విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం
కార్మిక, రైతు సంఘాల హెచ్చరిక
ప్రజాశక్తి - నంద్యాల
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు నినాదంతో 32 మంది ప్రాణ త్యాగం చేసి పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును బిజెపి ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారీ సంస్థలకు అప్పనంగా అప్ప చెప్పడం సరైంది కాదని ప్రభుత్వమే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడపాలని కోరుతూ సిఐటియు, ఏఐటియుసిల ఆధ్వర్యంలో బుధవారం శ్రీనివాస సెంటర్లో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు అధ్యక్షులు లక్ష్మణ్, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు ఏఐటిసి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లలితమ్మ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ , రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ రాజశేఖర్, సిఐటియు జిల్లా కార్యదర్శి పి. వెంకట లింగం, డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిలు లక్ష్మణ్, నాగరాముడు, ధనుంజయుడు లతోపాటు సిఐటియు ఎఐటియుసి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం తగదని, ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడం వలన ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రైవేటీకరణ చేస్తే అన్ని రకాల భారాలు పెరగడంతో పాటు ఉద్యోగ భద్రత, కార్మికులకు ,ఉద్యోగులకు లేకుండా పోతుందని వేల ఎకరాల్లో ఉన్న భూమిని కారుతూకగా కొన్ని కొన్ని సంవత్సరాలపాటు నడిపి తర్వాత మా చేత కావడం లేదని ఫ్యాక్టరీని మూసి వేల ఎకరాలను సొంతం చేసుకుని వేల కోట్లు సంపాదించుకోవడం జరుగుతుందని అన్నారు. కేంద్ర మంత్రులు ఒకసారి ప్రైవేటీకరణ చేయడం లేదని మళ్లీ రెండు రోజుల తర్వాత తప్పకుండా చేస్తామని ప్రజలను, కార్మికులను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని వీటన్నింటికీ పుల్ స్టాప్ పెట్టేలా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను చేయడం లేదని బిజెపి ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్మికులు, ఉద్యోగులు దాదాపు 400 రోజులపాటు పరిశ్రమలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న బిజెపి ప్రభుత్వానికి కనపడడం లేదా అని అన్నారు. రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ప్రతిపక్ష టీడీపీలు, జనసేన పార్టీలు మోడీకి ఎదురుగా వ్యతిరేకంగా పోరాడకుండా కార్మికుల దగ్గరకు వచ్చి మేము మద్దతు అని మాయ మాటలు చెప్తున్నాయని, ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ దగ్గరకు వెళ్లి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపండి అని కోరడం లేదని అన్నారు. రాబోయే కాలంలో అన్ని పార్టీలను కలుపుకొని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేంత వరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని, ప్రజల సహకరించాలని అన్నారు.










