1966 నవంబర్ 1వ తేదీన విశాఖ వీధుల్లోకి వచ్చిన విద్యార్థుల ప్రవాహం ఉవ్వెత్తున ఎగసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆబాల గోపాలన్ని కదిలించింది. ఉపాధి కోసం జరిగిన మహత్తర పోరాటం అది. విశాఖ స్టీల్‌ప్లాంట్ వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశ పెట్టిన ప్రభుత్వమే ఈ ఉద్యమాన్ని క్రూరంగా అణిచే ప్రయత్నం చేసింది. ప్రాణ త్యాగానికి మించింది మరొకటి లేదు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు మహోద్యమం నడిపించి 32 మంది ప్రాణ త్యాగం చేశారు. వారి త్యాగాలు మరువలేం. భారతదేశం లోనే ప్రాణాలర్పించి సాధించిన భారీ కర్మాగారం విశాఖ స్టీల్‌ప్లాంట్. ఒకవైపు విశాఖ ఉక్కు, మరోవైపున నందికొండ (నాగార్జున సాగర్) కోసం జరిగిన పోరాటాలకు ఆనాడు బలమైన శక్తిగా వున్న కమ్యూనిస్టులు నాయకత్వం వహించారు. ఉక్కు ఫ్యాక్టరీని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరించినా ప్రజలు పోరాడి సాధించుకున్నారు. స్టీల్ ఆనాడు సామాన్య ప్రజలకు వాడుకలో లేదు. కాని విశాఖ స్టీల్‌ప్లాంట్ వస్తే వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని జరిగిన ఉద్యమం అది. వేలాది మందికి విశాఖ స్టీల్ వల్ల ఉద్యోగాలొచ్చాయి. ఈ ఉద్యమాల ఫలితంగా వెనుకడిన ప్రాంతం అత్యంత అభివృద్ధిని సాధించింది. నాగార్జున సాగర్ వల్ల ఆ ప్రాంతం సస్యశ్యామలమైంది. లక్షలాది ఎకరాల్లో రైతులు పాడి పంటలు పుష్కలంగా అభివృద్ధి చేశారు. 1960వ దశకంలో భారతదేశంలో పెనుమార్పులు జరిగాయి. మూడు రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు బలమైన శక్తిగా ఎదిగారు. నాటికి తిరుగులేని కాంగ్రెస్ 1967లో 7 రాష్ట్రాల్లో ఓడిపోయింది. ప్రపంచంలో సోవియట్ యూనియన్ శాస్త్ర, సాంకేతిక రంగంలో ఘన విజయాలు సాధించింది. వియత్నాంలో తిరుగుబాటు కొనసాగుతున్న కాలం అది.
విశాఖ ఉక్కు పోరాటం ఒక గొప్ప మహోద్యమం. ఆనాడు ఈ ఉద్యమంలో పాల్గొనని ప్రజలు లేరంటే అతిశయోక్తి కాదు. విద్యార్థులు నెలల తరబడి స్కూళ్లు, కాలేజీలు మానేసి ఈ ఉద్యమమే తమ ధ్యేయంగా పాల్గొన్నారు. అక్టోబర్ 15 నుంచి అమృతరావు నిరాహారదీక్ష ప్రారంభించారు. 1966 అక్టోబర్ 21న విశాఖ నగరంలో విద్యార్థులు, వివిధ పార్టీల వారు కలిసి పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. అక్టోబర్ 27 నుంచి విద్యార్థుల నిరవధిక సమ్మె ఉధృతమైంది. ఆంధ్రా మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు నాయకత్వం వహించారు. అక్టోబర్ 29న గోపాలపట్నం వద్ద మద్రాస్-హౌరా మెయిల్‌ను నిలిపివేశారు. పట్టాల మీదంతా జనమే. విశాఖ ఉక్కు నినాదం మారుమోగింది. ఆలిండియా రేడియోలో ఈ వార్త విని హౌరా-మద్రాస్ మెయిల్‌ను అనకాపల్లిలో నిలిపివేశారు. రాష్ట్రమంతా అన్ని రైల్వే స్టేషన్లలోను రైళ్లు ఆగాయి. రైళ్ళ బోగీలు, బ్యాంకులు తగలబడ్డాయి. అక్టోబర్ 31న విజయవాడలో 20 వేల మందితో విద్యార్థుల ప్రదర్శన పోటెత్తింది. విజయవాడ రైవస్ కాలువ వద్ద సంజీవరెడ్డి విగ్రహం సమీపంలో తుపాకీ కాల్పుల్లో విద్యార్థులు మరణించారు. గుంటూరు, నెల్లూరు, వరంగల్, కాకినాడ లాంటి ప్రతి పట్టణంలోనూ ఆనాడు ఆందోళనలు ఉధృతంగా సాగాయి.
