Jul 23,2021 21:07
  • కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు స్టీల్‌ప్లాంటు పరిరక్షణ పోరాట నేతలు వినతి
  • పరిశీలిస్తామన్న కేంద్ర మంత్రి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : విశాఖపట్నం స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరించొద్దని స్టీల్‌ప్లాంటు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు కోరారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆమె కార్యాలయంలో స్టీల్‌ప్లాంటు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు, వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి కలిశారు. విశాఖ స్టీల్‌ప్లాంటును విక్రయించే ఆలోచనను ఉపసంహరించుకోవాలని వినతి అందించారు. 'అనేక ఏళ్ల పోరాటాలు, 32 మంది ఆత్మబలిదానాల అనంతరం 1966లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించి ఆంధ్రుల చిరకాల కల నెరవేరింది. ఈ పరిశ్రమ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో నవరత్నగా నిలిచిన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్‌కే ఆభరణం వంటిది. 35 వేల మంది ఉద్యోగులు, కార్మికులతోపాటు లక్షకుపైగా కుటుంబాలు విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుపై ఆధారపడి జీవనోపాధిని కొనసాగిస్తున్నాయి. స్టీల్‌ప్లాంటు కారణంగానే విశాఖపట్నం మహా నగరంగా విస్తరించి రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా భాసిల్లుతోంది' అని కేంద్ర మంత్రికి వివరించారు. కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టించిన సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ద్వారా దేశంలోని అనేక ప్రాంతాలకు లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను రైళ్ల ద్వారా తరలించి లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులో ఉత్పత్తయ్యే స్టీల్‌ నాణ్యతలో ప్రపంచస్థాయి సంస్థలకు పోటీ ఇస్తుందని తెలిపారు. అలాంటి సంస్థ కేవలం సొంతంగా గనులు లేకపోయినందునే నష్టాలను చవిచూడాల్సి వస్తోందని వివరించారు. కేవలం ఇనుప ఖనిజాన్ని మార్కెట్‌ రేటుకు కొనుగోలు చేయడం కోసమే ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఏటా రూ.300 కోట్లు అదనంగా భరించాల్సి వస్తోందని, ఈ పరిస్థితుల దృష్ట్యా ఆర్‌ఐఎన్‌ఎల్‌కు సొంత గనులు కేటాయించి, అప్పులను ఈక్విటీ కింద మారిస్తే అతి తక్కువ కాలంలోనే విశాఖ ఉక్కు తిరిగి లాభాల బాట పడుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. వీటిపై స్పందించిన కేంద్ర మంత్రి వినతిపత్రం ఇచ్చారుగా.. చూస్తామని, పరిశీలిస్తామని పేర్కొన్నారు.

ఉద్యమానికి మద్దతివ్వండి
స్టీల్‌ప్లాంటు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు రెండో రోజు మద్దతును కూడగట్టారు. ఈ మేరకు శుక్రవారం రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున్‌ ఖర్గే, తృణమూల్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేత సుదీప్‌ బందోపాధ్యాయ, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ ఎంపి శశిథరూర్‌, స్టీల్‌ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, లోక్‌సభ ఎంపి రేవంత్‌ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జెడి శీలంను కలిశారు. మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవహారిక శైలి పేద ప్రజల భవిష్యత్తును ఆంధకారంలో నెట్టేలా ఉందని దుయ్యబట్టారు. లాభాల్లో ఉన్న పరిశ్రమలను అమ్మడం వెనుక పెద్ద కుట్ర ఉందని, కేంద్ర ప్రభుత్వం తన బంధు వర్గానికి రూ.వేల కోట్ల దేశ సంపదను కారుచౌకగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. స్టీల్‌ప్లాంటు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్లు సిహెచ్‌ నర్సింగరావు, మంత్రి రాజశేఖర్‌, డి.ఆదినారాయణ, జి.గణపతిరెడ్డి, ఎం.అంబేద్కర్‌, వరసాల శ్రీనివాసరావు, పి.దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.