ప్రజాశక్తి-గజపతినగరం, శృంగవరపుకోట, రామభద్రపురం : రాష్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తూ.. వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న కల్పతరువులాంటి విశాఖ ఉక్కు పరిశ్రమను ఐక్యంగా కాపాడుకోవాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. ఉక్కు రక్షణకు సిపిఎం ఆధ్వర్యాన చేపట్టిన బైక్ యాత్ర ఆరోరోజు సోమవారం బొబ్బిలి నుంచి ప్రారంభమై రామభద్రపురం, గజపతినగరం, శృంగవరపుకోట మీదుగా అరకు చేరుకుంది. ఈ సందర్బంగా యాత్ర నాయకులకు గజపతినగరంలో ఆటో కార్మికులు, పంచాయతీ కార్మికులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. పోతనాపల్లి వద్ద సిపిఎం నాయకులు, కార్మికులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. గజపతినగరంలో సిపిఎం నాయకులు జి.శ్రీనివాస్, ఎస్.కోటలో మద్దిల రమణ అధ్యక్షతన జరిగిన సభల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి, కె.లోకనాధం, రాష్ట్ర నాయకులు జగ్గునాయుడు, జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో, 32 మంది బలిదానంతో పరిశ్రమను సాధించుకున్నామని తెలిపారు. నేడు లక్షలాదిమందికి ఉపాధి చూపిస్తున్న ఈ పరిశ్రమ నిర్మాణం కోసం ఆనాడు కేంద్ర ప్రభుత్వం రూ.4500 కోట్లు మాత్రమే కేటాయించిందని, కానీ నాటి నుంచి నేటి వరకు కేంద్ర ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ పన్నుల రూపంలోను, ఇతర డివిడెంట్ రూపంలోనూ 45 వేల కోట్ల రూపాయలు చెల్లించిందని తెలిపారు. ఇటువంటి స్టీల్ పరిశ్రమకు సొంత గనులు కేటాయించకుండా, పరిశ్రమకు ముడి సరుకును రానీయకుండా బిజెపి ప్రభుత్వం అడ్డుకుంటోం దన్నారు. పరిశ్రమను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, ఇప్పటికే స్టీల్ ప్లాంట్ లో కొంత భూమిని అదానికి అప్పగించి ప్లాంటును నష్టాల్లోకి నెట్టారని వివరించారు. పరిశ్రమను అమ్మేయడానికి కుట్రలు పన్నుతున్న బిజెపి ప్రభుత్వానికి మన రాష్ట్రంలోని అధికారపక్షం, ప్రతిపక్షంగా ఉన్న టిడిపి, జనసేన సహకరిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే బిజెపి ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటుపరం చేసేసిందని, ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుంటుబడిందని అన్నారు. పరిశ్రమలు ప్రైవేటు పరం అయితే రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ హక్కులు సర్వనాశనం అయిపోతాయని అన్నారు. ఈనేపథ్యంలో ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టుకునేందుకు మూడేళ్లగా జరుగుతున్న పోరాటానికి సిపిఎం అండదండగా నిలిచిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం కానివ్వం, ప్రభుత్వంలోనే కొనసాగిస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో సిపిఎం నాయకులు వి.లక్ష్మి, రాకోటి రాములు, గాడిఅప్పారావు, చల్లా జగన్, బలస శ్రీను, విశాఖ జిల్లా నాయకులు బొట్టా ఈశ్వరమ్మ, పద్మావతి పాల్గొన్నారు.










