Nov 02,2023 23:42

మాట్లాడుతున్న శ్రీనివాసరావు

ఇచ్ఛాపురం: విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా 8న విద్యా సంస్థల బంద్‌ నిర్వహిస్తున్నామని ఎఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ ఇచ్ఛాపురం నియోజకవర్గ కేంద్రంలో విద్యార్థి యువజన సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యాన గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో సిపిఐ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సాలిన నారాయణ స్వామి, నాయకులు చాపర వెంకటరమణ, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.రవి, తెలుగు యువత అధ్యక్షులు జయదేవ్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు సంతోష్‌, జనసేన నాయకులు హరి, హేమ చలపతిలు మాట్లాడారు. దేశంలో ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు. అలాంటి ప్రభుత్వాలు విశాఖ స్టీల్‌ను ప్రయివేటీకరించేందుకు ముందుకు సాగుతుందని అన్నారు. వీరుల త్యాగఫలం కారణంగా విశాఖ ఉక్కు నిర్మాణం సాధ్యమైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్లాంట్‌ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. కానీ, ప్రభుత్వ ఆస్తులను అమ్మకం చేయడం అన్యాయం అన్నారు. కరోనా వేళలోనూ దేశానికి సేవలందించిన ఘనత విశాఖ ఉక్కు ప్లాంట్‌కు సొంతమన్నారు. ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేయకుండా అందరి కృషితో కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలూ స్వచ్ఛందంగా బందును ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు ప్రసాద్‌, వైకుంఠరావు, కృష్ణ, జనసేన నాయకులు భాస్కర్‌, కిషోర్‌, సిపిఐ నాయకులు ఈశ్వరమ్మ పాల్గొన్నారు.