Nov 07,2023 00:06

ఆందోళన చేస్తున్న నాయకులు

* ఆందోళనలపై కేంద్రం
 స్పందించకపోవడం దుర్మార్గం
* ఎపి రైతు సంఘం
జిల్లా కార్యదర్శి మోహనరావు
* మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక
విధానాలకు సంఘీభావ దినం
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి: 
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తున్న విశాఖ ఉక్కును ప్రయివేటీకరించాలని చూడటం అన్యాయమని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక అంబేద్కర్‌ కూడలి వద్ద సోమవారం సంయుక్త కిసాన్‌ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల సమైక్య ఆధ్వార్యాన మోడీ ప్రభుత్వ రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక, కర్షక సంఘీభావ దినం సందర్భంగా చేపట్టిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. విశాఖ స్టీల్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు వెయ్యి రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నా... కేంద్రంలోని మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. దేశంలో అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్టీల్‌ ప్లాంట్లకు సొంత గనులు ఉన్నాయని, విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌కు మాత్రం కేటాయించలేదని చెప్పారు. రూ.మూడు లక్షల కోట్లు విలువైన ఉక్కు కర్మాగారాన్ని చౌకగా దక్షిణ కొరియాకు చెందిన పోస్కోకు అదానీకి కారు చౌకగా అప్పగించేందుకు మోడీ శతవిధాలా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజలు, కార్మికులు తీవ్రంగా ఉద్యమించడం వల్లే ఉక్కును ప్రయివేటీకరణం చేయడం వల్లే మోడీ ప్రభుత్వానికి సాధ్యం కాలేదన్నారు.
సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక, రైతు, ప్రజా ఉద్యమాలకు అండగా నిలుస్తూ, మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఐక్య ఉద్యమానికి మద్దతుగా నిలబడిన న్యూస్‌ క్లిక్‌ వార్త ఛానల్‌పై మోడీ ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛనూ మోడీ ప్రభుత్వం కాలరాసిందని విమర్శించారు. న్యూస్‌ క్లిక్‌ జర్నలిస్టులు ప్రవీణ్‌ పురకాయస్త, అమిత్‌ చక్రవర్తులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి జైల్లో పెట్టిందన్నారు. జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించి వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు ఉద్యమాన్ని మోడీ ప్రభుత్వం జాతి వ్యతిరేకమైనది గాను, ఈ ఉద్యమానికి విదేశాల నుంచి, ఉగ్రవాదుల నుంచి నిధులు వస్తున్నాయని తప్పుడు ఆరోపణల ప్రచారాన్ని మోడీ ప్రభుత్వం మానుకోవాలన్నారు. కిసాన్‌ రైతు కాంగ్రెస్‌ నాయుకులు ఎస్‌.అన్నాజీరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతోందని విమర్శించారు. ప్రభుత్వరంగ పరిశ్రమలు, రైల్వేలు, బ్యాంకులు, ఎల్‌ఐసి, రక్షణ రంగం, గనులను కార్పొరేట్లకు కట్టబెడుతోందని విమర్శించారు. ఎఐటియుసి నాయకులు చిక్కాల గోవిందరావు మాట్లాడుతూ కార్మిక హక్కులు కాలరాస్తూ పెట్టుబడిదారులకు కార్మికులను బానిసలుగా మార్చేంచేందుకు కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్‌లు తీసుకొచ్చిందని చెప్పారు. అనంతరం న్యూస్‌ క్లిక్‌ ఎడిటర్‌, సిబ్బందిపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని దహనం చేశారు. కార్యక్రమంలో కార్మిక రైతు సంఘాలు నాయుకులు బి.కృష్ణమూర్తి, అల్లు సత్యనారాయణ, ఎన్‌.గణపతి, ఎం.ఆదినారాయణమూర్తి, హెచ్‌.ఈశ్వరరావు, కె.సూరయ్య, చంద్రశేఖర్‌, జి.అమరావతి, పి.గోపి, ఎం.రమణ, అశోక్‌, గోపాల్‌ పాల్గొన్నారు.