కార్మికులు ధర్నా చేస్తున్నా ప్రభుత్వం స్పందిచలేదని అన్నారు. లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయడం దారుణమని అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ అధ్యక్షులు క్రిష్టిపాటి చిన్నపురెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చేతులు కలిపి విశాఖ ఉక్కును అమ్మేయాలని చూస్తున్నాయని, ఈ ప్రభుత్వాల దుర్మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ సభ్యులు మహేష్, నాగుల్, బ్రహ్మయ్య, రామాంజనేయులు, విజరురాజు, దుర్గాప్రసాదు పాల్గొన్నారు.
కొండపి: విశాఖ ఉక్కును ప్రయివేట్ పరం చేయడం అమానుషమని పేర్కొంటూ కార్మిక సంఘాల ఆద్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు వెయ్యి రోజులకు చేరుకున్న నేపథ్యంలో దీక్షలకు మద్దతుగా బుధవారం విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ సందర్భంగా కొండపి పివైఎల్, పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీలు బంద్ నిర్వహించి అనంతరం కామేపల్లి రోడ్డులో గాందీబొమ్మ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మందికి ఉపాధినిచ్చే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటుపరం చేయడం దుర్మార్గమని అన్నారు. ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో మరో ఉక్కు ఉద్యమం చూస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ అధ్యక్షులు కేజీ మస్తాన్, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కార్యదర్శి ఎన్ నాగరాజు, పిడిఎస్‌యు మండల అద్యక్షులు మహేష్, నాయకులు మురళి, గణేష్, ఏఐఎస్‌ఎఫ్ మాజి జిల్లా నాయకులు జి లక్ష్మి, వై చంద్రశేఖర్, వై కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
కనిగిరి: విశాఖ ఉక్కు పరిరక్షణలో భాగంగా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, ప్రకాశం జిల్లా యూనివర్సిటీ, త్రిబుల్ ఐటీలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, డివైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన విద్యాసంస్థల బంద్ సంపూర్ణంగా జరిగింది. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పవన్ కళ్యాణ్, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి మధు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని, రాష్ట్రంలో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేసి మరోసారి ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తోందని అన్నారు. డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి నరేంద్ర మాట్లాడుతూ ప్రకాశం జిల్లాను విద్య హబ్‌గా గుర్తించి యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, శాశ్వత భవనాలు నిర్మించాలని కోరారు. విశాఖ ఉక్కు ఉద్యమం ప్రారంభించి 1000 రోజులైన సందర్భంగా ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కృష్ణ చైతన్య, విజేత, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, మోడల్ స్కూల్, ఏఎల్‌ఎన్‌ఎం డిగ్రీ కాలేజీ, కేటీఆర్, చింతలపాలెం హైస్కూల్, గర్ల్స్ హైస్కూల్‌ను బంద్ చేయించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఇఫ్రాస్, సురేష్, ఏఐవైఎఫ్ పుట్టా సుబ్బారావు, మీరావలి సిపిఐ జిపి రామారావు, ఏఐటియుసి గుజ్జుల బాలిరెడ్డి, రవి, నితీష్, పవన్ కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ కనిగిరి మండల కార్యదర్శి మధు, భరత్, సాయి తేజ, కార్తీక్, చిన్నబాబు, డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి నరేంద్ర, రవి, అనిల్, నోహ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.