1966 నవంబర్ 1వ తేదీన మంగళవారం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకోవలసిన వేళ. విశాఖపట్నంలో మాత్రం నిర్బంధం, నిరంకుశత్వం పూర్తిగా ఆవహించింది. ప్రభుత్వం ఇనుప బూట్ల బలగాలను దించింది. కర్ఫ్యూ విధించింది. విశాఖ వీధులన్నీ పోలీసు పహారాతో నిండిపోయాయి. వేలాది మంది విద్యార్థులు ఉదయం 10 గంటలకు ఓల్డ్ టౌన్‌లో గుమిగూడారు. పోలీసులు విచక్షణా రహితంగా లాఠీÄచార్జ్ చేశారు. మహిళలు, పిల్లలతో సహా జనం ఎదురొడ్డి నిలబడ్డారు. పోలీసులు వెనకడుగు వేయక తప్పలేదు. మరోసారి ఉదయం 11.30 గంటల ప్రాంతంలో పోలీసు బలగాలను పెద్దఎత్తున మోహరించి భాష్పవాయు ప్రయోగం కూడా లేకుండా నేరుగా ప్రజలపై కాల్పులకు తెగబడ్డారు. శరీరాలు నుజ్జు నుజ్జు అయినా, రోడ్లపై రక్తపు మడుగులు పెట్టినా ప్రజలు ఏ మాత్రం వెరవకుండా నిలబడ్డారు. మొట్టమొదట తూటా తొమ్మిదేళ్ల పసివాడిని బలిగొంది. ఆ పిల్లవాడికి మంచినీళ్లు పట్టబోయిన మరో యువకుడిపై తుపాకీ తూటా పేలింది. అక్కడికక్కడే తొమ్మిది మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. పాత పోస్టాఫీసు మెహిది ఆయుధాల షాపు వద్ద మరో ఇద్దరి ప్రాణాలు పోయాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఈ ఉద్యమంలో తమ ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నంలో జరిగిన ఈ ఉద్యమానికి తెన్నేటి విశ్వనాథం, వరలహాల శెట్టి, సిపిఎం కార్యదర్శి వాసిరెడ్డి వెంకటప్పయ్య, పోతిన సన్యాసిరావు, విద్యార్థి పోరాట కమిటీ కన్వీనర్లు కొల్లా రాజమోహన్‌రావు, హెచ్.ఏ దొర తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 2న రాష్ట్ర వ్యాప్త బంద్ జరిగింది. పుచ్చలపల్లి సుందరయ్య కాల్పులను ఖండించారు. నవంబర్ 3వ తేదీ ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ఒత్తిడితో అమృతరావు నిరాహారదీక్ష ముగించారు. నవంబర్ 3వ తేదీ లోక్‌సభలో విశాఖ ఉక్కు కాల్పులపై కొల్లా వెంకయ్య, మాదాల నారాయణ స్వామి మాట్లాడారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిపిఎం, సిపిఐ పార్లమెంట్ సభ్యులు ఏడుగురు రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 15న నుంచి శాసన సభ సమావేశాల్లో సిపిఎం తరపున ప్రతిపక్ష నాయకుడు తరిమెల నాగిరెడ్డి మృతవీరులకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపట్టారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాయి. చర్చించడానికి, చనిపోయిన వారి పేర్లు ప్రకటించడానికి కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరించింది. శాసనసభ నుంచి నవంబర్ 18వ తేదీన 53 మంది కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు, మరో 14 మంది ప్రతిపక్ష సభ్యులు మొత్తం కలిపి 67 మంది రాజీనామా చేశారు. నవంబర్ 21 కాకినాడలో జరిగిన ఉద్యమ కమిటీ భవిష్యత్ కార్యక్రమాలు రూపొందించారు. శాసన మండలిలో నండూరి ప్రసాదరావు నాయకత్వంలో విశాఖ ఉక్కుపై ప్రకటన చేశారు. తరువాత రాజీనామాలు చేశారు.
