Nov 07,2023 23:15

నేడు విద్యాసంస్థల బంద్‌

విశాఖ ఉక్కు పరిరక్షణ, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం



నేడు విద్యాసంస్థల బంద్‌
ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: విశాఖ ఉక్కు పరిరక్షణ, కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని నవంబర్‌ 8న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ జయప్రదం చేయాలని పలు విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు. స్థానిక బైరాగిపట్టేడలో విద్యార్ధి, యువజన సంఘాల ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రధానకార్యదర్శి దినేష్‌, డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మాధవ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండి చలపతి, పిడిఎస్యూ రాష్ట్ర నాయకులు ఆదిలి మాట్లాడుతూ విద్యార్థి, యువజన నాయకులు 32మంది ప్రాణత్యాగాలతో ఏర్పాటైన విశాఖఉక్కు ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకోవడాన్ని నిరసిస్తూ జరుగుతున్న ఆత్మగౌరవ పోరాటం నవంబర్‌ 8 నాటికి 1000 రోజులు పూర్తి అయ్యిందన్నారు. ఈసందర్భంగా వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ప్రత్యక్ష ఆందోళనలకు పిలుపునిచ్చాయన్నారు. కరోనా కష్టకాలంలో లక్షల మందికి ఆక్సిజన్‌ అందజేసి ప్రాణాలు నిలబెట్టిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెట్టాలన్న ఆలోచన దుర్మార్గమన్నారు. లాభాలు వస్తున్నా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇనుప గనులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనే ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయితే లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా వెనుకబడిన ప్రాంతాలు అభివద్ధికి నిధులు కేటాయించకుండా నూతన పరిశ్రమలు ఏర్పాటు వంటి విభజన హామీలు అమలు చేయాలని రాష్ట్రంలోని బిజెపి నేతలు మోడీని ప్రశ్నించకపోవడం సిగ్గుచేటు అన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల కంటే ముఖ్యమంత్రికి వ్యక్తిగత ప్రయోజనాలు ఎక్కువ అయ్యాయని ఆరోపించారు. కేసుల భయంతో మోడీ ముందు మోకరిల్లుతున్నారని దుయ్యబట్టారు. తన సొంత జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం రెండుసార్లు శంకుస్థాపన చేసినా ఆచరణలో పురోగతి లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి స్థానిక యువతకి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థి,యువజన సంఘాల ఆధ్వర్యంలో నవంబర్‌ 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కేజీ టు పేజీ వరకు జరిగే విద్యాసంస్థల బంద్‌కు జిల్లాలోని విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, మేధావులు, ప్రజలు ప్రతి ఒక్కరు మద్దతు తెలిపి సహకరించాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రవి, అక్బర్‌, శివ, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు నవీన్‌, సుందర్‌ రాజు, ఓమ్‌రాజ్‌, హరి కష్ణ, వినరు తదితరులు పాల్గొన్నారు.