ప్రజాశక్తి-కాకినాడ విశాఖ ఉక్కు పరిరక్షణకు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 3న జరిగే రాస్తారోకోను జయప్రదం చేయాలని పలువురు పిలుపు ఇచ్చారు. కచేరిపేటలోని సిఐటియు కార్యాలయంలో ఆదివారం కేంద్ర కార్మిక సంఘాల సన్నాహక సమావేశం ఐఎఫ్‌టియు రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, సిఐటియు అఖిలభారత ఉపద్యక్షురాలు జి.బేబిరాణి, ఐఎఫ్‌టియు జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ, ఐఎన్‌టియుసి కాకినాడ నగర అధ్యక్షులు తాళ్లూరి రాజు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను దొడ్డిదారిన ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇటీవల కేంద్ర మంత్రి విశాఖ ఉక్కు పరిశ్రమను సందర్శించిన సందర్భంగా ఇప్పట్లో ప్రైవేటీకరణ చేయమని ప్రకటించిన గంటల్లోనే మాట మార్చి ఆంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా 30 వేల మందికి, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పించే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం అంటే ఉన్న ఉద్యోగులను తొలగించడమేనని గుర్తు చేశారు. బిజెపి ప్రభుత్వం పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ 150 సంవత్సరాల చరిత్ర గల పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపును రద్దు చేయడాన్ని ఖండిస్తూ పోస్టల్ ఉద్యోగులు చేసే పోరాటాలకు కేంద్ర కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు మూతపడుతున్న పరిస్థితుల్లో నవరత్న హోదా కలిగిన విశాఖ ఉక్కుని కాపాడుకునేందుకు కేంద్ర కార్మిక సంఘాలు చేసే పోరాటాలకు ప్రజలు, రాష్ట్ర అభివద్ధిని ఆకాంక్షించే మేధావులు, అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సన్నాహక సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వా శేషబాబ్జి, చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకా రమణ, నగర ఉపాధ్యక్షులు మేడిశెట్టి వెంకటరమణ, ఐఎన్‌టియుసి ఉపాద్యక్షురాలు కె.రమాదేవి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ భాషా, మెంబర్ దేవి పాల్గొన్నారు.










