Sep 28,2022 23:06

మాట్లాడుతున్న ఉక్కు సిఎండి అతుల్‌భట్‌

40వ వార్షిక సమావేశంలో సిఎండి అతుల్‌భట్‌
ప్రజాశక్తి- ఉక్కునగరం
:గడచిన ఆర్థిక సంవత్సరంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 57శాతం వృద్ధితో రూ. 28,215 కోట్ల టర్నోవర్‌ను సాధించి, రూ.1,923 కోట్ల నగదు లాభాన్ని ఆర్జించిందని సిఎండి అతుల్‌ భట్‌ వెల్లడించారు. ఆరేళ్ల తర్వాత పన్నుకు ముందు సానుకూల లాభాలను, గతేడాది కంటే 148శాతం వృద్ధితో రూ.3469 కోట్ల ఇబిఐటిడిఎ సాధించిందన్నారు. బుధవారం విశాఖలోని రిజిస్టర్డ్‌ కార్యాలయంలో నిర్వహించిన ఆర్‌ఐఎన్‌ఎల్‌ 40వ వార్షిక సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ అండర్‌ సెక్రటరీ ఎస్‌ నారాయణస్వామి పాల్గొన్నారు.
కంపెనీ ప్రారంభం నుంచి గడచిన ఏడాదే అత్యథిక టర్నోవర్‌ను ఈ నవరత్న కంపెనీ సాధించిందని వెల్లడించారు. కోకింగ్‌ కోల్‌లో సంక్షోభం కారణంగా నాలుగో త్రైమాసికంలో కార్యకలాపాలు తగ్గినప్పటికీ, గతేడాదితో పోలిస్తే అన్ని ప్రధాన ఉత్పత్తి రంగాలలో అత్యుత్తమ పనితీరు నమోదైందన్నారు. 2021-22లో సాధించిన 5.77 మెట్రిక్‌ టన్నుల హాట్‌ మెటల్‌ ఉత్పత్తితో దేశంలోని ఏ పబ్లిక్‌ సెక్టార్‌ స్టీల్‌ప్లాంట్‌ యూనిట్‌ సాధించలేని ప్రగతితో టెక్నో ఎకనామిక్‌ పారామీటర్స్‌లో అత్యుత్తమ పనితీరు నమోదైందని వెల్లడించారు. ఆటోమొబైల్‌ రంగం ప్రభావితమైనప్పటికీ, దేశీయ విక్రయాలలో 28శాతం వృద్ధిని, ప్రాజెక్ట్స్‌ సేల్స్‌లో 81శాతం వృద్ధిని కంపెనీ సాధించిందన్నారు. కంపెనీ పురోభివృద్ధికి సహకరించిన వారందరికీ ఈసందర్భగా సిఎండి అతుల్‌భట్‌ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో కంపెనీ డైరెక్టర్స్‌ దేవ్‌ కల్యాణ్‌మొహంతి, కెకె.ఘోష్‌, ఎకె.సక్సేనా,డాక్టర్‌ సీతా సిన్హా, సునీల్‌కుమార్‌ హిరానీ, ఘనశ్యాం సింగ్‌, నరేష్‌చంద్ర గెల్లి పాల్గొన్నారు.