Sep 24,2023 21:53

సభలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం

ప్రజాశక్తి-బొబ్బిలి :  విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మితే బిజెపి అంతు తేలుస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం, విజయనగరం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ హెచ్చరించారు. ఉక్కు పరిరక్షణకు సిపిఎం ఆధ్వర్యాన చేపట్టిన బైక్‌యాత్ర ఆదివారం కురుపాం, పార్వతీపురం, సాలూరు మీదుగా బొబ్బిలి చేరుకుంది. ఈ సందర్భంగా యాత్ర చేపట్టిన నాయకులకు, కార్యకర్తలకు పలుసంఘాల ఆధ్వర్యాన ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్‌టిఆర్‌ విగ్రహంజంక్షన్‌లో లోకనాధవ మాట్లాడుతూ విశాఖ ఉక్కును అమ్మితే నిరుద్యోగ యువతకు ఎలా ఉపాధి కల్పిస్తారని ప్రశ్నించారు. 32మంది ప్రాణ త్యాగాలతో విశాఖ ఉక్కును ఏర్పాటు చేయించుకున్నా మన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో లక్షమంది ఉద్యోగులు రోడ్డున పడతారన్నారు. ఎల్‌.ఐ.సి, బ్యాంకులు, రైల్వేను బిజెపి ప్రభుత్వం ఇప్పటికే అమ్మేసిందన్నారు. దేశభక్తి పేరుతో దేశానికి నష్టం చేస్తున్నారని విమర్శించారు. బిజెపి విధానాలను టిడిపి, వైసిపి, జనసేన ప్రశ్నించకుండా సమర్ధించడం అన్యాయమన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించకుండా మద్దతు ఇస్తున్నారని అన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజలకు నష్టం జరిగితే ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఎరువులు ధరలు పెరుగుతున్నా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు పెంచడం లేదన్నారు. కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటా మన్నారు. సిపిఎం నాయకులు జగన్‌ మాట్లాడుతూ విద్యార్థులు చదువు పూర్తి చేసి ఉపాధి లేక నిరుద్యోగులుగా మారుతున్నారని అన్నారు. లక్షా30వేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమను అమ్మివేయడం దుర్మార్గమన్నారు. తమ్మినేని సూర్య నారాయణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణకు మూడేళ్ల నుంచి పరిశ్రమ వద్ద నిరసనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఐక్యంగా పోరాడి విశాఖ ఉక్కును పరిరక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం విశాఖ, పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శులు జగ్గునాయుడు, రెడ్డి వేణు,ల్‌, జిల్లా నాయకులు పి.శంకరరావు, వి.ఇందిర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.