విశాఖ లోనే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పడాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఆంగ్లో అమెరికన్ కన్సార్టియం 1965 జూన్ 25న నివేదిక ఇచ్చింది. ఆనాటికి దేశంలో భిలారు, బొకారో, దుర్గాపూర్, రూర్కెలా వంటి భారీ స్టీల్ పరిశ్రమలన్నీ ఉత్తరాది రాష్ట్రాల్లోనే వెలిశాయి. కాని ఈ నివేదిక సముద్ర తీరంలో వున్న విశాఖపట్నంలో భారీ కర్మాగారం నిర్మించడం వల్ల వ్యయం తక్కువ అవుతుందని, ఎగుమతి, దిగుమతులకు సముద్రతీరం అనువైన ప్రదేశంగాను నిర్ణయించింది. హైదరాబాద్‌లో లాల్‌బహదూర్ శాస్త్రి ఇదే విషయాన్ని ప్రకటించారు. ప్రభుత్వం నిర్ణయించిన నివేదికను ఎవరూ మార్చలేరని కూడా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. విశాఖలో 5వ ఉక్కు కార్మగారం ఏర్పాటు చేయాలని 1966 జులై 5న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కాని కాంగ్రెస్ అఖిల భారత అధ్యక్షుడు కామరాజు నాడార్, కర్ణాటక ముఖ్యమంత్రి నిజలింగప్ప ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది. భారీ కర్మాగారాన్ని మూడుముక్కలు చేస్తామని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం మరో ఉప సంఘాన్ని నియమించింది. ఆనాడు కేంద్ర ఉక్కు మంత్రిగా నీలం సంజీవరెడ్డి అచేతనంగా వుండడం ఆంధ్ర ప్రజలకు ఆగ్రహం కలిగించింది. నిపుణుల కమిటీ విశాఖపై మొగ్గు చూపినా కేంద్రం నిరాకరించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఆగ్రహం కలిగించింది. ఆనాడు అసెంబ్లీలో 53 మంది కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు వుండడం ఉద్యమానికి బలం చేకూర్చింది. ప్రతిపక్ష నాయకులు తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న, వావిలాల గోపాలకృష్ణయ్య వంటి ఉద్దండులు ఈ ఉద్యమంలో పాల్గొని కాంగ్రెస్ దుర్మార్గాన్ని ఖండించారు.
1967లో ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించలేదు. కాని 1971లో కాంగ్రెస్ నిట్టనిలువుగా సిండికేట్ కాంగ్రెస్, ఇండికేట్ కాంగ్రెస్‌గా చీలిపోయింది. ఎన్నికల కోసం 1971 జనవరి 20వ తేదీన బాలచెరువు వద్ద ఫైలాన్ ఏర్పాటుతో ఇందిరా గాంధీ శంకుస్థాపన చేశారు. కాని అధికారంలో వున్న ఆరేళ్లలో కాంగ్రెస్ విశాఖ ఉక్కు కర్మాగార నిర్మాణానికి పూనుకోలేదు. జనతా ప్రభుత్వ హయాంలో 1978-79 బడ్జెట్‌లో రూ.1000 కోట్లు గ్రాంట్ ప్రకటించి, నిధులు విడుదల చేయడంతో నిర్మాణం ప్రారంభమైంది. కాని జనతా ప్రభుత్వం కూలిపోయి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి విశాఖ ఉక్కుకు మరలా కష్టాలు మొదలై...5 సంవత్సరాల్లో నిర్మించాల్సిన స్టీల్‌ప్లాంట్ నిర్మాణం పదేళ్లు పట్టింది. 1.8.1992 పి.వి నరసింహారావు 3 మి.లి టన్నుల విశాఖ స్టీల్‌ను జాతికి అంకితం చేశారు. అదే కాలంలో ప్రైవేటీకరణ విధానాలు ప్రారంభం కావడంతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు వచ్చినన్ని కష్టాలను దేశంలో మరే పరిశ్రమ ఎదుర్కొనలేదు. అయినా కార్మికులు, ప్రజల ఐక్యతతో నిరంతర ఉద్యమాలతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో నేటికి ఒక్క శాతం కూడా వాటాలు అమ్మకుండా కాపాడుకున్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం నేడు ప్రైవేట్‌పరం చేయాలని ఎంత ప్రయత్నించినా వమ్ముచేయగలం. ప్రైవేటీకరణను అడ్డుకోగలం. 32 మంది ప్రాణాల బలిదానంతో సాధించిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మకుండా...మహత్తర పోరాటాలకు సిద్ధమై, ఐక్య ఉద్యమాల ద్వారా ఆపగలం. ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రజానీకాన్ని ఈ ఉద్యమాలకు సిద్ధం చేయడం నేడు ప్రతి ఒక్కరి కర్తవ్యం. విశాఖ పోస్టాఫీసు వద్ద నవంబర్ 1న 'విశాఖ ఉక్కు అమరవీరుల త్యాగాలు వృధా కానివ్వం' అనే సంస్మరణ సభను జరపడం...నాటి మృతవీరులను స్మరించుకొని ముందడుగు వేసే కర్తవ్యానికి ప్రతినబూనడమే.
-
సి.హెచ్. నరసింగరావు / వ్యాసకర్త - విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ /










