
ప్రజాశక్తి- విలేకర్ల బృందం
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ, పరిశ్రమను పరిరక్షించాలని కోరుతూ వామపక్ష పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యాన బుధవారం అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లిలో రాస్తారోకో చేస్తున్న అఖిలపక్ష నాయకులను పోలీసులు అరెస్టులు చేశారు.
అనకాపల్లి : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్ (నెహ్రూచౌక్)లో సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్ (లిబరేషన్), కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సిఐటియు, ఎఐటియుసి, ఐద్వా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అరగంట పాటు నాలుగు రోడ్ల కూడలిని దిగ్బంధం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పట్టణ సిఐ డి.మోహన్‌రావు ఆధ్వర్యంలో ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తులపై విడుదల చేశారు. అరెస్టయి వారిలో రుత్తల శంకరరావు, జి.కోటేశ్వరరావు, దాకారపు శ్రీనివాసరావు (సిఐటియు), వైఎన్.భద్రం, కోన లక్ష్మణ్ (ఎఐటియుసి), డిడి.వరలక్ష్మి, జి.సుభాషిణి (ఐద్వా), ఎ.బాలకృష్ణ (కౌలు రైతు సంఘం), కోన మోహన్ (రైతు కూలి సంఘం), బాలేపల్లి వెంకటరమణ, రాజాన దొరబాబు (సిపిఐ), వివి.శ్రీనివాసరావు, అల్లు రాజు (సిపిఎం), బొడ్డు శ్రీనివాసరావు, ఐఆర్.గంగాధర్ (కాంగ్రెస్), పిఎస్ అజరు కుమార్ (సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ), కొణతాల హరినాథ్ బాబు (ఆప్) తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కార్మికులు 800 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నా, ప్రజాభిప్రాయాన్ని లెక్కచేయకుండా బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు ప్రశ్నించకపోగా, కేంద్ర బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. 32 మంది ప్రజల బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కానివ్వమని స్పష్టం చేశారు.
పరవాడ : సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో పరవాడ సినిమా హాల్ జంక్షన్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు వివి.రమణ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఆకాశ మార్గంలో ముఖ్యమంత్రి వెళ్లితే రోడ్డుపై నిరసనలు జరగకుండా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌కు కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం లేక, పోరాటం చేసే వారిపై నిర్బంధం ప్రయోగిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొప్పాక దేముడు. సిఐటియు నాయకులు జి శ్రీను, పి అప్పారావు, కె. నాయుడు, బి నూకరాజు, కె. దుర్గమ్మ, పి అప్పారావు పాల్గొన్నారు.
సబ్బవరం : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో దుర్గమాంబ ముఠా కళాసీలు మండల కేంద్రంలో నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ఉప్పాడ సత్యవతి, నాయకులు నూకరాజు, రమణ, బంగారు నాయుడు, రాంబాబు పాల్గొన్నారు.
రాంబిల్లి : మండల కేంద్రం రాంబిల్లిలో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యాన రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి జి.దేముడునాయుడు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్.పవన్ కుమార్, కె.నూకరత్నం, రాము, సిఐటియు నాయకులు అప్పలరాజు, సత్తెయ్య, బంగార్రాజు, ఎన్.నారాయణరావు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : సిపిఎం మండల కన్వీనర్ ఆర్.రాము ఆధ్వర్యంలో అచ్యుతాపురం జంక్షన్‌లో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణకు వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ఉద్యమంలోకి కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దమ్ము చంటి, పోలవరం అప్పారావు, ఒడిసెల శ్యామ్, దమ్ము శ్రీను, ఈగల తాతారావు, వెంకట్, పాము రవి పాల్గొన్నారు.
కె.కోటపాడు : ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండలంలోని ఎ.కోడూరు గ్రామంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయన బాబు మాట్లాడుతూ రూ.3లక్షల కోట్లు విలువైన స్టీల్‌ప్లాంట్‌ను కేవలం 30 వేల కోట్లకు ప్రైవేటువారికి కట్టబెట్టాలని చూడటం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి వనము సూర్యనారాయణ, సిపిఐ మండల కార్యదర్శి గొర్రె దేవుడు బాబు పాల్గొన్నారు.
నర్సీపట్నంటౌన్ : స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట వామపక్ష నేతలు రాస్తారోకో నిర్వహించారు. సిపిఐ, సిపిఎం జిల్లా నాయకులు మాకిరెడ్డి రామునాయుడు, డి.సత్తిబాబు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆస్తులను అమ్మడమే లక్ష్యంగా బిజెపి పెట్టుకుందన్నారు. ఇటువంటి పరిశ్రమలను దేశవ్యాప్తంగా పెట్టి నిరుద్యోగులను కాపాడవలసింది పోయి ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు జి.గురుబాబు, కె.ప్రసన్న, శివలంక కొండలరావు, మేకా సత్యనారాయణ, నల్లబెల్లి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు