ప్రజాశక్తి - ఏలూరు టౌన్
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గత 700 రోజులుగా విశాఖపట్నంలో జరుగుతున్న దీక్షలకు సంఘీభావంగా శనివారం ఏలూరులో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లో ఎఐటియుసి, ఐఎఫ్‌టియు, సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎఐటియుసి జిల్లా కన్వీనర్ బండి వెంకటేశ్వరరావు, ఐఎఫ్‌టియు రాష్ట్ర కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రయివేటుపరం కాకుండా కాపాడుకుంటామని పేర్కొన్నారు. మోడీ, అమిత్ షాలు దేశ సంపదను కార్పొరేట్ వ్యక్తులకు, ఆదానీ, అంబానీలకు అప్పగించడాన్ని వారు విమర్శించారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను మోడీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ విధానాలు మానుకోకపోతే తగిన గుణపాఠం ఉద్యోగ కార్మిక సంఘాలు చెప్తాయని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు, ఎఐటియుసి జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు, ఎ.అప్పలరాజు ఐఎఫ్‌టియు జిల్లా నాయకులు కాకర్ల అప్పారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య, ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, కె.కన్నయ్య, పోలా భాస్కర్, బల్ల కనకదుర్గారావు, కె.రాంబాబు, ఎస్.బాలు, గనిశెట్టి ఈశ్వరరావు, జనపాల రవి, యశ్వంత్ కుమార్, పి.నూకరాజు, ఐఎఫ్‌టియు నాయకులు మంగం అప్పారావు, ప్రసాద్, ఇల్లా శ్రీను, మంగం పెద్దిరాజు, పాండు, రామ్మోహన్, కె.రాజు, ఆంజనేయులు, కుమార్, సిఐటియు నాయకులు వివిఎన్.ప్రసాద్, కోటేశ్వరరావు, జి.శ్రీను పాల్గొన్నారు.










