Nov 06,2023 21:10

న్యూస్‌ క్లిక్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కాపీలను దహనం చేస్తున్న సిఐటియు నాయకులు

 రాయచోటి టౌన్‌ : విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆపాలని సిఐటియు జిల్లాప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు డిమాండ్‌ చేశారు. సోమవారం సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు స్థానిక రెవెన్యూ కార్యాలయ ఆవరణంలోని అంబేద్కర్‌ చిత్ర పటం వద్ద విశాఖ ఉక్కును ప్రవేటికరించరాదని కోరుతూ పోరాటం మొదలుపెట్టి 1000 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా అలాగే న్యూస్‌ క్లిక్‌ యజమాని ప్రభీర్‌ పురకాయస్త, అడ్మినిస్ట్రేట్‌ మేనేజర్‌ అభిజిత్‌ చక్రవర్తిని అరెస్టు చేయడాన్ని ప్రజాతంత్ర వాదులు అందరూ ఖండించాలని, వారిని వెంటనే విడుదల చేయాలని ఎఫ్‌ఐఆర్‌ కాపీలను దగ్ధం చేశారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియా రంగంపై ఆంక్షలు పెరిగిపోయాయని విమర్శించారు న్యూస్‌ క్లిక్‌ ప్రతినిధులు, 16 మంది పాత్రికేయులపై ఉపా చట్టం కింద కేసులు బనాయించారని ఇది తీవ్రమైన అన్యాయం అని అన్నారు. దేశంలో మీడియా స్వేచ్ఛ మరింత దిగజారిందని తెలియజేశారు. న్యూస్‌ క్లిక్‌కు విదేశాల నుండి ఆర్థికంగా సహాయమందుతుందనే పేరుతో వారిని అరెస్టు చేశారని తెలిపారు. రాబోవు కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కక్ష సాధింపులకు వ్యతిరేకంగా నిర్వహించే ప్రజా ఉద్యమాలలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రయివేటుకరించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని టిడిపి, వైసిపి విశాఖ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి ఉంటే కేంద్రం వెనక్కి తగ్గేదన్నారు. ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వంతో చట్టపట్టాల్‌ వేసుకొని ముందుకు సాగకుండా తెగతెంపులు చేసుకోవాలని కోరారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వెయ్యి రోజులే కాదని ఇంకా రెండు వేల రోజులైనా పోరాడుతామని వారన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు చెన్నయ్య, రాంబాబు, మాధవయ్య, వెంకటరమణ, రైతులు నరసింహులు, శంకరయ్య, తిరుపతయ్య, జకరయ్యతో పాటు వ్యవసాయ కార్మికులు మంగమ్మ, నారాయణమ్మ పాల్గొన్నారు.