Jan 17,2023 22:45

సంతకాలు సేకరిస్తున్న ప్రజా సంఘాల నాయకులు

ప్రజాశక్తి- కె.కోటపాడు
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని కోరుతూ మండలంలోని ఎ.కోడూరు గ్రామంలో మంగళవారం మల్లికార్జున తీర్థం సందర్భంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల మండల కన్వీనర్‌ ఎర్ర దేవుడు, స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగి రొంగలి వెంకట్రావు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి నాటి కేంద్ర ప్రభుత్వం రూ.5వేల కోట్లు ఇవ్వడం, ఈ కాలంలో స్టీల్‌ప్లాంట్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.59 వేల కోట్ల రూపాయలు డివిడెంట్‌ రూపంలో చెల్లించిందని తెలిపారు. విశాఖస్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు ఇవ్వలేదని, అవి ఉంటే మరింతగా లాభాలు వచ్చేవని పేర్కొన్నారు. ప్రైవేటు స్టీల్‌ పరిశ్రమలకు ఇనుప ఖనిజాలు ఇస్తున్న కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ప్రతి ఏటా2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయొద్దని 700 రోజుల పైబడి ఆందోళన చేస్తున్నా పాలకులు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకొనేందుకు కార్మికులు, రైతులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డు అప్పారావు, రాయవరపు సింహాచలం, వనము సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.